జోషి తిరుగుబాటు

12 Oct, 2013 23:50 IST|Sakshi

 సాక్షి, ముంబై: దక్షిణ ముంబై సీటుకు పార్టీ అధిష్టానం హామీ ఇవ్వకపోవడంతో ఆగ్రహంగా ఉన్న మాజీ లోకసభ స్పీకర్, శివసేన సీనియర్ నాయకుడు మనోహర్ జోషి పార్టీపై తిరుగుబాటు బావుటా ఎగురవేశారు. ఉద్ధవ్ నాయకత్వ సామర్థ్యంపై ఆయన అనుమానాలు వ్యక్తం చేయడం సంచలనం సృష్టించింది. ఉద్ధవ్ ప్రభుత్వంతో మిలాఖతై అన్ని పనులూ చేయించుకుంటున్నారని, పోరాటాలు, ఉద్యమాలపై ఆయనకు విశ్వాసం లేదని విమర్శించారు. ఉద్ధవ్ కార్యకర్తలకు బాధ్యతలు అప్పగించడం లేదని, అంతా తానే చూసుకోవాలనుకోవడం సరికాదని అభిప్రాయపడ్డారు. అయితే తాను సేనలోనే కొనసాగుతానని, అధిష్టానం ఆదేశించిన చోటు నుంచే పోటీ చేస్తానని వివరణ ఇచ్చారు.
 
  బాల్‌ఠాక్రే మాదిరిగా నాయకత్వ లక్షణాలు కలిగిన వ్యక్తి ఎవరూ ప్రస్తుత శివసేనలో  లేరని దాదర్‌లో శుక్రవారం పేర్కొన్నారు. మరోవైపు ఆయన శివసేనను వీడనున్న వార్తలకు మరింత బలం చేకూరేలా చేశాయని రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు. ఆయన పరోక్షంగా శివసేన అధిపతి ఉద్ధవ్ ఠాక్రే నేతృత్వంపై సవాల్ విసిరారని పేర్కొంటున్నారు. గత కొన్ని రోజులుగా దక్షిణ ముంబై లోకసభ నియోజకవర్గం అభ్యర్థిత్వంపై మనోహర్ జోషి, శివసేన సీనియర్ నాయకుల మధ్య ప్రచ్ఛన్నయుద్ధం కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో పలుమార్లు దక్షిణ ముంబై లోకసభ నియోజకవర్గం కావాలని డిమాండ్ చేయడంతోపాటు పార్టీ వైఖరిపై అసంతృప్తి వ్యక్తం చేశారు.  ఉద్ధవ్ ఠాక్రే భేటీతో అనంతరం మీడియాతో మాట్లాడుతూ కళ్యాణ్ నుంచి కూడా పోటీ చేసేందుకు సిద్ధంగా ఉన్నట్టు ప్రకటించారు. ఈ నేపథ్యంలో ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ బాల్‌ఠాక్రే స్మారకం ఏర్పాటు కాకపోవడానికి శివసేన నాయకత్వలోపమే కారణమన్నారు. ‘బాల్‌ఠాక్రే ఆ స్థానంలో ఉండి ఉంటే ప్రభుత్వాన్ని కూడా కూల్చేవారు. స్మారకం మాత్రం ఏర్పాటయ్యేదన్నారు. ఆయన మాదిరిగా దూకుడుగా పార్టీ ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉంది. అలాచేస్తే ఇప్పటి వరకు స్మారకం అయిపోయేది’ అని జోషి పేర్కొన్నారు.  
 
 ఉద్ధవ్, రాజ్ ఒక్కటవ్వాలి...
 శివసేన అధ్యక్షుడు ఉద్ధవ్ ఠాక్రే, మహారాష్ట్ర నవనిర్మాణ సేన (ఎమ్మెన్నెస్) అధ్యక్షులు రాజ్ ఠాక్రేలిద్దరూ ఒక్కటవ్వాలని మనోహర్ జోషి పిలుపునిచ్చారు. ‘రాజ్‌ఠాక్రే, ఉద్ధవ్ ఠాక్రేలు ఒకే విషయంపై పోరాడుతున్నారు. వారిద్దరి లక్ష్యాలు ఒక్కటే. కేవలం పనిచేసే తీరు వేరు. అందుకే వీరిద్దరూ ఒక్కటవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉంది. బాల్‌ఠాక్రే  కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా పోరాటం చేశారు. వీరిద్దరు కూడా ఆదే చేస్తున్నారు. అయితే ఒక్కటిగా చేయాలి’ అని ఆయన పిలుపునిచ్చారు.  
 
 ఉద్ధవ్‌తో భేటీ అయిన జోషి
 దాదర్‌లో శుక్రవారం నిర్వహించిన కార్యక్రమంలో అధిష్టానంపై తీవ్ర వ్యాఖ్యలు చేసిన జోషి.. ఉద్ధవ్‌తో శనివారం ఆయన నివాసం మాతోశ్రీలోనే భేటీ అయ్యారు. ఈ వీరిద్దరి మధ్య చర్చల వివరాలు వెల్లడి కాలేదు. అయితే జోషి వ్యాఖ్యలపై సేన సీనియర్ నాయకులు రామ్‌దాస్ కదమ్, ఏక్‌నాథ్ షిండే తీవ్ర ఆగ్రహం ప్రకటించారు. పార్టీ ఆయనకు ఎన్నో అవకాశాలు ఇచ్చినా, పదవులపై వ్యామోహంతోనే జోషి ఆ వ్యాఖ్యలు చేశారని కదమ్ విమర్శించారు.
 
 నేడు శివసేన దసరా ర్యాలీ
 సాక్షి, ముంబై:  శివసేన అధినేత బాల్‌ఠాక్రే మరణానంతరం తొలిసారిగా నిర్వహిస్తున్న ప్రతిష్టాత్మకమైన దసరా ర్యాలీ కోసం ఈ పార్టీ సిద్ధమయింది. ర్యాలీ ఏర్పాట్లన్నీ యుద్ధప్రాతిపదికన పూర్తి చేస్తున్నారు. ప్రతి ఏటా దసరా ర్యాలీలో దివంగత శివసేన అధినేత బాల్‌ఠాక్రే  ప్రసంగం వినడానికి భారీగా జనం వచ్చేవారు. ఈసారి ఆయన లేని వెలితి స్పష్టంగా కనిపించవచ్చని తెలుస్తోంది. అయితే ఆయన స్థానంలో ఉన్న శివసేన అధ్యక్షుడు ఉద్దవ్‌ఠాక్రే ఈసారి తన ప్రసంగంతో ఏ మేరకు ఆకట్టుకుంటారు ?  ఏయే అంశాలపై మాట్లాడనున్నారనే విషయమై ఆసక్తికర చర్చ జరుగుతోంది.
 
  ముంబైతోపాటు రాష్ట్రవ్యాప్తంగా ప్రజలు ఆదివారం జరగనున్న దసరా ర్యాలీపై దృష్టి పెట్టారని చెప్పవచ్చు. గత 48 సంవత్సరాలుగా ఒకటి రెండు ఘటనలు మినహా ప్రతి సంవత్సరం క్రమం తప్పకుండా దసరా ర్యాలీ జరుగుతోంది. ఇది శివసేనకు ఆనవాయితీగా మారింది.  బాల్‌ఠాక్రే సందేశాన్ని వినేందుకు ముంబైతోపాటు చుట్టుపక్కల ప్రాంతాల నుంచి లక్షలాది మంది తరలివచ్చేవారు. ఈసారి కూడా శివాజీపార్క్ ర్యాలీకి లక్షలాది మంది ప్రజలు వస్తారా లేదా అనేది వేచిచూడాల్సిందే.  ఈసారి ర్యాలీ నిర్వహించేందుకు బీఎంసీ నుంచి అనుమతి లభించదని, సేన ప్రత్యామ్నాయ వేదికను ఎంచుకోకతప్పదని అంతా భావించారు. అయితే ఎట్టకేలకు హైకోర్టు ర్యాలీ నిర్వహించుకోవడానికి అనుమతి మంజూరు చేయడంతో సేన ఊపిరిపీల్చుకుంది. ఈ అనుమతి లభించడానికి ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చవాన్ కూడా సహకరించారని తెలుస్తోంది. భారీ భద్రత...: ర్యాలీకి భారీ భద్రత ఏర్పాటు చేయనున్నారు.
 
 అనేక మంది పోలీసులను మోహరించనున్నారు. సేన కార్యకర్తలు కూడా దసరా ర్యాలీలో ఎవరికి ఎలాంటి ఇబ్బందీ కలుగకుండా ఉండేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. పోలీసులు కీలక ప్రాంతాల్లో నిఘా వేశారని సమాచారం. షరతులతో కూడిన అనుమతి లభించడంతో.. ఏ ఒక్క నియమాన్ని ఉల్లంఘించకుండా శివసేన జాగ్రత్తలు తీసుకుంటోంది. మరోవైపు సభ వల్ల ధ్వని కాలుష్యం ఏర్పడకుండా ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని న్యాయస్థానం ఆదేశించింది.

మరిన్ని వార్తలు