జయలలితతో జాగ్రత్త!

25 Jul, 2014 08:23 IST|Sakshi
జయలలితతో జాగ్రత్త!
  • శాసన మండలిలో చలోక్తులు
  • బెంగళూరు :  వాగ్వాదాలు.. విమర్శలు.. ఒకరిపై ఒకరు ఆరోపణలు.. దూషణలతో నిత్యం వాడివేడిగా ఉండే శాసన మండలిలో గురువారం మాత్రం నవ్వులు విరబూశాయి. అధికార.. విపక్ష నేతలు ఒకరిపై ఒకరు హాస్యోక్తులు విసురుకున్నారు. ఎమ్మెల్సీ జయమాల ప్రశ్నకు సీఎం సిద్ధరామయ్య సమాధానమిస్తూ పొరపాటున జయమాలను జయలలిత అని సంబోధించారు.

    అప్రమత్తమైన సభాపతి డీహెచ్ శంకరమూర్తి ‘అయ్యయ్యో... ఇక్కడ జయలలిత ఎందుకు..? ’ అని సిద్ధు తప్పును ఎత్తిచూపారు. ఇంతలో విపక్ష నేత కేఎస్ ఈశ్వరప్ప జోక్యం చేసుకొని.. ‘జయలలితకు మీరు దూరంగా ఉంటే మేలు. గతంలో రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రిగా పనిచేసే సమయంలో ఆమె మనస్తత్వం నాకు బాగా తెలుసు’ అని వ్యంగ్యంగా అన్నారు. దీంతో సభ ఒక్కసారిగా గొల్లుమంది.

    తానేమైనా తక్కువా అన్నట్లు సిద్ధరామయ్య కూడా దానికి దీటుగా సమాధానమిచ్చారు. ‘నేను దూరంగానే ఉన్నా జయలలిత మా త్రం ఊరికే ఉండదు. అయినా రాష్ట్ర ప్రయోజనాల కోసం ఆమెతో కొన్ని విషయాల గురించి తప్పక చర్చిం చాల్సి ఉంది’ అన్నారు. కాంగ్రెస్ ఎమ్మెల్సీ ఉగ్రప్ప మాట్లాడుతూ.. ‘అయినా సిద్ధరామయ్య, జయలలిత ఇద్దరూ పక్కపక్క జిల్లాలకు చెందినవారే. అందువల్ల జయలలిత సిద్ధరామయ్యను ఇబ్బంది పెట్టరు’ అన్నారు.

    సీఎం మాట్లాడుతూ.. ‘అయినా ఈశ్వరప్ప చెప్పారు కాబట్టి ఇక నుంచి నేను జయలలితకు దూరంగానే ఉంటా’ అన్నారు. కాంగ్రెస్ సభ్యురాలు మోటమ్మ మాట్లాడుతూ.. ‘ఎప్పుడూ ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకొనే ఈశ్వరప్ప.. సిద్ధరామయ్య సలహాలు, సూచనలు కూడా స్వీకరిస్తారని ఇప్పుడే అర్థమైంది’ అన్నారు.

    సీఎం మాట్లాడుతూ..‘చట్టసభల్లో మేమిద్దరం విమర్శించుకోవడం చూసి బయట కూడా అలాగే ఉంటామని అందరూ భావిస్తారు. అయితే అది చాలా తప్పు. మేమిద్దం మంచి స్నేహితులం’ అన్నారు. జేడీఎస్ నేత మరితిబ్బేగౌడ మాట్లాడుతూ.. ‘మీరిద్దరూ మంచి స్నేహితులని ఇన్నాళ్లకైనా ఇలా బహిరంగంగా అంగీకరించినందుకు ధన్యవాదాలు’ అనడంతో సభలో అందరూ నవ్వుకున్నారు. 

మరిన్ని వార్తలు