రామ్‌కుమార్ పోస్ట్‌మార్టంపై నేడు నిర్ణయం

22 Sep, 2016 01:33 IST|Sakshi
రామ్‌కుమార్ పోస్ట్‌మార్టంపై నేడు నిర్ణయం

 సాక్షి, చెన్నై: ఇన్ఫోసిస్ ఉద్యోగిని స్వాతి హత్య కేసు నిందితుడు రామ్‌కుమార్ మృతి కేసు న్యాయమూర్తులను సైతం సంకటంలో పడేస్తున్నది. ఈ కేసు విచారణలో ఇద్దరు న్యాయమూర్తులు మారారు. ముచ్చటగా మూడో న్యాయమూర్తిగా కృపాకరణ్ నేతృత్వంలోని బెంచ్ గురువారం విచారించి నిర్ణయం తీసుకోనున్నది. స్వాతి హత్య కేసు నిందితుడు రామ్‌కుమార్ పుళల్ కేంద్ర కారాగారంలో ఆత్మహత్య చేసుకున్నట్టు సంకేతాలు వెలువడ్డ విషయం తెలిసిందే. అయితే, ఇది హత్యేనని, ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నారంటూ అతడి కుటుంబీకులు ఆరోపించే పనిలో పడ్డారు. దీంతో తిరువళ్లూరు జిల్లా మెజిస్ట్రేట్ కోర్టు నేతృత్వంలో విచారణ సాగుతున్నది.
 
 అదే సమయంలో పోస్టుమార్టం విషయంగా ప్రభుత్వ వైద్యుల మీద నమ్మకం లేదని, తమకు చెందిన ప్రైవే టు వైద్యులను నియమించేందుకు తగ్గ అనుమతి ఇవ్వాలని, కేసు విచారణ సీబీఐకు అప్పగించాలని పట్టుబడుతూ రామ్‌కుమార్ తండ్రి పరమశివం, అతడి తరఫు న్యాయవాది రామరాజ్ దాఖలు చేసిన పిటిషన్ల విచారణ గందరగోళానికి దారి తీశాయని చెప్పవచ్చు. దీంతో పోస్టుమార్టం నిలుపుదల చేశారు. మృతదేహం రాయపేట మార్చురీ వద్ద గట్టి భద్రత నడుమ ఉంచారు.
 
 ఈ పిటిషన్లను తొలుత వైద్యనాథన్ న్యాయమూర్తి, తదుపరి మరో న్యాయమూర్తిగా రమేష్ విచారించడం, ఇద్దరి అభిప్రాయాలు వేర్వేరుగా ఉండడంతో కేసు విచారణ న్యాయ వర్గాలకు సంకటంగా మారాయి. మంగళవారం విచారణ సాగాల్సి ఉన్నా, కేసు మరో బెంచ్‌కు మార్చడంతో ఆటంకం తప్పలేదు. ఈ పరిస్థితుల్లో బుధవారం ఉదయం ప్రధాన న్యాయమూర్తి సంజయ్ కిషన్‌కౌల్, న్యాయమూర్తి మహాదేవన్ నేతృత్వంలోని బెంచ్ ముందు రామ్‌కుమార్ తండ్రి పరమశివం తరఫున న్యాయవాది శంకర్ సుబ్బు హాజరై మరో బెంచ్‌కు న్యాయమూర్తి నియామకం గురించి వివరించారు.
 
 ఇందుకు స్పందించిన బెంచ్ మూడో న్యాయమూర్తి కృపాకరణ్ నేతృత్వంలోని బెంచ్‌కు కేసును అప్పగించారు. ఈ బెంచ్ గురువారం విచారణ చేపట్టి, పోస్టుమార్టం విషయంలో ప్రైవేటు వైద్యుడి నియామకానికి సంబంధించి నిర్ణయం వెలువరించే అవకాశాలు ఉన్నాయి. ఈ దృష్ట్యా గురువారం మధ్యాహ్నం తర్వాత రామ్‌కుమార్ మృతదేహానికి పోస్టుమార్టం జరగవచ్చు.
 
 

మరిన్ని వార్తలు