మారిన దొంగ.. మార్పు కోసం కృషి

7 May, 2016 11:46 IST|Sakshi
బెంగళూరు: సుమారు 30ఏళ్ల పాటు చోరీలకు పాల్పడిన ఓ దొంగలో పరివర్తన వచ్చింది. దీంతో తాను దొంగిలించిన సొత్తును తిరిగి యజమానులకు ఇచ్చేందుకు సిద్ధం అయ్యాడు.  సొత్తు యజమానులకు క్షమాపణలు చెప్పి, దొంగలించిన సొమ్మును తిరిగి ఇవ్వడానికి నిర్ణయించుకున్నాడు. అంతేకాకుండా సమాజంలో మార్పు కోసం అతడు తనవంతు కృషి చేస్తున్నాడు.  వివరాల్లోకి వెళితే బెంగళూరులోని యెలగవి ప్రాంతానికి చెందిన బస్వరాజ్ నింగప్ప బెలగజ్జరి సుమారు  260మంది నివాసాల్లో చోరీలకు పాల్పడ్డాడు. జైలు జీవితం అనంతరం అతడు సత్ ప్రవర్తన గల వ్యక్తిగా జీవించాలనుకున్నాడు. అంతేకాకుండా సమాజంలో మార్పు కోసం తనవంతు కృషి చేయాలనుకున్నాడు.
 
దీంతో బస్వరాజ్ నింగప్ప జాతీయ జెండా చేత పట్టుకొని 450 కిలోమీటర్ల మేర తిరుగుతూ ప్రతి ఒక్కరూ చదువుకోవాలని ప్రచారం చేస్తున్నాడు.  అణగారిన వర్గాలు పైకి రావాలంటే విద్యకు మించిన మార్గం లేదని తన ఉపన్యాసాలతో జనాల్లో చైతన్యం తెచ్చేందుకు యత్నిస్తున్నాడు.
 
బస్వరాజ్ నింగప్ప మాట్లాడుతూ... 'నేను 30 ఏళ్ల నిందితునిగా శిక్ష అనుభవించిన కాలంలో ఎంతోమంది నేరస్తులను చూశానని, వారంతా అలా మారడానికి పేదరికం, నిరక్షరాస్యతే కారణం' అని తెలిపాడు. ఇక  తాను దొంగిలించిన  బంగారం ఏ షాపులో అమ్మిన విషయాలను కోర్టులో చెప్పడానికి సిద్ధంగా ఉన్నానని  నింగప్ప చెప్పాడు. కాగా తాను ప్రభుత్వ ఉద్యోగుల నివాసాల్లో మాత్రమే దోపిడీ చేశానని ఒక్క పేదవాని ఇంట్లో కూడా చోరీకి పాల్పడలేదని తెలిపాడు.
 
>
మరిన్ని వార్తలు