మైసూరు అబ్బాయి వెడ్స్‌ కెనడా అమ్మాయి

23 Jul, 2018 10:12 IST|Sakshi
పెళ్లి పందిరిలో మెరిసిపోతున్న శరత్‌ విఠల్‌– కార్లిల్వియా

మూడుముళ్లతో ఒక్కటైన లవ్‌ జంట  

వారి ప్రేమ ఖండాంతరాలు దాటింది. కన్నడిగుడు– కెనడా అమ్మాయి మధ్య చిగురించిన పరిచయం ప్రేమగా మారింది. భాషభేదాలు, జాతి తారతమ్యాలు, ఆస్తులు, అంతస్తుల తేడాలు బలాదూర్‌ అయ్యాయి. ప్రేమకు సార్థకత చేకూరేలా వివాహబంధంతో ఒక్కటయ్యారు. ఈ అరుదైన పెళ్లికిచిక్కమగళూరు వేదికైంది. 

బొమ్మనహళ్లి: మైసూరు నగరానికి చెందిన కన్నడ యువకుడు– కెనడా దేశానికి చెందిన యువతి ప్రేమించి పెళ్ళి చేసుకున్న అపురూప ఉదంతం చిక్కమగళూరులో చోటు చేసుకుంది. భారతీయ సంప్రదాయంలో ఆదివారం ఈ అపురూప జంట వివాహం కుటుంబ సభ్యుల మధ్య మూడుముళ్లతో ఒక్కటైంది. కెనడాలో ప్రేమించుకున్న ఈ జంట తమ పెళ్లికి ఇరు కుటుంబాలను ఒప్పించారు. 

ప్రేమ పుట్టిందిలా  
మైసూరులోని కువెంపు నగరానికి చెందిన సి.విఠల్, ఎస్‌.వేద దంపతుల రెండవ కుమారుడు  శరత్‌ విఠల్‌ కెనడాలోని వెన్‌కిదర్‌  ప్రాంతంలో యోగా ఉపాధ్యాయునిగా పనిచేస్తున్నారు. హోటల్‌ మేనేజ్‌మెంట్‌ కోర్సు చేసిన అతడు 9 సంవత్సరాలుగా కెనడాలో హోటల్‌ వ్యాపారాన్ని కూడా నిర్వహిస్తున్నాడు. తమ హోటల్‌ సమీపంలో ఉన్న  ప్రభుత్వ పాఠశాలకు ఆహారాన్ని సరఫరా చేసేవాడు.  
ఆ పాఠశాల్లో యోగా టీచర్‌గా ఉద్యోగం చేసే కార్లిల్వియా అనే యువతితో స్నేహం పెరిగి ప్రేమగా మారింది.  మూడు సంవత్సరాలుగా ప్రేమ నడుస్తోంది. పెళ్లి చేసుకోవాలని నిర్ణయించారు. ఇరువురు తమ ప్రేమను కుటుంబ సభ్యులకు చెప్పడంతో వారు కూడా సరేననడంతో ఏడడుగులకు సిద్ధమయ్యారు. ఆదివారం వేదమంత్రాల మధ్య హిందూ సంప్రదాయ పద్ధతిలో ఈ జంట దాంపత్య జీవితంలోకి అడుగిడింది. 

మరిన్ని వార్తలు