మాకే నీళ్లు లేవు !

26 Aug, 2016 01:47 IST|Sakshi
మాకే నీళ్లు లేవు !

సాక్షి, చెన్నై: కర్ణాటక నుంచి తమిళనాడులోకి కావేరి జలాల రాక, సంకటంగా మారే అవకాశాలు కన్పిస్తున్నాయి. ఇందుకు అద్దం పట్టే పరిణామాలు గురువారం చోటు చేసుకున్నాయి. తమకే నీళ్లు లేనప్పుడు ఎలా పంపిణీ చేయగలమని కర్ణాటక సీఎం సిద్ధరామయ్య స్పష్టం చేయడం గమనించాల్సిన విషయం. మానవతాదృక్పథంతో , సోదర భావంతో ఆలోచించాలని తమిళ రైతుల వేడుకోలు పరిశీలన జరుపుతామన్న హామీతో దాటవేత ధోరణి అనుసరించారు. తమిళనాడు- కర్ణాటకల మధ్య జలవివాదం కొత్తేమీ కాదు. ప్రతి ఏటా వాటా నీటి విడుదల కోసం తీవ్ర పోరాటం చేయాల్సిన పరిస్థితి. ఐదేళ్లుగా వాటా సరిగ్గా అందక,  డెల్టా అన్నదాతలు కన్నీటి మడుగులో మునిగారు.
 
  ఈ ఏడాది కురువై కోల్పోయిన అన్నదాతలు సంబాను అయినా రక్షించుకునేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. డెల్టా అన్నదాతల వరప్రదాయిని మెట్టూరు డ్యాంలో ప్రస్తుతం ముప్పై టీఎంసీల నీళ్లు ఉన్నా, అది సంబాసాగుకు సరి పడదు. ఈ దృష్ట్యా, తమిళనాడుకు వాటాగా విడుదల చేయాల్సిన నీటి కోసం కర్ణాటకతో పోరాటానికి రాష్ర్ట ప్రభుత్వం కోర్టును ఆశ్రయించింది. అదే సమయంలో అన్నదాతలు జలం కోసం గళం విప్పుతూ నిరసనల బాట పటాటరు. ఈ నిరసనలు రెండు మూడు రోజుల్లో మరింత ఉధృతం కాబోతున్నాయి. ఈ సమయంలో తమిళనాడు ప్రభుత్వం తమ గోడును పట్టించుకోని నేపథ్యంలో, కర్ణాటక సీఎం సిద్ధరామయ్యను అయినా వేడుకుందామనుకున్నట్టుగా బెంగళూరు వైపుగా రైతు నాయకులు కదలడం గమనార్హం.
 
 నీటి విడుదల కష్టమే:
 మాజీ ఎంపీ, ప్రకృతి, జలవనరుల పరిరక్షణ సంఘం నేత రామలింగం,  ఉలవర్‌ఉలైపాలి కట్చి నేత చెల్లముత్తుల నేతృత్వంలో ఇరవైకు పైగా రైతు సంఘాల నాయకులు ఏకం అయ్యారు. వీరంతా ఉదయాన్నే బెంగళూరుకు చేరుకున్నారు. అక్కడ సీఎం సిద్ధరామయ్య ఇంటి వద్దకు చేరుకుని తమ గోడును వెల్లబోసుకున్నారు. తమకు సిద్ధరామయ్య అనుమతి ఇవ్వడంతో ఆయన నివాశంలో అర గంట పాటు భేటీ అయ్యారు. ప్రధానంగా డెల్టా జిల్లాల్లోని అన్నదాతల దయనీయ పరిస్థితి, సంబాసాగుబడికి కావాల్సిన నీళ్లు, తమ అన్నదాతల్ని ఆదుకునే విధంగా కావేరిలో నీటి విడుదలకు విన్నవిస్తూ వినతి పత్రం సమర్పించారు. దానిని పరిశీలించిన సిద్ధరామయ్య తమకే నీళ్లు లేదు అని, ఇంకెక్కడ కావేరిలో విడుదల చేయగలమని స్పందించడం గమనార్హం.
 
  తమకే వర్షాలు సరిగ్గా పడ లేదు అని, ఉన్న నీళ్లు కేవలం తాగు నీటికి మాత్రం వాడుకోవాల్సిన పరిస్థితి ఉందని, ఈ దృష్ట్యా, నీళ్లు విడుదల కష్టమేనని స్పష్టం చేయడంతో రైతు సంఘాల ప్రతినిధులు తీవ్ర ఆవేదనకు గురి అయ్యారు. మానవతాదృక్పథంతో ఆలోచించాలని, సోదరభావంతో తమకు సహకారం అందించాలని ఈసందర్భంగా సిద్ధరామయ్యను రైతు ప్రతినిధులు విజ్ఞప్తి చేశారు. రెండు రాష్ట్రాల మధ్య ఉన్న సోదరతత్వాన్ని వివరిస్తూ, సంబాసాగుబడి నిమిత్తం తమను ఆదుకోవాలని విన్నవించారు. చివరకు పరిశీలిస్తామన్న హామీతో దాటవేత ధోరణిని కర్ణాటక సీఎం అనుసరించి ఉండడం బట్టి చూస్తే, కావేరి ఈ సారి రాష్ట్రంలోకి సంవృద్ధిగా వచ్చేది అనుమానంగా మారింది. సెప్టెంబర్ చివరి నాటికి నీళ్లు ఇచ్చినా సంబాసాగుకు ఆస్కారం ఉంది. ఆ తర్వాత నీళ్లు ఇచ్చినా ఉపయోగం శూన్యమే. దీన్ని బట్టి చూస్తే, జల సంకట నేపథ్యంలో  సంబాసాగు ఈ ఏడాది  కూడా ప్రశ్నార్థకం అయ్యే అవకాశాలు ఉండడంతో అన్నదాతల్లో ఆందోళన రెట్టింపు అవుతోంది.
 
 అఖిల పక్షం, తీర్మానానికి పట్టు:
 సిద్ధరామయ్యతో రైతు సంఘాల భేటీ నేపథ్యంలో ప్రధాన ప్రతి పక్ష నేత స్టాలిన్ మదురైలో స్పందించారు. కావేరి జలాల విడుదలలో నెలకొంటున్న పరిస్థితులపై చర్చించి నిర్ణయాలు తీసుకునేందుకు అఖిల పక్షానికి రాష్ట్ర ప్రభుత్వం పిలుపునివ్వాలని డిమాండ్ చేశారు. అఖిల పక్షం తదుపరి, ప్రత్యేక తీర్మానం అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో తీసుకురావాలని, తదుపరి సంబంధిత మంత్రితో అఖిల పక్షం సభ్యులు ఢిల్లీ వెళ్లి ప్రధాని నరేంద్రమోదీపై ఒత్తిడి తెచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని కోరారు.

మరిన్ని వార్తలు