టోల్‌ ఫీజు వసూలు నిలిపివేత

11 Dec, 2019 09:35 IST|Sakshi
గుంజూరు వద్ద టోల్‌ మూసివేసిన దృశ్యం

 రోడ్లు పూర్తిగా అభివృద్ధి పరచలేదని హైకోర్టు ఆదేశాలు

యలహంక–హిందూపురం టోల్‌ మార్గంలో ఉచితంగా రాకపోకలు

దొడ్డబళ్లాపురం : యలహంక–హిందూపురం రహదారి మార్గంలో టోల్‌ ఫీజు వసూలు చేయరాదని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. దొడ్డబళ్లాపురానికి చెందిన లాయర్‌ వెంకటేశ్‌ వేసిన ప్రజాప్రయోజన వ్యాజ్యం పరిశీలించిన జడ్జీలు రవి మళిమఠ,  ఎం నాగప్రసన్న ఈమేరకు ఆదేశాలు జారీ చేశారు. యలహంక–హిందూపురం రాష్ట్ర రహదారి మార్గంలో మారసంద్ర, గుంజూరు వద్ద ఉన్న రెండు టోల్‌గేట్‌ల వద్ద రోడ్లు పూర్తిగా అభివృద్ధిపరచకుండా టోల్‌ వసూలు చేస్తున్నారని లాయర్‌ వెంకటేశ్‌ ఆరోపిస్తూ పిల్‌ వేశారు.

పనులు ఏ మేరకు జరుగుతున్నాయి, జరిగాయి అని నివేదిక ఇవ్వాల్సిందిగా ఒక ఇంజినీర్‌ని నియమించాలని కోర్టు గతంలో ప్రభుత్వాన్ని ఆదేశించగా, పనులను పరిశీలించిన ఇంజినీర్‌ 75 శాతం పనులు జరిగాయని నివేదిక ఇచ్చారు. అయితే లాయర్‌ వెంకటేశ్‌ ఇది తప్పుల నివేదిక అని వాదించారు. అందుకు తగిన సాక్ష్యాధారాలు చూపడంతో కోర్టు టోల్‌ ఫీజు వసూలుకు బ్రేక్‌ వేసింది. దీంతో తక్షణం యలహంక–హిందూపురం రహదారి మార్గంలోని రెండు టోల్‌గేట్లలో ఫీజులు వసూలు చేయడం నిలిపివేసి వాహనాలను ఉచితంగా వదులుతున్నారు.  

మరిన్ని వార్తలు