మమ్మల్నే ఫీజు అడుగుతారా?

25 Apr, 2017 00:42 IST|Sakshi
మమ్మల్నే ఫీజు అడుగుతారా?

- టోల్‌ప్లాజాపై ఎంపీ నిమ్మల తనయుల వీరంగం
అనుచరులతో కలసి కంప్యూటర్లు, అద్దాలు ధ్వంసం


హిందూపురం అర్బన్‌/ చిలమత్తూరు/ బాగేపల్లి (కర్ణాటక): తెలుగుదేశం పార్టీకి చెందిన అనంతపురం జిల్లా హిందూపురం ఎంపీ నిమ్మల కిష్టప్ప తనయులు అంబరీష్, శిరీష్‌ సోమవారం ఆంధ్ర– కర్ణాటక సరిహద్దులోని బాగేపల్లి టోల్‌ప్లాజాలో వీరంగం సృష్టించారు. టోల్‌గేట్‌ వద్ద అంబరీష్‌ అనుచరుల కారును ఆపి గేట్‌ ఫీజు అడిగారన్న కోపంతో విధ్వంసానికి దిగారు. అనుచరులతో కలిసి టోల్‌ప్లాజాపై దాడి చేసి.. కంప్యూటర్లు, అద్దాలు పగులగొట్టారు. సోమవారం ఉదయం పది గంటలకు ఎంపీ పెద్ద కుమారుడు అంబరీష్‌ ఇన్నోవా కారు (ఏపీ02 బీడీ 1234)లో, అతని స్నేహితులు ఫోర్డ్‌ కారు (ఏపీ02 ఈబీ 6777)లో  కర్ణాటకలోని బాగేపల్లి టోల్‌ ప్లాజా వద్దకు చేరుకున్నారు. టోల్‌ప్లాజా సిబ్బందికి ఎంపీ పాస్‌ జిరాక్సు కాపీ చూపించారు.

దాన్ని పరిశీలించిన సిబ్బంది.. ‘ఇది వ్యాలిడిటీ అయిపోయింది. ఈ పాస్‌ కేవలం పార్లమెంట్‌ సభ్యులకు మాత్రమే ఉంటుంది. కుటుంబ సభ్యులందరికీ అనుమతి లేదు. అయినా ఎంపీ కుమారుడివి కావడంతో ఈసారి అనుమతిస్తున్నామ’ని చెప్పా రు. అయితే.. తన స్నేహితుల ఫోర్డ్‌ కారుకు కూడా అనుమతివ్వాలని అంబరీష్‌ పటు ్టబట్టాడు. ఇందుకు సిబ్బంది నిరాకరించడంతో తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తం చేశాడు. ‘ఎవరితో మాట్లాడుతున్నారో తెలుస్తోందా? తమాషా చేస్తున్నారా?’ అంటూ తీవ్ర స్థాయిలో బెదిరించాడు. టోల్‌ప్లాజా సిబ్బంది  వారించినా అతను వినలేదు. వారిపై శివాలెత్తుతూనే.. గోరంట్లలోని తన తమ్ముడు నిమ్మల శిరీష్, ఇతర అనుచరులకు ఫోన్‌ చేసి రప్పించాడు. 

కొంతసేపటికి కారులో శిరీష్‌తో పాటు ఏడుగురు అక్కడికి చేరుకుని టోల్‌ప్లాజాపై దాడి చేశారు. అద్దాలు పగులగొట్టారు. రెండు కంప్యూటర్లను ధ్వంసం చేశారు. అడ్డొచ్చిన సిబ్బందిపై చేయి చేసుకున్నారు. తమతో పెట్టుకుంటే పరిస్థితి తీవ్రంగా ఉంటుందని హెచ్చరించి బెంగళూరు వైపు వెళ్లిపోయారు. దీంతో బాగేపల్లి పోలీసులు నిమ్మల అంబరీష్, నిమ్మల శిరీష్, పాపన్న, నరేష్, లక్ష్మీపతి, మునికుమార్, శ్రీకృష్ణపై 149, 143, 147, 323, 324, 504, 427, 506  సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. అనంతరం వారు బాగేపల్లి పోలీసుస్టేషన్‌కు వెళ్లి లొంగిపోయారు. ఆ తర్వాత స్టేషన్‌ బెయిల్‌పై విడుదలయ్యారు.

మరిన్ని వార్తలు