గడ్డుకాలం...

19 Aug, 2014 02:43 IST|Sakshi
గడ్డుకాలం...

సాక్షి, బెంగళూరు : ప్రస్తుతం జేడీఎస్ పార్టీ కష్టకాలంలో ఉందని ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు దేవెగౌడ పేర్కొన్నారు. నాయకుల మధ్య భేదాబిప్రాయాలు ఉన్నమాట వాస్తవమని వాటిని కొలిక్కి తెచ్చే సామర్థ్యం తనకుందన్నారు. బెంగళూరులోని ప్యాలెస్ మైదానంలో సోమవారం జరిగిన పార్టీ బృహత్ సమావేశంలో ఆయన నాయకులను, కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగించారు. రాష్ట్రంలో జేడీఎస్ పార్టీ ఉనికి లేకుండా చేయడానికి అనేక మంది చాలా ప్రయత్నాలు చేస్తున్నారన్నారు.

ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ప్రత్యక్షంగానే జేడీఎస్ పార్టీ నాయకులను కాంగ్రెస్‌లో చేరమని ప్రోత్సహిస్తున్నారన్నారు. ఈ విషయాలన్నింటినీ నిషిత దృష్టితో గమనిస్తున్నానన్నారు. ఆయన ప్రయత్నాలను సాగనివ్వబోనన్నారు. ఈ వయసులో కూడా పార్టీని పటిష్ట పరిచే సామర్థ్యం తనకుందన్నారు. తన సామర్థ్యంపై విశ్వాసం ఉన్నవారు తనతో పాటు ఉండవచ్చునని లేదా పార్టీని వదిలీ ఇతర పార్టీలోకి వెళ్లవచ్చునని పునరుద్ఘాటించారు.

ఇటీవల మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామితో పాటు జేడీఎస్ నాయకుడు రేవణ్ణ ఢిల్లీ వెళ్లిన మాట వాస్తవమన్నారు. దీంతో కొన్ని మీడియా సంస్థలు కుమారస్వామి కాంగ్రెస్‌లో చేరుతున్నారని పనిగట్టుకుని అసత్య ప్రచారం చేస్తున్నాయని అసహనం వ్యక్తం చేశారు. జేడీఎస్ కుటుంబ పార్టీ అనే అపవాదును పోగొట్టడానికి ఏ త్యాగానికైనా సిద్ధమన్నారు. త్వరలో రాష్ట్ర వ్యాప్త పర్యటన చేసి పార్టీ బలోపేతానికి కృషి చేస్తానని తెలిపారు.

ఇదే వేదికపై మాట్లాడిన మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి తాను ఆరోగ్యంగానే ఉన్నానన్నారు. దాదాపు ఏడాదిన్నర కాలంలో సిద్ధరామయ్య ప్రజలకు చేసింది ఏమీ లేదన్నారు. పాలనలో ఆయన పూర్తిగా విఫలమయ్యారన్నారు. పార్టీలోని అందరి నాయకులను కలుపుకుని పోయి పార్టీకి పూర్వ వైభవం తీసుకువస్తానని కుమారస్వామి చెప్పుకొచ్చారు.
 
వేదిక నుంచి దిగిపోయిన జేడీఎస్ నాయకులు
 
దేవెగౌడ ప్రసంగం తర్వాత వేదికపై ఉన్న పలువురు నాయకులు మాట్లాడటానికి పోటీ పడ్డారు. ఒకరి చేతిలో ఉన్న మైకును మరొకరు బలవంతంగా లాక్కొవడానికి ప్రయత్నించారు. ఈ సందర్భంగా గందరగోళం నెలకొంది. దీంతో నొచ్చుకున్న పార్టీ సీనియర్ నాయకులు ఎం.సి.నాణయ్య, పుట్టణ్ణ, రేవణ్ణ వేదిక దిగి వెళ్లిపోయారు. ఇదిలా ఉండగా వేదిక కింద ఉన్న ఓ కార్యకర్త మైకును తీసుకుని ‘ఇతర పార్టీలోకి వెళ్లే వారి విషయం కాదు. పార్టీలోనే ఉంటూ వెన్నుపోటు పొడుస్తున్న వారిపై దృష్టి సారించండి.

బ్యాటరాయణపుర, యశ్వంతపుర నియోజక వర్గంలో ఇటీవల చోటు చేసుకున్న పరిణామాలే ఇందుకు ఉదాహరణ.’ అంటూ గట్టిగా మాట్లాడుతుండంగానే మరో నాయకుడు అతని వద్ద నుంచి మైకును లాక్కొవడానికి ప్రయత్నించారు. ఈ సమయంలో కల్పించుకున్న దేవెగౌడ ‘ఇలాంటి కార్యకర్తలే కావాలి. అతని వద్దమైకును బలవంతంగా తీసుకోకండి. ఇలా చేస్తే మన మధ్య విభేదాలు బయటపడ్డాయనే మీడియా వాఖ్యానిస్తుంది.’ అని పేర్కొన్నారు. తర్వాత కుమారస్వామితో పాటు పలువురు నాయకులు కల్పించుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకురావడంతో వేదిక పై నాయకుల ప్రసంగాలు కొనసాగాయి.
 

మరిన్ని వార్తలు