కార్తీక్ నా భర్త

29 Aug, 2014 01:59 IST|Sakshi
కార్తీక్ నా భర్త
  • వర్ధమాన నటి మైత్రేయి  
  •  న్యాయం జరిగే వరకూ పోరాటం
  •  మోసం చేశాడని పోలీసులకు ఫిర్యాదు
  •  420 సెక్షన్ కింద కార్తీక్‌పై కేసు నమోదు
  •  వాస్తవమని తేలితే చర్యలు తప్పవు : సిద్ధు
  • సాక్షి, బెంగళూరు : కేంద్ర రైల్వే శాఖ మంత్రి సదానందగౌడ కుమారుడు కార్తీక్ గౌడ తన భర్త అని వర్ధమాన నటి మైత్రేయి స్పష్టం చేశారు. ఈ విషయంలో తనకు న్యాయం జరిగే వరకూ పోరాటం చేస్తానని ఆమె తేల్చి చెప్పారు. గురువారం మీడియాతో ఆమె మాట్లాడారు. రెండున్నరేళ్ల క్రితమే తాను కాంగ్రెస్ పార్టీలో చేరానని, అయితే తాజా ఘటనకు తాను కాంగ్రెస్ కార్యకర్త కావడానికి సంబంధం లేదని తేల్చి చెప్పారు. ఇటీవల తనకు దూరంగా ఉంటున్న కార్తీక్ ఫోన్ చేసి ‘వేరే అమ్మాయితో నిశ్చితార్థం అయింది, ఇకపై నీతో కలిసి ఉండేందుకు వీలుకాదు. మీడియా ముందుకు వెళ్లొద్దు.
     
    నీకు ఎలాంటి సహాయం కావాలన్నా చేస్తా’నని చెప్పారని వివరించారు. అయితే తనను భార్యగా అంగీకరించేంత వరకూ న్యాయ పోరాటం చేస్తానని చెప్పారు. కాగా, తనకు జరిగిన అన్యాయంపై బుధవారం రాత్రి ఆర్‌టీ నగర పోలీస్ స్టేషన్‌లో మైత్రేయి ఫిర్యాదు చేశారు. దీనికి సంబంధించి కార్తీక్‌గౌడపై ఐపీసీ 376, 420 కింద కేసు నమోదు చేశారు. ఈ నేపథ్యంలోనే గురువారం ఉదయం మైత్రేయికి వైద్య పరీక్షలు నిర్వహించారు.
     
     వాస్తవమని తేలితే చర్యలు తప్పవు
     
     ఘటనకు సంబంధించి ముఖ్యమంత్రి సిద్ధరామయ్య మీడియాతో మాట్లాడుతూ... మైత్రేయికి అన్యాయం జరిగినట్లు తేలితే దోషులపై కఠిన చర్యలు తప్పవని అన్నారు. ఈ విషయంలో ఎలాంటి తారతమ్యం ఉండబోదని స్పష్టం చేశారు. ఘటనకు సంబంధించి సదానందగౌడను బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా వివరణ కోరినట్లు సమాచారం.
     
    మైత్రేయికు నోటీస్ జారీ
     
    ఫిర్యాదుకు సంబంధించి తన వద్ద ఉన్న సాక్ష్యాధారాలను అందించేందుకు గురువారం మధ్యాహ్నాం 12.30 గంటలకు పోలీస్ స్టేషన్‌కు రావాలని మైత్రేయికి బుధవారం రాత్రి పోలీసులు సూచించారు. అయితే సాయంత్రం మూడు గంటలు దాటిపోయినా ఆమె పోలీస్ స్టేషన్‌కు చేరుకోలేదు. దీనిపై వివరణ కోరుతూ మైత్రేయికి ఆర్‌టీ నగర పోలీసులు నోటీస్ జారీ చేశారు. కాగా, ఈ విషయంపై బీజేపీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు ప్రహ్లాద్‌జోషి మాట్లాడుతూ... దర్యాప్తు పూర్తి అయిన తర్వాత వాస్తవాలు వెలుగు చూస్తాయని అన్నారు. ఈ విషయంపై సదానందగౌడతో మాట్లాడినట్లు చెప్పారు. కార్తీక్ గౌడ ఎలాంటి తప్పు చేయలేదని ఆయన వివరించారని పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు