మరికొన్ని గంటల్లో తీర్పు

11 May, 2015 08:02 IST|Sakshi
మరికొన్ని గంటల్లో తీర్పు

నేడే జయ కేసు     తీర్పు
 మంత్రులకు ఆంక్షలు
 నిఘా నీడలో బెంగళూరు
 రాష్ట్రంలోనూ అలర్ట్

 
 మరికొన్ని గంటల్లో ఎలాంటి తీర్పు వెలువడుతుందోనన్న ఉత్కంఠ రాష్ట్ర వ్యాప్తంగా నెలకొంది. తమ అమ్మ జయలలితకు అనుకూలంగా తీర్పు ఉండాలని దేవుళ్లను మొక్కే పనిలో అన్నాడీఎంకే వర్గాలు నిమగ్నం అయ్యారు.జయలలిత అండ్ బృందం తరపు న్యాయవాదులతో పాటుగా పార్టీ వర్గాలు బెంగళూరుకు పయనం అవుతుంటే, మంత్రులకు మాత్రం ఆంక్షలు జారీ అయ్యాయి.
 
 సాక్షి, చెన్నై :
 అన్నాడీఎంకే అధినేత్రి జయలలిత అండ్ బృందానికి ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో జైలు శిక్ష పడ్డ విషయం తెలిసిందే. ఈ శిక్షను సవాల్ చేస్తూ చేసుకున్న అప్పీలుపై మరికొన్ని గంటల్లో తీర్పు వెలువడనున్నది. దీంతో తీవ్ర ఉత్కంఠ రాష్ట్రంలో నెలకొంది. తమ అమ్మ జయలలితకు అనుకూలంగా తీర్పు ఉండాలని, ఆమె నిర్ధోషిత్వం ఈ తీర్పుతో నిరూపితం అవుతుందన్న ఆకాంక్షలతో అన్నాడీఎంకే వర్గాలు మునిగాయి. ఆలయాల్లో ఆదివారం మధ్యాహ్నం నుంచే పూజలు ఆరంభం అయ్యాయి. రాష్ట్రవ్యాప్తంగా అన్ని ఆలయాల్లో అన్నాడీఎంకే వర్గాల నేతృత్వంలో అభిషేకాలు, హోమాది పూజలు, పాలబిందెలతో ఊరేగింపులు జరుగుతున్నాయి.
 
 తీర్పు ఎటో: ప్రత్యేక కోర్టు ఇచ్చిన తీర్పుతో జయలలిత రాజకీయ భవిష్యత్తు ప్రశ్నార్థకంలో పడి ఉన్నది. అయితే, ఆ తీర్పును తిరగరాసే రీతిలో మరో తీర్పు వెలువడేనా అన్న ఉత్కంఠ భరిత వాతావరణం రాష్ట్రంలో నెలకొని ఉంది. జయలలిత నిర్ధోషిగా బయటకు వస్తారని కొన్ని చోట్ల , శిక్ష తగ్గే అవకాశాలు ఉన్నాయని మరి కొన్ని చోట్ల చర్చలు అప్పుడే ఆరంభం అయ్యాయి. మరో ఆరేడు నెలల్లో అసెంబ్లీ ఎన్నికల కసరత్తులు ఆరంభం అవుతోన్న వేళ, మరికొన్ని గంటల్లో వెలువడే తీర్పు ఎలాంటి రాజకీయ మార్పులకు వేదికగా అవుతుందోనన్న చర్చ సైతం బయలు దేరి ఉండడం గమనార్హం. తమ అమ్మకు అనుకూలంగా తీర్పు వ స్తుందన్న ఆశాభావంతో బెంగళూరుకు పయనం అయ్యే నాయకులు పెద్ద సంఖ్యలోనే ఉన్నారు. జయలలిత అండ్ బృందం తరపున న్యాయవాదులు ఇప్పటికే బెంగళూరుకు చేరుకుని ఉన్నారు. ఇక, పార్టీ వర్గాలు ఆ దిశగా పరుగులు తీస్తున్నాయి.
 
 మంత్రులకు ఆంక్ష: పార్టీ వర్గాలు బెంగళూరుకు ఉరకలు తీస్తుంటే, రాష్ట్ర మంత్రులకు మాత్రం ఆంక్షలు వెలువడి ఉన్నాయి. తీర్పు ఎలా ఉంటుందో అంతు చిక్కని దృష్ట్యా, ఏలాంటి పరిణామాలు ఎదురైనా ఎదుర్కొనే రీతిలో అన్నాడీఎంకే వర్గాలు సిద్ధం అవుతున్నాయి. తీర్పు అనుకూలంగా ఉంటే సంబరాలకు, ప్రతి కూలంగా ఉంటే గతంలో వలే ఏదేని విధ్వంసాలకు దిగే అవకాశాలు కన్పిస్తుండడంతో ముందు జాగ్రత్తగా రాష్ట్ర పోలీసు యంత్రాంగం సైతం అప్రమత్తమైంది. ఇక,  రాష్ట్ర మంత్రులెవ్వర్నీ బెంగళూరుకు వెళ్ల వద్దని జయలలిత ఆదేశించినట్టు సమాచారం.
 
 దీంతో ఓ వైపు మంత్రుల నేతృత్వంలో పూజలు ఆరంభం అయ్యాయి. ఏదేని ప్రతికూల పరిస్థితులు ఎదురైన పక్షంలో పార్టీ వర్గాల్ని గాడిలో పెట్టె విధంగా మంత్రులందర్నీ వారి వారి జిల్లాల్లోనే ఉండే రీతిలో ఆదేశాలు జారీ చేసినట్టు తెలిసింది. దీంతో మంత్రులు తమ తమ ప్రాంతాల్లో తిష్ట వేసి, పరిస్థితిని సమీక్షించడంతో పాటుగా తీర్పు వెలువడే వరకు దేవుళ్లను వేడుకునే పనిలో నిమగ్నం అవుతున్నారు. సరిగ్గా 11 గంటలకు న్యాయమూర్తి కోర్టుకు హాజరైనా తీర్పు వెలువడేందుకు కొన్ని గంటలు పట్టే అవకాశాలు ఉన్నాయి. దీంతో అంత వరకు అన్నాడీఎంకే వర్గాలకే కాదు, రాష్ట్రంలో ప్రతి పక్షాలకు సైతం ఉత్కంఠ తప్పదేమో. ఇక, అన్నాడీఎంకే వర్గాలు పెద్ద ఎత్తున తరలి వచ్చే అవకాశాలు కన్పిస్తుండడంతో బెంగళూరులోని కోర్టు పరిసరాల్లో గట్టి భద్రతా ఏర్పాట్లు చేసి ఉన్నారు. బాణ సంచాలు పేల్చేందుకు నిషేధం విధించడంతో పాటుగా కర్ణాటక సరిహద్దుల్లో చెక్ పోస్టుల్ని ఏర్పాటు చేసి వాహనాల్ని తనిఖీలు చేస్తున్నారు.
 

Read latest State News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు