’సౌమ్య’ కేసులో కట్జూకు సుప్రీం ఆదేశం

18 Oct, 2016 08:31 IST|Sakshi
కట్జూ.. కోర్టుకు రండి: సుప్రీం ఆదేశం

న్యూఢిల్లీ: అసాధారణ రీతిలో దేశంలోనే తొలిసారిగా ఓ మాజీ సుప్రీం కోర్టు జడ్జిని తన ముందు ప్రత్యక్షంగా హాజరై వివరణ ఇవ్వాల్సిందిగా సుప్రీంకోర్టు బెంచ్ ఆదేశించింది. సంచలనం సృష్టించిన కేరళ సౌమ్య రేప్, హత్య కేసులో సుప్రీం వెలువరించిన తీర్పులో ప్రాథమిక తప్పులున్నాయని మాజీ సుప్రీంకోర్టు జడ్జి మార్కండేయ కట్జూ సెప్టెంబర్‌లో తన ఫేస్‌బుక్ పేజీలో పోస్టు చేశారు. ఈ విషయాన్ని కోర్టు సీరియస్‌గా తీసుకుంది. ‘కట్జూ గౌరవప్రదమై వ్యక్తి.

అందుకే ఆయనే స్వయంగా కోర్టుకు వచ్చి ఫేస్‌బుక్‌లో వ్యాఖ్యలపై వివరణ ఇవ్వాలి’ అని జస్టిస్ రంజన్ గొగోయ్, జస్టిస్ యూయూ లలిత్‌ల బెంచ్ వ్యాఖ్యానించింది. తీర్పు ఇచ్చే ముందు జడ్జీలు సెక్షన్ 300ను క్షుణ్ణంగా పరిశీలించలేదని, ఈ కేసును బహిరంగ కోర్టులో పునర్విచారించాలని కట్జూ అనడం విచారకరమని అభిప్రాయపడింది. ఈ మేరకు కట్జూకు కోర్టు నోటీసులిచ్చింది. మాజీ జడ్జిని ఇలా ఆదేశించడం ఇదే తొలిసారని ఈ కేసుకు సంబంధించి కోర్టుకు హాజరైన అటార్నీ జనరల్ ముకుల్ రోహత్గీ వ్యాఖ్యానించారు.

మరిన్ని వార్తలు