కేంద్ర హోం మంత్రిని కలిసిన కేజ్రీవాల్

26 Feb, 2015 22:47 IST|Sakshi

రాజధానిలో శాంతి భద్రతలు, సీఎస్ నియామకంపై చర్చ
 న్యూఢిల్లీ: దేశ రాజధానిలో శాంతి భద్రతలకు సంబంధించిన అంశాల గురించి మాట్లాడటానికి కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌ని ముఖ్యమంత్రి అర్వింద్ కేజ్రీవాల్ గురువారం కలిశారు. ఈ సమావేశంలో కేజ్రీవాల్‌తో పాటు డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా కూడా పాల్గొన్నారు. రాజధానిలో శాంతి భద్రత పరిరక్షణ కోసం  గట్టిగా కృషి చేయాల్సిన అవసరం ఉందని హోం మంత్రికి చెప్పినట్లు తెలుస్తోంది. అలాగే ప్రస్తుత ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డీఎం స్పోలియా శనివారం ఉద్యోగ విరమణ చేయనుండటంతో నూతన సీఎస్ నియామకంపై కూడా చర్చించినట్లు సమాచారం. ఇదిలా ఉండగా, నూతన సీఎస్ నియామక రేసులో 1984 బ్యాచ్ ఐఏఎస్ కేడర్‌కి చెందిన ఆర్.ఎస్.త్యాగి ముందు వరుసలో ఉన్నట్లు తెలుస్తోంది. ఆయన ప్రస్తుతం అరుణాచల్‌ప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.
 

>
మరిన్ని వార్తలు