గంగమ్మ మృతి దురదృష్టకరం: సీఎం

8 Apr, 2020 11:52 IST|Sakshi
యెడియూరప్ప, గంగమ్మ (ఫైల్‌)

సాక్షి, బెంగళూరు: గంగమ్మ మృతి పట్ల కర్ణాటక ముఖ్యమంత్రి బీఎస్‌ యెడియూరప్ప సంతాపం ప్రకటించారు. ఆమె కుటుంబానికి అండగా నిలబడాలని అధి​కారులను ఆయన ఆదేశించారు. లాక్‌డౌన్‌ నేపథ్యంలో బెంగళూరు నుంచి సొంతూరికి కాలినడకన బయల్దేరి మార్గమధ్యలో గంగమ్మ (29) తనువు చాలించింది. 200 కిలోమీటర్లు పైగా నడిచి ఆకలిబాధతో కన్నుమూసింది. దేశవ్యాప్తంగా వలస కార్మికులు పడుతున్న కష్టాలకు ఈ విషాద ఘటన అద్దం పడుతోంది. ‍కరోనా వైరస్‌ నివారణ చర్యల్లో భాగంగా కేంద్ర ప్రభుత్వం 21 రోజుల లాక్‌డౌన్‌ ప్రకటించడంతో వలస కార్మికులు, రోజువారీ కూలీల బతుకులు దుర్భరంగా మారాయి. 

గంగమ్మ మరణం దురదృష్టకరమని ముఖ్యమంత్రి బీఎస్‌ యెడియూరప్ప వ్యాఖ్యానించారు. ‘ఇది చాలా దురదృష్టకర, బాధాకరం. సింధనూరు గ్రామానికి చెందిన గంగమ్మ లాక్‌డౌన్‌ సందర్భంగా తన సొంతూరికి నడిచి వెళుతుండగా మార్గమధ్యలో చనిపోయింది. ఆమె అన్ని కుటుంబాన్ని అన్నివిధాల ఆదుకోవాలని అధికారులను ఆదేశిస్తున్నాను’ అని ఆయన ట్విటర్‌లో పేర్కొన్నారు. ప్రస్తుత విపత్కర పరిస్థితుల్లో వలస కార్మికులను ఆదుకునేందుకు చర్యలు చేపట్టామని.. ఆహారం, సరుకులు అవసరమైన వారి కోసం హెల్ప్‌లైన్‌ నంబరు పెట్టామని యెడియూరప్ప తెలిపారు. వలస కార్మికుల కోసం తాత్కాలిక షెల్టర్లు ఏర్పాటు చేశామన్నారు. ప్రజలు అందరూ ప్రభుత్వం సూచనలు పాటించాలని, ఎటువంటి అవసరం వచ్చినా హెల్స్‌డెస్క్‌లను సంప్రదించాలని సూచించారు. (విషాదం; కబళించిన ఆకలి)

మరిన్ని వార్తలు