ధన మూషిక

12 Mar, 2018 08:33 IST|Sakshi
రైతు చేతిలో తెల్ల ఎలుక ,పిల్లలు పెట్టిన తెల్ల ఎలుక

తెల్ల ఎలుకల పెంపకంతో కాసుల వర్షం

రామనగర జిల్లా అక్కూరు రైతుల కొత్త పంథా

ఔషధ ప్రయోగాల కంపెనీలకు విక్రయం

ఈ లోకంలో పనికిరానిదంటూ ఏదీ లేదని పెద్దలు చెబుతుంటారు. సాధారణంగా ఎలుకలంటే మనకు మహా చిరాకు. ఎందుకంటే వాటివల్ల అన్నీ నష్టాలే. అందుకే ఎలుకలను బోను పెట్టో, మందు పెట్టో వాటిని మట్టుబెడుతుంటాం. అయితే ఎలుకలతో లక్షల్లో ఆదాయం గడించవచ్చనే సంగతి తెలుసా?

రామనగర (దొడ్డబళ్లాపురం): ఎలుకలతో ఆదాయమా, ఔనా? అని ఆశ్చర్యపోకండి. ఇది నిజం. బెంగళూరు సమీపంలో రామనగర తాలూకా అక్కూరు గ్రామం రైతులు కొందరు ఇప్పుడు తెల్ల ఎలుకలను పెంచుతూ ధనలక్ష్మి దయను పొందుతున్నారు. అక్కూరు గ్రామంలో ప్రస్తుతం 6 మంది రైతులు తెల్ల మూషికాల పెంపకం సాగిస్తున్నారు. వీరిని చూసి మరికొందరు ముందుకు వస్తున్నారు.ఒక్కో రైతు సుమారు 100 తెల్ల ఎలుకలను పెంచుతున్నారు. ఇవి పెట్టే పిల్లలను విక్రయించడం ద్వారా వీరు ఏడాదికి కనీసం 3 నుండి 4 లక్షలు ఆదాయం పొందుతున్నారు. ఈ సరికొత్త ఉపాధి ఇప్పుడు గ్రామాల్లో కొత్త వెలుగులు నింపుతోంది.

పెంపకం చాలా ఈజీ
లక్కూరు గ్రామంలో ఆదర్శ రైతు జయకుమార్‌ ఏడాదిన్నర క్రితం మొదట తెల్ల ఎలుకల పెంపకం ప్రారంభించగా ఇప్పుడు మరి కొంతమంది రైతులు ఇదే బాట పట్టారు. కుందేళ్లను పెం చడానికి మాదిరిగానే వీటి కోసం కూడా పెట్టెలను ఏర్పాటు చేశాడు. ఈయన వద్ద ఉన్న 70 ఎలుకలలో 50 ఆడ ఎలుకలయితే 20 మగ ఎలుకలున్నా యి. ఏడాదిన్నరలో ఆరుసార్లు ఎలుక పిల్లలను విక్రయించాడు. ఆడ ఎలుక రెండు నెలలకోసారి పిల్లలు పెడుతుంది. ప్రతి ఏడాదికీ సరాసరి ఒక ఎలుక 20 వరకూ పిల్లలు పెడుతుంది.అరె తిమ్మయ్య అనే రైతు తన తోటలో రూ.3 లక్షలు ఖర్చు చేసి ఎలుకల పెంపకం కోసం షెడ్డు నిర్మించాడు. ఒక ఎలుకకు రూ.800 చొప్పున చెల్లించి 80 ఎలుకలను తెచ్చుకున్నాడు. ప్రస్తుతం అవి పెద్దసంఖ్యలో పిల్లలను ఉత్పత్తి చేశాయి. వీటి ఆహారం కోసం వేలల్లో ఖర్చు ఏమీ కాదు. శెనగపొట్టు, పశువులకు కలిపే పిండి వేసినా వద్దనకుండా తినేస్తాయి. వీటిని చూసుకోవడానికి పెద్దగా పనివాళ్ల అవసరం కూడా ఉండదు.  ఆహారం ఇవ్వడానికి, ఎప్పటికప్పుడు క్లీన్‌ చేయడానికి ఇద్దరుంటే చాలు.  తెల్ల ఎలుకలు ఆహారంలోనే నీటిని తీసుకుంటాయి కాబట్టి ప్రత్యేకంగా నీరు పెట్టాల్సిన పనిలేదు. వీటికి రోగాల రొష్టుల బాధ కూడా అస్సలు ఉండదు.

ఏమిటీ ఉపయోగం?
ఇంతకీ తెల్ల ఎలుకలతో ఏం చేస్తారు? అనే ప్రశ్న వినిపిస్తుంది. ఔషధ సంస్థలకు తెల్ల ఎలుకలు ఎంతో అవసరం. ఆ సంస్థలు కొత్త ఔషధం తయారు చేసేటప్పుడు వాటిని ఎలుకలు, కుందేళ్లు వంటి మూగప్రాణుల మీద ప్రయోగించి ఫలితాలను చూస్తాయి. ఈ ప్రయోగాలకు తెల్ల ఎలుకలను ఎక్కువగా ఉపయోగిస్తుంటారు. ఆ ఔషధాలకు మనుషులు ఎలా స్పందిస్తారో ఇవి కూడా అలాగే స్పందించడం వల్ల ఫలితాలు కచ్చితంగా ఉంటాయని ఔషధ నిపుణులు చెబుతుంటారు. ఇలాంటి ప్రయోగాలకు వేల సంఖ్యలో ఎలుకలు అవసరం ఉంటుంది. ఇలాంటి ప్రయోగశాలలకు తెల్ల ఎలుకలు సరఫరా చేయడానికి వీటి పెంపకం జరుగుతోంది.

ఒక్కో ఎలుక రేటు రూ.400
ప్రస్తుతం ఈ రైతులు తమిళనాడుకు చెం దిన ఒక కంపెనీతో 5 సంవత్సరాలకు ఒప్పం దం చేసుకున్నారు. ఆ కంపెనీవారే నేరుగా వీ రి వద్ద ఎలుకలు ఖరీదు చేస్తారు. సుమారు 25 రోజుల వయసు ఉండి 150 నుండి 400 గ్రా ముల బరువు ఉండే ఎలుకలను తలా రూ. 400 నుండి 500 వరకూ ధర చెల్లించి కొంటా రు. ప్రస్తుతం రైతులు మధ్యవర్తి ద్వారా ఎలుక పిల్లలను విక్రయిస్తున్నారు. అదే ప్రయోగశాలలతో నేరుగా ఒప్పందం చేసుకుంటే ఇంతకు రెండు రెట్లు ఆదాయం పొందవచ్చు. తెల్ల ఎ లుకలపై మరిన్ని వివరాలకు రైతు విజయ్‌కుమార్‌–97416 31862లో సంప్రదించవచ్చు.

మరిన్ని వార్తలు