అభిమానం అంటే ఇదేనేమో..

11 Jan, 2020 16:06 IST|Sakshi

బెంగుళూరు : కర్టాటకలోని దేవన్‌గిరి ప్రాంతంలోని చెన్నగిరి తలాక్‌లోని ఎస్‌వీఆర్‌ కాలనీవాసులు చనిపోయిన కోతికి గుడి కట్టి తమ అభిమానాన్ని చాటుకున్నారు. వివరాల్లోకి వెళితే.. మూడు నెలల క్రితం ఒక కోతుల గుంపు చెన్నగిరి తలాక్‌ ప్రాంతంలోకి వలస వచ్చాయి. అయితే సాధారణంగా కోతులు ఒక ప్రాంతానికి వస్తే తమ కోతి చేష్టలతో అందరినీ ఇబ్బందిపెడుతుంటాయి. అయితే ఈ కోతులు మాత్రం అలా ప్రవర్తించలేదు. ఎవరికి ఏ హానీ తలపెట్టకుండా కాలనీ వాసులతో కలిసిపోయి ఎంచక్కా వారి పిలల్లతో కలిసి ఆడుకునేవి. అయితే బుధవారం ఆ గుంపులోని ఒక మగ కోతి ఆకస్మాత్తుగా చనిపోయింది. దీంతో హిందూ సంప్రదాయ పద్దతిలో ఆ కోతికి అంత్యక్రియలు నిర్వహించడమే గాక దాని పేరు మీద ఒక గుడి కట్టాలని కాలనీవాసులు నిర్ణయించుకున్నారు. ఇదే విషయమై ఆ ఊరి సర్పంచ్‌ను కలిసి కోతి అంత్యక్రియలకు, గుడి కట్టేందుకు అనుమతి తీసుకున్నారు. దీంతో శుక్రవారం ఆ కోతి అంత్యక్రియలు జరిపారు. ఇక్కడ ఆసక్తికర విషయం ఏంటంటే కోతికి అంత్యక్రియలు చేస్తున్న సమయంలో మిగతా కోతులు తమ ప్రియ నేస్తానికి నివాళి అర్పించడం అక్కడున్న అందరినీ కలిచివేసింది. కోతికి అంత్యక్రియలు జరిపిన స్థలంలోనే గుడి కట్టనున్నట్లు కాలనీవాసులు ప్రకటించారు.  

>
మరిన్ని వార్తలు