కనిమొళి వ్యాఖ్యలపై చర్యలు చేపట్టాలి

12 Jan, 2018 12:14 IST|Sakshi

సాక్షి, చెన్నై: రూ.కోట్లు ఇచ్చే వారికే బాలాజీ దేవుడంటూ.. పేదవాడిని కాపాడలేని దేవుడు ఎందుకంటూ.. డీఎంకే ఎంపీ కనిమొళి వివాదస్పద వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. వెంకన్నపై ఎంపీ చేసిన వ్యాఖ్యలపై తమిళనాడు తెలుగు యువశక్తి అధ్యక్షుడు కేతిరెడ్డి జగదీశ్వరరెడ్డి మండిపడ్డారు. ఆమెపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. ఈ విధమైన వ్యాఖ్యలు చేసి వివాదం సృష్టించడం ఇది ఒక కొత్త రాజకీయ ఎత్తుగడలో భాగమని కేతిరెడ్డి అన్నారు. ప్రజలను ఆశాంతికి గురిచేయటం తమిళ రాజకీయ నాయకుల లక్ష్యమని ఆయన విమర్శించారు. కేవలం రాజకీయ ప్రయోజనాల కోసం కలియుగ దైవం శ్రీవెంకటేశ్వర స్వామిపై తప్పుడు వ్యాఖ్యలు చేశారన్నారు. హిందువుల మనోభాబాలను కనిమొళి దెబ్బతీశారని కేతిరెడ్డి మండిపడ్డారు.

సంచలనం వ్యాఖ్యలు చేసి వార్తలో ఉండాలనుకోవడం సిగ్గు చేటు.. మీరు ఇదే వ్యాఖ్యలను ఇతర మతస్తులపై చేసే దమ్ము ఉందా అని కేతిరెడ్డి ప్రశ్నించారు. మీరు చేసిన వ్యాఖ్యలకు తగిన మూల్యం త్వరలో చెల్లించటం ఖాయమని ఆయన అన్నారు. ఆమె చేసిన నాస్తిత్వం ప్రసంగంలో వెంకన్నను ఉదాహరణగా చేప్పిన విషయం తెలిసిందే. హిందూ సమాజంను అవమాపరిచిన రాజ్యసభ సభ్యురాలు కనిమొళిపై కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకుని చర్యలు తీసుకోవాలని కేతిరెడ్డి డిమాండ్‌ చేశారు.

తిరుపతి: తమిళనాడుకు చెందిన డీఎంకే ఎంపీ కనిమొళి హిందూ మతాన్ని కించపరిచేలా మాట్లాడారని, ఆమెపై తక్షణమే కేసు నమోదు చేయాలని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి భానుప్రకాష్‌రెడ్డి డిమాండ్‌ చేశారు. కనిమొళిపై గురువారం ఆయన తిరుపతి అర్బన్‌ ఎస్పీ అభిషేక్‌ మొహంతికి ఫిర్యాదు చేశారు. అనంతరం భానుప్రకాశ్‌రెడ్డి మాట్లాడుతూ.. రూ.కోట్లు ఇచ్చే వారికే బాలాజీ దేవుడంటూ కనిమొళి వ్యాఖ్యానించడం దారుణమన్నారు. పేదవాడిని కాపాడలేని దేవుడు ఎందుకంటూ.. భక్తుల మనోభావాలను ఆమె దెబ్బతీశారని మండిపడ్డారు.
 

మరిన్ని వార్తలు