అమ్మో.. వైరస్‌ సోకుతుందేమో

26 Mar, 2020 10:39 IST|Sakshi

ఎయిర్‌పోర్టు పరిసర గ్రామాల ప్రజల్లో గుబులు  

కర్ణాటక, దొడ్డబళ్లాపురం: దేవనహళ్లి వద్ద ఉన్న కెంపేగౌడ ఎయిర్‌పోర్టు చుట్టుపక్కల 12 గ్రామాల ప్రజలకు కరోనా వైరస్‌ భయంతో కంటినిండా నిద్ర కరువైంది. వైరస్‌ వ్యాపిస్తుందనే భయంతో క్షణక్షణం ఆందోళనలో గడుపుతున్నారు. విమానాశ్రయం చుట్టూ ఫైవ్‌స్టార్‌ హోటళ్లు, రిసార్టులు, రెస్టారెంట్లు ఉన్నాయి. వీటిలో పనిచేసేవారు అందరూ పక్క రాష్ట్రాలకు చెందినవారే. వీరంతా ఈ 12 గ్రామాల్లో ఇళ్లు,గదులు అద్దెకు తీసుకుని నివసిస్తున్నారు. నిత్యం ఎయిర్‌పోర్టు వద్ద హోటళ్లు, రెస్టారెంట్లలో పనిచేసి వస్తుంటారు. ఎయిర్‌పోర్టులో వివిధ విభాగాల్లో పనిచేసేవారు కూడా ఇక్కడే నివసిస్తున్నారు. సుమారు 10వేల మంది దాకా ఇతర ప్రాంతాలవారు ఉన్నారని అంచనా.

పార్శిళ్ల బెడద  
కెంపేగౌడ ఎయిర్‌పోర్టుకు వచ్చే కార్గో విమా నాల్లో విదేశాల నుండి పార్శిళ్లు వస్తుంటాయి. ఆ పార్శిళ్లను తీసుకువచ్చి పంపిణీ చేసే డెలివరీ బాయ్స్‌ కూడా ఈ 12 గ్రామాల్లోనే నివసిస్తుంటారు.
సదరు డెలివరి కంపెనీలు డెలివరి బాయ్స్‌కు మాస్కు, శానిటైజర్‌ లాంటివి ఇవ్వకపోవడంతో వైరస్‌ భీతి వెంటాడుతోంది. విదేశాల నుండి వచ్చే పార్శిళ్ల ద్వారా కరోనా వైరస్‌ వ్యాపించే ప్రమాదం ఉందని స్థానిక ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎయిర్‌పోర్టు సమీపంలో ఉన్న యర్తిగానహళ్లి, అక్లేనహళ్లి, మల్లేనహళ్లి, కాడయరప్పనహళ్లి, భట్రమారనహళ్లి, సింగనాయకనహళ్లి, బండకొడిగేనహళ్లి తదితర గ్రామాల్లోకి వస్తున్న విదేశీయులను, ఇతర రాష్ట్రాల నుండి వచ్చిన వారిని గుర్తించి పరీక్షలు జరపాలని గ్రామాల ప్రజలు డిమాండు చేస్తున్నారు. 

మరిన్ని వార్తలు