కోర్టుకు రండి

11 Dec, 2015 09:56 IST|Sakshi
కోర్టుకు రండి

సాక్షి, చెన్నై: పరువు నష్టం దావా కేసులో విచారణకు హాజరు కావాలని డీఎంకే అధినేత ఎం.కరుణానిధికి చెన్నై మొదటి సెషన్స్‌కోర్టు గురువారం ఆదేశాలు జారీ చేసింది. జనవరి 18వ తేదీన కోర్టుకు రావాలని సమన్లు జారీ చేశారు. సీఎం జయలలితకు వ్యతిరేకంగా కథనాలు ప్రచూరించినా, ఆరోపణలు గుప్పించినా పరువు నష్టం దావాలు కోర్టుల్లో దాఖలవుతున్న విషయం తెలిసిందే. ఆ మేరకు ఇటీవల సీఎం జయలలితకు వ్యతిరేకంగా ఓ వార పత్రికలో వచ్చిన కథనం ఆధారంగా డీఎంకే అధినేత ఎం.కరుణానిధి స్పందించారు.
 
 ఆ పార్టీకి చెందిన మురసోలి పత్రికలో తనదైన శైలిలో రాసిన కథనాన్ని ప్రభుత్వం తరఫు న్యాయవాదులు తీవ్రంగా పరిగణించారు. సీఎంకు వ్యతిరేకంగా ఆధార రహిత ఆరోపణలు చేశారంటూ ఓ వార పత్రిక మీద, కరుణానిధి మీద, మురసోలి పత్రిక యాజమాన్యం మురసోలి సెల్వం మీద పరువు నష్టం దావాలు వేశారు. చెన్నై మొదటి సెషన్స్ కోర్టులో దాఖలైన ఈ దావాలు గురువారం విచారణకు వచ్చాయి.
 
 ప్రభుత్వం తరఫు న్యాయవాదులు తమ వాదన విన్పించారు. వాదన అనంతరం డీఎంకే అధినేత ఎం కరుణానిధికి కోర్టుకు విచారణ నిమిత్తం హాజరు కావాలంటూ న్యాయమూర్తి ఆదినాథన్ ఆదేశాలు జారీ చేశారు. వచ్చేనెల 18న కోర్టుకు రావాలంటూ సమన్లు జారీ చేశారు. ఫిబ్రవరి ఒకటో తేదీన విచారణకు రావాలంటూ ఆ వార పత్రిక యాజమాన్యంకు సమన్లు జారీ అయ్యాయి.
 

మరిన్ని వార్తలు