‘హెల్ప్‌లైన్’ ఎఫెక్ట్ చిక్కిన ఖాకీలు

11 Jan, 2014 23:20 IST|Sakshi
న్యూఢిల్లీ:  అవినీతి నిరోధక హెల్ప్‌లైన్‌ను ముఖ్యమంత్రి కేజ్రీవాల్ ప్రారంభించి మూడురోజులైనా కాలేదు.. అప్పుడే ఇద్దరు కానిస్టేబుళ్లు పట్టుబడ్డారు. ఓ వ్యాపారి నుంచి బలవంతపు వసూళ్లకు పాల్పడి న నేరానికి ఈ ఇద్దరూ కటకటాలపాలయ్యారు. వ్యాపారి నిర్వహించిన స్టింగ్ ఆపరేషన్ వీరి ఆట కట్టించింది. నిందితులను ఈశ్వర్‌సింగ్, సందీప్‌కుమార్‌గా గుర్తించారు. వివరాల్లోకెళ్తే... జనక్‌పురి పోలీస్‌స్టేషన్‌లో కానిస్టేబుళ్లుగా విధులు నిర్వర్తిస్తు న్న ఈశ్వర్, సందీప్ ‘హఫ్తా’(బలవంతపు వసూళ్లు) ఇవ్వాల్సిందిగా ఓ వ్యాపారిని బెదిరించారు. దీంతో సదరు వ్యాపారి స్టింగ్ ఆపరేషన్ నిర్వహించి, ఆ వివరాలను అవినీతి నిరోధక విభాగానికి అందజేశాడు. దీంతో రంగంలోకి దిగిన అధికారులు ఈశ్వర్, సందీప్‌లను అరెస్టు చేశారు. వ్యాపారి నుంచి రూ.3,000 తీసుకున్నట్లుగా తమ దర్యాప్తులో తేలిందని, గత వారం కూడా వీరిద్దరు ఇలాగే వసూళ్లకు పాల్పడినట్లు వెల్లడైందన్నారు. ఈ విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజేంద్రకుమార్ కూడా ధ్రువీకరించారు. 
 
 ఇద్దరు కానిస్టేబుళ్లపై కేసు నమోదు చేశామని, స్వెటర్ల వ్యాపారి నుంచి బలవంతపు వసూళ్లకు పాల్పడినట్లుగా వారిపై వచ్చిన ఆరోపణలు రుజువయ్యాయన్నారు.  ఇదిలాఉండగా పార్లమెంట్ స్ట్రీట్‌లోని ఓ కోపరేటివ్ హౌసింగ్ సొసైటీకి చెందిన అసిస్టెంట్ రిజిస్ట్రార్ కూడా లంచం ఇవ్వాల్సిందిగా డిమాండ్ చేసినట్లు హెల్ప్‌లైన్‌కు ఫిర్యాదు అందిందని, అయితే ప్రస్తుతం సదరు నిందితుడు పరారీలో ఉన్నట్లు ముఖ్యమంత్రి కేజ్రీవాల్ తెలిపారు. అతని ఆచూకీ తెలిసిన వెంటనే అరెస్టు చేస్తామన్నారు. సులభంగా ఉండే హెల్ప్‌లైన్ నంబర్ 1031ను శుక్రవారం ప్రకటించామని, శనివారం 11,952 ఫిర్యాదులు అందాయని చెప్పారు. అందిన ఫిర్యాదులపై సంబంధిత అధికారులు విచారణ ప్రారంభించారని, 20 కేసుల్లో ఆరోపణలు ఎదుర్కొంటున్న నిందితులను అరెస్టు చేసేందుకు రంగం సిద్ధం చేస్తున్నట్లు చెప్పారు. 
 
మరిన్ని వార్తలు