అమ్మలా పోషించి..ఓ అయ్య చేతిలో పెట్టి..

7 Feb, 2016 18:40 IST|Sakshi
అమ్మలా పోషించి..ఓ అయ్య చేతిలో పెట్టి..

అనాథాశ్రమంలోని యువతులకు ‘కంకణభాగ్య’
  మానవీయతను చాటుకుంటున్న  దావణగెరె మహిళా నిలయం

 
 సాక్షి, బెంగళూరు: తల్లి ఎవరో..తండ్రి ఎవరో తెలియక అనాథ శరణాలయాల్లో మగ్గుతున్న యువతులు పెళ్లీడుకొస్తే వారిని ఓ అయ్య చేతిలో పెట్టడంలో శరణాలయాలు అంతగా బాధ్యతలు తీసుకోవు. వారి బాగోగులు పట్టించుకోవాల్సిన అవసరం లేదన్నట్లుగా వ్యవహరిస్తుంటాయి. అయితే చిన్నతనంలోనే అందరినీ కోల్పోయి ప్రభుత్వ శరణాలయానికి చేరిన అమ్మాయిలను ‘అమ్మ’లా దగ్గరకు తీసుకుంటోంది దావణగెరెలోని మహిళా నిలయ. తమకంటూ ఎవరూ లేని అమ్మాయిలను పెంచే బాధ్యతనే కాదు, ఆ తర్వాత వారి పెళ్లి బాధ్యతను కూడా నిర్వర్తిస్తున్నారు. అది కూడా తల్లిదండ్రులకు ఏమాత్రం తీసిపోకుండా. దావణగెరెలోని మహిళా నిలయలో ఇప్పటికే ఈ తరహాలో 21పెళ్లిళ్లు జరగగా, శుక్రవారం రోజున మరో ఇద్దరు యువతులు అత్తవారింట్లో అడుగుపెట్టారు.
 
 కంకణభాగ్యతో పాటు 15వేల ఫిక్స్‌డ్ డిపాజిట్ కూడా
 నేత్రావతి, అవిలాషాలు చిన్నతనంలోనే తల్లిదండ్రులను కోల్పోవడంతో దావణగెరె మహిళా నిలయలో ఆశ్రయం పొందుతున్నారు. వీరిద్దరికీ మహిళా నిలయ ఆధ్వర్యంలో శుక్రవారం వివాహమైంది. యల్లాపుర తాలూకాలోని గోళిగద్దె గ్రామానికి చెందిన సుబ్బరాయ నారాయణ హెగ్డే నేత్రావతిని వివాహం చేసుకోగా, అంకోలా తాలూకాలోని కట్టేపాలకు చెందిన కుమార వెంకటరమణ హెబ్బార్ అవిలాషాను వివాహమాడారు. వీరి వివాహాన్ని దావణగెరె మహిళా నిలయ సభ్యులతో పాటు రాష్ట్ర మహిళా, శిశు సంక్షేమ శాఖకు చెందిన అధికారుల సమక్షంలో నిరాడంబరంగా, శాస్త్రోక్తంగా జరిపించారు.  ఇక వధువుకు తాళిబొట్టు, మెట్టెలను అందజేయడంతో పాటు దంపతుల పేరిట 15వేలను ఫిక్స్‌డ్ డిపాజిట్ చేశారు. దీంతో దావణగెరె మహిళా నిలయంలో జరిగిన వివాహాల సంఖ్య 23కు చేరుకుంది.
 
 అబ్బాయి ఎంపిక ఇలా....
 ఇక దావణగెరె మహిళా నిలయంలోని యువతిని వివాహం చేసుకోవాలనుకునే అబ్బాయిలు చాలా పరీక్షలే ఎదుర్కోవాల్సి ఉంటుంది. యువతి భద్రత దృష్ట్యా మహిళా నిలయం సభ్యులు ఈ జాగ్రత్తలన్నీ తీసుకుంటారు. మహిళా నిలయంలోని యువతిని వివాహం చేసుకోవాలనుకునే వారు ముందుగా మహిళా నిలయానికి దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. దరఖాస్తు చేసుకున్న వ్యక్తికి సంబంధించిన కుటుంబ చరిత్ర, పూర్తి వివరాలు, ఉద్యోగం తదితర అంశాలన్నింటిని అధికారులు క్షుణ్ణంగా పరిశీలించి, అనంతరం వైద్య పరీక్షలు కూడా నిర్వహిస్తారు. ఈ పరీక్షలన్నింటిలో నెగ్గిన తర్వాతే వరుడి ఎంపిక జరుగుతుంది.

మరిన్ని వార్తలు