తప్పు చేస్తే తోలు తీస్తా

1 Feb, 2014 03:05 IST|Sakshi
తప్పు చేస్తే తోలు తీస్తా


 కరెంటు చార్జీలు పెంచుతామంటూ డిస్కమ్‌లు చేసిన ప్రకటనపై మండిపడ్డ ముఖ్యమంత్రి కేజ్రీవాల్.. డిస్కమ్‌లు తమ వ్యవహారశైలి మార్చుకోకుంటే లెసైన్సుల రద్దు సహా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.  కరెంటు కొనడానికి తన దగ్గర డబ్బు లేనందున ఫిబ్రవరి నుంచి రోజుకు 10 గంటల వరకు కోతలు విధిస్తామని తూర్పు ఢిల్లీకి కరెంటు అందజేసే బీఎస్‌ఈఎస్ యుమునా పవ ర్ లిమిటె డ్ ప్రభుత్వానికి లేఖ రాయడంతో సీఎం పైవిధంగా స్పందించారు.
 
 సాక్షి, న్యూఢిల్లీ: విద్యుత్ కోతలు విధిస్తామంటూ ప్రజలను బెదిరించడాన్ని కరెంటు పంపిణీ కంపెనీలు (డిస్కమ్‌లు) మానుకోవాలని, మున్ముందు కూడా ఇలాగే చేస్తే వాటి లెసైన్సులు రద్దు చేస్తామని ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ శుక్రవారం హెచ్చరించారు. ఢిల్లీలో తక్కువ టారిఫ్ వల్ల కరెంటు కొనడానికి తన దగ్గర డబ్బు లేదని డిస్కమ్ బీఎస్‌ఈఎస్ యుమునా పవ ర్ లిమిటె డ్ ప్రకటించింది. అందువల్ల ఫిబ్రవరి ఒకటి నుంచి రోజుకు 10 గంటల వరకు విద్యుత్ కోతలు విధిస్తామని ఈ డిస్కమ్ ఢిల్లీ ప్రభుత్వానికి లేఖ రాసిన నేపథ్యంలో ఆయన ఈ హెచ్చరికచేశారు. డిస్కమ్‌లు బ్లాక్ మెయిలింగ్‌కు పాల్పడుతున్నాయని కేజ్రీవాల్ ఆరోపించారు. ‘విద్యుత్ కోతలు ఉండవు. కోతలు విధిస్తారన్న బెదిరింపులు ఉత్తుత్తివే! ఇలాంటి బెదిరింపులతో డిస్కమ్‌లు ప్రజలను భయపెట్టేందుకు ప్రయత్నిస్తున్నాయి.
 
 ఇక మీదట కూడా ఇలాగే చేస్తే కఠిన చర్యలు తీసుకుంటాం’ అని కేజ్రీవాల్ హెచ్చరించారు. డిస్కమ్‌లు కాగ్ ఆడిట్‌కు సహకరించడం లేదని ముఖ్యమంత్రి ఆరోపించారు. అవి తమ ఖాతాలను ఆడిట్ సంస్థలకు చూపించడం లేదని, దీనిని బట్టి చూస్తుంటే డిస్కమ్‌ల ఖాతాల్లో అవకతవకలు ఉన్నట్టు అనుమానాలు కలుగుతున్నాయని చెప్పా రు. డిస్కమ్‌ల వ్యవహార శైలి ఇలాగే ఉంటే వాటి లెసైన్సులను రద్దు చేసి, ఇతర కంపెనీలను తీసుకువస్తామని కేజ్రీవాల్ హెచ్చరించారు. మనదేశంలో టాటా, అంబానీలేగాక మరెన్నో కంపెనీలు ఉన్నాయని స్పష్టం చేశారు.   
 
 మరింత ముదిరిన వివాదం
 తాజా వివాదంతో డిస్కమ్‌లకు, ఆప్ సర్కారుకు మధ్య కొనసాగుతున్న ఘర్షణ మరింత తీవ్రమయింది. డిస్కమ్‌లు వ్యయాన్ని కృత్రిమంగా పెంచి చూపుతూ అధిక చార్జీలను వసూలు చేస్తున్నాయని ఆప్ అంటోంది. చార్జీలు తక్కువగా ఉన్నాయని, ఇవి తమ ఖర్చులకు తగ్గట్టుగా లేవు కాబట్టి టారిఫ్ పెంచాలని డిస్కమ్‌లు కోరుతున్నాయి. విద్యుత్ ఉత్పత్తి కంపెనీలకు బకాయిలు చెల్లించడానికి తన దగ్గర నిధులు లేవని బీఎస్‌ఈఎస్ ఢిల్లీ  విద్యుత్‌శాఖ కార్యదర్శి పునీత్ గోయల్‌కు లేఖ రాసింది. బకాయిలు చెల్లించకపోవడంతో బ్యాంకులు కూడా రుణాలను ఇవ్వడానికి నిరాకరిస్తున్నాయని వివరణ ఇచ్చింది. ఈ క్లిష్టపరిస్థితి నుంచి గట్టెక్కడానికి తక్షణం ఆర్థిక సహాయాన్ని అందించాలని  ప్రభుత్వాన్ని కోరింది. కరెంటు ఉత్పత్తి కంపెనీలు ఎన్టీపీసీ, ఎన్‌హెచ్‌పీసీ, విద్యుత్ మంత్రిత్వశాఖ, ఆర్థిక మంత్రిత్వశాఖతో ఈ సమస్యపై చర్చలు జరపాలని కోరింది.
 
 ఎన్టీపీసీ, ఎన్‌హెచ్‌పీసీ వంటి ప్రభుత్వరంగ విద్యుత్ ఉత్పత్తి సంస్థలు తనకు అప్పుపై విద్యుత్ అమ్మకుండా, బకాయిలు చెల్లించడానికి కూడా గడువు ఇవ్వకుంటే 500 మెగావాట్ల కరెంటు తక్కువ అవుతుందన్నది ఈ డిస్కమ్ వాదన. అందుకే ఫిబ్రవరి ఒకటి నుంచి కోతలు విధించవలసి వస్తుందని లేఖలో వివరణ ఇచ్చింది. రిలయన్స్ ఇన్‌ఫ్రాకు చెందిన బీఎస్‌ఈఎస్ యమునా పవర్ లిమిటెడ్ తూర్పు, మధ్య ఢిల్లీలోని 14 లక్షల ఇళ్లకు విద్యుత్ సరఫరా చేస్తుంది. మయూర్‌విహార్ ఫేజ్ 1, ఫేజ్ 2, పత్పర్‌గంజ్, గాంధీనగర్, జంగ్‌పురా, కార్కర్‌డూమా, కృష్ణానగర్, వసుంధరా ఎన్‌క్లేవ్,  ప్రీత్ విహార్ ప్రాంతాలకు రోజుకు 850 మెగావాట్ల విద్యుత్ సరఫరా చేస్తుంది.
 
 కేజ్రీవాల్ విన్నపానికి ఎన్టీపీసీ నో
 ఇదిలా ఉండగా  బీఎస్‌ఈఎస్ యమునా పవర్ లిమిటెడ్‌కు విద్యుత్ సరఫరా నిలిపివేయరాదని ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ చేసిన సూచనను ఎన్టీపీసీ తిరస్కరించిందని అనధికార వర్గాలు తెలిపాయి. బకాయిలు చెల్లించడానికి డిస్కమ్‌కు మరికొంత గడువు ఇవ్వాలన్న విజ్ఞప్తిని ఆ కంపెనీ తోసిపుచ్చిందని అంటున్నారు.
 
 కరెంటు చార్జీలు పెరిగాయ్!  
 కరెంటు చార్జీలను పెంచబోమని ఆప్ ప్రభుత్వం ప్రకటించినా, ఢిల్లీ విద్యుత్ నియంత్రణ సంస్థ (డీఈఆర్సీ) మాత్రం టారిఫ్‌ను ఎనిమిది శాతం పెంచుతున్నట్టు ప్రకటించింది. కొత్త చార్జీలు శనివారం నుంచి అమల్లోకి వస్తాయి. అయితే డీఈఆర్సీ నిర్ణయంపై ప్రభుత్వం, ఆప్ మండిపడ్డాయి. ఒకవైపు డిస్కమ్ ఖాతాలపై ఆడిటింగ్ జరుగుతుండగానే చార్జీల పెంపు సరికాదని స్పష్టం చేశాయి.   ఇంధన వ్యయ సర్దుబాటు చార్జీలు పెరగడం వల్లే టారిఫ్‌ను పెంచాల్సి వచ్చిందని డీఈఆర్సీ చైర్మన్ పీడీ సుధాకర్ పేర్కొన్నారు. యమునాపవర్‌కు ఎనిమిది శాతం చొప్పున, రాజధాని పవర్‌కు ఆరుశాతం చొప్పున, టాటాపవర్‌కు ఏడుశాతం చొప్పున సర్దుబాటు చార్జీలు పెంచారు. డిస్కమ్‌లు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నందున ఈ నిర్ణయం తీసకున్నామన్నారు.

>
మరిన్ని వార్తలు