కరుణోత్సవం

3 Jun, 2017 02:28 IST|Sakshi
కరుణోత్సవం

► ఒకే రోజు రెండు పండుగలు
► జన్మదినోత్సవానికి భారీ ఏర్పాట్లు
►  రాహుల్‌ సహా జాతీయ నాయకుల రాక
►  రాయపేట వైఎంసీఏ మైదానం వేదిక


రాజకీయ కురువృద్ధుడు, డీఎంకే అధినేత కరుణానిధి శనివారం 94వ జన్మదినోత్సవాన్ని  జరుపుకోనున్నారు. అలాగే తమిళనాడు అసెంబ్లీలో 50 ఏళ్లుగా ఎమ్మెల్యే జీవితాన్ని పూర్తిచేసుకుని వజ్రోత్సవ సంబరాలకు సిద్ధమయ్యారు. ఒకే రోజు రెండు పండుగలు రావడంతో డీఎంకే కార్యకర్తలు రెట్టింపు ఉత్సాహంతో ఉరకలేస్తున్నారు.

సాక్షి ప్రతినిధి, చెన్నై : నాగపట్నం జిల్లా తిరుకువాలైలో ముత్తువేల్, అంజుగం దంపతులకు 1923 జూన్‌ 3వ తేదీన జన్మించిన దక్షిణామూర్తి కాలక్రమంలో కరుణానిధిగా మారారు.   సినిమా రైటర్‌గా తన జీవితాన్ని ప్రారంభించిన కరుణానిధి ద్రవిడ ఉద్యమనేత, ద్రవిడ మున్నేట్ర కళగం (డీఎంకే) వ్యవస్థాపకులు సీఎన్‌ అన్నాదురై వద్ద రాజకీయ శిష్యరికం చేశారు. 1969 అన్నాదురై చనిపోయిన తరువాత డీఎంకే అధ్యక్షుడిగా మారారు.

రాజకీయ అరంగేట్రంలో గ్రామస్థాయిలో పంచాయతీ అధ్యక్షుడిగా తొలి అడుగు వేసినా రాష్ట్ర రాజధాని స్థాయిలో సీఎం కావడమే ప్రతినేత లక్ష్యం అంటే అతిశయోక్తి కాదేమో. పంచాయతీలు, వార్డులు దాటుకుని ఎమ్మెల్యేగా ఎన్నికవ్వడం రాజకీయాల్లో ఒక పెద్ద ప్రమోషన్‌. దీంతో ఆయా నేతలకు చెప్పలేనంత ఎమోషన్‌. తమిళనాడు రాజకీయాల్లో ఎమోషన్‌తో కూడిన ప్రమోషన్లను అదేపనిగా అందుకున్న వారిలో డీఎంకే అధినేత కరుణానిధి అగ్రగణ్యుడని చెప్పక తప్పదు. ఓటమిని ఎరుగని వీరుడుగా వరుసగా 12 సార్లు ఎమ్మెల్యేగా ఎంపికై 60 ఏళ్ల ఎమ్మెల్యే జీవితాన్ని అనుభవిస్తూ తమిళనాడు రాజకీయాల్లో ఒక రికార్డును నెలకొల్పారు.

1957లో తొలిసారిగా కులిత్తలై నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా గెలుపొందారు. 1962లో తంజావూరు, 1967, 1971లో చెన్నై సైదాపేట, 1977, 1980లో చెన్నై అన్నానగర్, 1989, 1961లో చెన్నై హార్బర్, 1996, 2001, 2006లో చెన్నై చేపాక్, 2011లో తిరువారూరులో గెలుపొందారు. 2016 అసెంబ్లీ ఎన్నికల్లో తిరువారూరు నుండి పోటీచేసి గెలుపొందారు. ఇలా వరుసగా 12 సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందిన ఈ రికార్డును బహుశా తమిళనాడులో మరెవ్వరూ బద్దలు కొట్టలేక పోవచ్చు.  రాజకీయాలేగాక రచనాశైలితో సైతం తమిళనాడు ప్రజలను మెప్పించి ‘కలైంజ్ఞర్‌’ అనే ముద్దుపేరును సంపాదించుకున్నారు.

ద్రవడి ఉద్యమాన్ని ప్రజల్లో ఉవ్వెత్తున తీసుకెళ్లడంతోపాటూ హిందీ భాషా వ్యతిరేకోద్యమంతో జాతీయ భాషపై కూడా దండెత్తారు. నిలువెల్లా తమిళభాషాభిమానాన్ని కలిగి ఉన్న కరుణానిధి 2006లో నిర్బంధ తమిళ చట్టాన్ని ప్రవేశపెట్టి అన్ని భాషలవారిని తన భాషా చట్రంలోకి తెచ్చుకునే ప్రయత్నం చేశారు. 2016లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో 92 ఏళ్ల వృద్దాప్యంలోనూ ప్రచారం చేసి ప్రజలను ఆశ్చర్యపరిచారు. 94 ఏళ్ల సుదీర్ఘ జీవితాన్ని 60 ఏళ్లుగా ఎమ్మెల్యేగా కొనసాగుతున్న అనుభవాన్ని తమిళనాడులో మరో రాజకీయవేత్తకు దక్కక పోవచ్చు.

సీఎంగా ఐదుసార్లు రికార్డు :
ఎమ్మెల్యేగానే కాదు తమిళనాడు ముఖ్యమంత్రిగా ఐదుసార్లు పీఠం ఎక్కిన రికార్డు కూడా ఉంది. తమిళనాడు 3, 4, 10, 12, 16 ముఖ్యమంత్రిగా పనిచేశారు.
వ్యక్తిగత జీవితంలోనూ రికార్డే :
రచనారంగం, రాజకీయ రంగాల్లోనే గాక వ్యక్తిగత జీవితంలో కూడా కరుణానిధి నెలకొల్పిన రికార్డులు చెప్పుకోదగ్గవి. తొలిగా పద్మావతిని వివాహమాడి  ఆ తరువాత దయాళూ అమ్మాళ్‌లను పెళ్లి చేసుకుని ఇద్దరు భార్యల ముద్దుల మొగుడిగా మారారు. ప్రస్తుతం కరుణానిధి కలిసి జీవిస్తున్న రాజాత్తి అమ్మాళ్‌తో ఆయనకు సంబంధాలపై కొందరు రకరకాల వ్యాఖ్యానాలు చేసినా, ఆయన మాత్రం ఆమెను తన సహచరిణిగా చెప్పుకుంటారు. కరుణానిధి మొదటి భార్య పద్మావతి యుక్తవయస్సులోనే చనిపోయారు. ఎంకే ముత్తు, ఎమ్‌కే అళగిరి, ఎమ్‌కే స్టాలిన్, తమిళరసు కుమారులు కాగా, సెల్వి, కనిమొళి కుమార్తెలున్నారు. పెద్ద భార్య పద్మావతికి ఎంకే ముత్తు (చిన్న వయసులోనే చనిపోయాడు ) జన్మించగా, అళగిరి, స్టాలిన్, సెల్వి, తమిళరసు దయాళూ అమ్మాళ్‌కు జన్మించారు. రాజాత్తి అమ్మాళ్‌కు కనిమొళి జన్మించారు.

స్టాలిన్‌కు పగ్గాలు :
వృద్దాప్యం సమీపిస్తుండగా తన రాజకీయ వారసులు ఎవరనే విషయంలో ఒకే తల్లికి పుట్టిన అళగిరి, స్టాలిన్‌ మధ్య ఘర్షణలు తలెత్తగా కరుణ మాత్రం స్టాలిన్‌వైపే నిలిచారు. అళగిరిని పార్టీ నుండి బహిష్కరించారు. తనకు సరైన వారసుడు స్టాలినే అని పలుమార్లు ప్రకటించడంతోపాటూ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షునిగా నియమించి పగ్గాలు అప్పగించారు. వృద్దాప్యంతో తీవ్ర అస్వస్థతకు గురైన కరుణానిధి నేడు 94 ఏళ్ల బర్త్‌డే బాయ్‌గా మారుతున్నారు.

తమిళనాడులో సీనియర్‌ రాజకీయవేత్త కరుణానిధి 94వ జన్మదినోత్సవాలు డీఎంకే అధ్వర్యంలో నిర్వహిస్తున్నారు. చెన్నై రాయపేట వైఎమ్‌సీఏ మైదానంలో సాయంత్రం 5 గంటలకు ప్రారంభమయ్యే వేడుకల కోసం భారీ వేదిక సిద్ధమైంది. చెన్నై సచివాలయాన్ని తలపించే రీతిలో వెనుకవైపు సెట్టింగ్‌ వేయడం ద్వారా రాబోయేది డీఎంకే ప్రభుత్వమేనని చాటుకునే ప్రయత్నం చేస్తున్నారు. కరుణ జన్మదిన వేడుకల్లో 156 సాంస్కృతిక కార్యక్రమాలను ప్రదర్శిస్తున్నట్లు చెన్నై జిల్లా కార్యదర్శి ఎం సుబ్రమణియన్‌ తెలిపారు. ఈ జన్మదినంతో ఎమ్మెల్యేగా 50 ఏళ్లుపూర్తి చేసుకున్న నేతగా వజ్రోత్సవ పండుగను కూడా జరుపుకుంటున్నారు.

అలాగే ఐదేళ్లు సీఎం అయిన ఘనతను సంతరించుకున్నారు. పార్టీలో మహిళలకు 30 శాతం రిజర్వేషన్, గుడిసెల, పేదరిక నిర్మూలన, తాగునీటి శాఖలు ప్రవేశపెట్టిన ఘనత కరుణకు మాత్రమే సొంతమని పార్టీ చెబుతోంది. అంతేగాక తన పాలనలో రైతు రుణాల రద్దు, పౌష్టికాహార పథకంలో వారానికి మూడుసార్లు కోడిగుడ్డు, అన్నదాతలు, చేనేతలకు ఉచిత విద్యుత్‌ వంటి అనేక సంక్షేమపథకాలకు కరుణానిధే శ్రీకారం చుట్టినట్లుగా పార్టీశ్రేణులు కీర్తిస్తున్నారు. కరుణానిధి వజ్రోత్సవాలను అత్యంత ఘనంగా నిర్వహించడం ద్వారా రాజకీయలబ్ధి పొందాలని డీఎంకే భావిస్తోంది. దేశంలోని వివిధ పార్టీలకు చెందిన ప్రతిపక్ష నేతలను కూడగట్టడం ద్వారా యూపీఏకు పూర్వవైభవం తేవాలని ప్రయత్నాలు చేస్తోంది.

ఈ దృష్టితోనే అఖిలభారత కాంగ్రెస్‌ ఉపాధ్యక్షులు రాహుల్‌గాంధీ, బీహార్‌ ముఖ్యమంత్రి నితీష్‌కుమార్, పుదుచ్చేరీ సీఎం నారాయణస్వామి, రాష్ట్రీయ జనతాదళ్‌ అధ్యక్షులు లాలూ ప్రసాద్‌ యాదవ్‌లతోపాటూ శరద్‌పవార్, ఫరూక్‌ అబ్దుల్లా, సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరీ తదితర పది మంది ప్రముఖ జాతీయ నేతలను ఆహ్వానించారు. ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియాగాంధీ రెండు రోజుల క్రితమే ఫోన్‌ ద్వారా కరుణకు శుభాకాంక్షలు చెప్పారు. రాహుల్‌గాంధీ తన చెన్నై పర్యటనలో భాగంగా డీఎంకే కార్యనిర్వాహక అధ్యక్షులు స్టాలిన్‌ ఇంటికి వెళ్లనున్నారు.

త్వరలో రానున్న రాష్ట్రపతి ఎన్నికల కోసం ప్రతిపక్షాల తరఫున ఒక అభ్యర్థిని సూచించేందుకు ఈ ఉత్సవాలను అవకాశంగా తీసుకుంటారని తెలుస్తోంది. దీంతో ఇది కేవలం కరుణ జన్మదిన వేదికగా కాక జాతీయస్థాయి రాజకీయ ప్రాధాన్యతను సంతరించుకుంది. దీంతో అధికార బీజేపీ ఈ వేడుకలపై దృష్టిపెట్టి విపక్ష నేతల కదలికలను గమనించడం ప్రారంభించింది.

మరిన్ని వార్తలు