కావేరి పరవళ్లు..

18 Jul, 2016 03:02 IST|Sakshi
కావేరి పరవళ్లు..

సాక్షి, చెన్నై : నైరుతి రుతు పవనాల ప్రభావంతో కర్ణాటకలో వర్షాలు కురుస్తుండడం రాష్ట్రం వైపుగా కావేరి నది పరవళ్లు తొక్కుతున్నది.  నీటి రాక క్రమంగా పెరుగుతుండడంతో మెట్టూరు జలాశయం నిండేనా అన్న ఎదురు చూపులు పెరిగాయి. ఇక, హొగ్నెకల్ వద్ద కావేరి ఉధృతిని తిలకించేందుకు పర్యాటకుల తాకిడి పెరిగింది. కొన్నేళ్లుగా నైరుతి రుతు పవనాలు రాష్ట్రంలో ముఖం చాటేస్తూ వస్తున్న విషయం తెలిసిందే. దీంతో అన్నదాతలకు కష్టాలు తప్పడం లేదు. ఈ పవనాల ప్రభావంతో కర్ణాటకలో వర్షాలు కురిసిన పక్షంలో కావేరి నది పరవళ్లు తొక్కి, మెట్టురు డ్యాంకు నీటిని చేరుస్తుంది.

గత ఏడాది కర్ణాటకలో వర్షాలు అంతంత మాత్రమే కావడంతో  మెట్టురులోకి నీళ్లూ అంత మాత్రంగానే వచ్చి చేరాయి. ఈశాన్య రుతు పవనాల రాష్ట్రంలో ప్రభావం చూపించడంతో గట్టెక్కారు. అయితే, ఈ ఏడాది రాష్ట్రం మీద మరో మారు నైరుతి కన్నేసింది. దీంతో కర్ణాటకలో వర్షాలు కరిస్తే మెట్టూరు డ్యాంకు నీళ్లు వస్తాయన్న ఎదురు చూపులు పెరిగాయి. అయితే, అక్కడ ఆలస్యంగా వర్షాలు పలకరించడంతో ప్రస్తుతం కావేరిలోకి నీటి రాక క్రమంగా పెరుగుతున్నది.

కర్ణాటకలోని కృష్ణరాజ సాగర్, కపిని జలాశయాల్లోకి నీటి రాక పెరిగి ఉండడంతో ఉబరి నీటిని విడుదల చేశారు. నాలుగైదు రోజులుగా కావేరి నదిలోకి నీళ్లు కర్ణాటక వైపు నుంచి తరలివస్తున్నాయి. వందల్లో వస్తున్న గణపుటడుగుల నీటి శాతం, ప్రస్తుతం వేలల్లోకి చేరింది. ఆదివారానికి పదిహేను వేల వరకు గణపుటడుగుల నీళ్లు ప్రవహిస్తుండటంతో కావేరి పరవళ్ల ఉధృతి పెరిగింది. కావేరి తీర వాసులు నీటి ప్రవాహాన్ని తిలకించేందుకు నదీ తీరంలోకి పరుగులు తీస్తున్నారు.
 
కావేరి పరవళ్లు:  
గత ఐదారు రోజులుగా కావేరి తీరంలో కురుస్తున్న వర్షాలతో, కర్ణాటకలోని జలాశయాల ఉబరి నీటి విడుదలతో మెట్టూరు డ్యాంలోకి నీటి రాక పెరిగింది.  భారత నయాగారాగా పేరుగడించిన హొగ్నెకల్ వద్ద నీటి ఉధృతి మరింత పెరగడంతో అక్కడ జలపాతాలు కనువిందు చేస్తున్నాయి. ఆదివారం సెలవు దినం కావడంతో వేలాది మంది హొగ్నెకల్‌కు తరలి వచ్చిన కావేరి పరవళ్లను తిలకించారు. అక్కడ చేపల వంటకాల రుచి చూసి ఆనందాన్ని పంచుకున్నారు. అయితే, హొగ్నెకల్‌లో నీటి ఉధృతి పెరగడంతో బుట్ట పడవలను నిషేధించారు. దీంతో బుట్ట పడవల్లో కావేరిలో చక్కర్లు కొట్ట లేక పోయామన్న నిరాశ పర్యాటకులకు తప్పలేదు.

నీటి ఉధృతి మరింతగా పెరిగే అవకాశం ఉండడంతో, అధికారులు అప్రమత్తం అయ్యారు. హొగ్నెకల్ పరిసరాలతో పాటు కావేరి తీర వాసుల్ని అలర్ట్ చేస్తున్నారు. ఈనెల మొదటి వారంలో 42 అడుగుల మేరకు నీటిని కల్గి ఉన్న మెట్టూరు జలాశయం ప్రస్తుతం యాభై అడుగుల చేరువలో ఉండడంతో  డెల్టా అన్నదాతల్లో ఆశలు చిగురిస్తున్నాయి.  కర్ణాటకలో వర్షాలు మరింతగా తాండవం చేసిన పక్షంలో అక్కడి జలాశయాలు నిండి కావేరిలోకి నీళ్లు మరింతగా పరవళ్లు తొక్కాలని దేవుళ్లను వేడుకుంటున్నారు.  ఇక, రాష్ట్రంలోనూ అక్కడక్కడ చెదురుముదురుగా వర్షాలుపడే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం ప్రకటించింది.
     
కావేరి తీరంలో మరింత జోరు వాన పడే అవకాశం ఉందన్న సమాచారంతో మెట్టూరు డ్యాం నిండే విధంగా కర్ణాటక వైపు నుంచి నీళ్లు రావాలన్న ఎదురు చూపులు పెరిగాయి.

మరిన్ని వార్తలు