గళమెత్తిన జర్నలిస్టులు

23 Sep, 2014 00:54 IST|Sakshi
గళమెత్తిన జర్నలిస్టులు

 చెన్నై, సాక్షి ప్రతినిధి :తమ ప్రభుత్వ తప్పిదాలను ఎండగడుతున్నారని ఆరోపిస్తూ తెలుగుదేశం ప్రభుత్వం సాక్షి మీడియాను అడ్డుకుంటోంది. ప్రభుత్వ కార్యక్రమాల కవరేజి కోసం వెళ్లిన సాక్షి మీడియా ప్రతినిధులను అడ్డగించేందుకే ఒక మనిషిని పెట్టినట్లుగా వ్యవహరిస్తోంది. మీడియూ పట్ల నిష్పక్షపాతంగా వ్యవహరించాల్సిన ప్రభుత్వాధినేత సాక్షి మీడియా గొంతునొక్కడమే పనిగా పెట్టుకున్నారు. తెలంగాణ ప్రభుత్వాన్ని కించపరిచే కార్యక్రమాలను ప్రచారం చేశారనే ఆరోపణలపై టీవీ 9, ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ప్రసారాలను నిషేధించినట్లు ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు విమర్శలను ఎదుర్కొంటున్నారు. తెలంగాణలో ఆ రెండు టీవీల ప్రసారాలు నిలిచిపోయి సోమవారంతో వందరోజులు పూర్తయ్యూయి. రెండు రాష్ట్రాల్లోని ప్రభుత్వాల వైఖరిని తీవ్రంగా ఎండగడుతూ మీడియా సభ్యులు గంటపాటు నిరసన పాటించారు.
 
 తగ్గకుంటే ఉద్యమం తప్పదు
 వర్కింగ్ జర్నలిస్ట్స్ యూనియన్ ఆఫ్ తమిళనాడు అధ్యక్షుడు ఏజే సహాయరాజ్, ఉపాధ్యక్షుడు ఏ భాగ్యరాజ్, చెన్నై జర్నలిస్ట్స్ అసోసియేషన్ అధ్యక్షుడు అన్బగళన్, చెన్నై ప్రెస్‌క్లబ్ కార్యదర్శి భారతి తమిళన్, తమిళనాడు ప్రెస్ ఫొటోగ్రాఫర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు పిచ్చుమణి తదితరులు మాట్లాడుతూ, ప్రజల పక్షాన నిలుస్తున్న మీడియూను అణచివేయడం ఆయా ప్రభుత్వాలకు ఆత్మహత్యా సదృశ్యమని అన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణల్లోని మీడియా ఎదుర్కొంటున్న పరిస్థితులు రేపు మరో రాష్ట్రానికి విస్తరించే ప్రమాదం ఉందన్నారు. ముఖ్యమంత్రులు ఎన్ చంద్రబాబునాయుడు, కే చంద్రశేఖర్  రావులు మీడియా పట్ల అనుసరిస్తున్న వైఖరిని ఆదిలోనే అడ్డుకోవాల్సిన అవసరం ఉందని వారు పిలుపునిచ్చారు. మీడియా పట్ల వివక్షను విడనాడి తగిన గౌరవం, గుర్తింపు కల్పించకుంటే దేశవ్యాప్త ఉద్యమం తప్పదని హెచ్చరించారు.
 
 మీడియా హక్కులను కాపాడుకోవడంలో భాషాభేదాలకు అతీతంగా సంఘటితం అవుతామని హెచ్చరించారు. జర్నలిస్టుల పట్ల ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రభుత్వాల వైఖరిని అడ్డుకట్టవేసేలా కేంద్రం చొరవతీసుకోవాలని వారు విజ్ఞప్తి చేశారు. తెలుగు మీడియా డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని భారత రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ, ప్రధాని నరేంద్రమోడీకి ఫాక్స్ ద్వారా పంపారు. ఈ నిరసన కార్యక్రమంలో డబ్ల్యుజేయూటీ ప్రధాన కార్యదర్శి సాల్మన్, తమిళనాడు ప్రెస్ ఫొటో గ్రాఫర్స్ అసోసియేషన్ కోశాధికారి వీ శ్రీనివాసులు, సంయుక్త కార్యదర్శి కుమార్, కేరళ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ కోశాధికారి సింగారవేల్, రాష్ట్రంలోని తెలుగు ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియాకు చెందిన తేజాస్ ప్రతినిధులు పాల్గొన్నారు.  

మరిన్ని వార్తలు