కిలాడి ‘లేడీ’ కోసం పట్టు

16 Jun, 2016 08:37 IST|Sakshi
కిలాడి ‘లేడీ’ కోసం పట్టు

కేకే.నగర్:  ఏడుగురిని మోసం చేసిన కిలాడి పెళ్లి కూతురు పవిత్రతో పెళ్లి జరిపించాలని ఎనిమిదో పెళ్లి కొడుకు కనకరాజ్ పట్టుపట్టడంతో పోలీసులు అవాక్కయ్యారు. 43 ఏళ్ల కనకరాజ్‌కు పవిత్ర అలియాస్ మాలతితో ఉడుమలై పేటలో నిశ్చితార్థం కూడా జరిగింది. ఆ సమయంలో పవిత్రకు ఖరీదైన పట్టుచీర, 20 సవర్ల నగలను పెళ్లి కానుకగా ఇచ్చినట్లు తెలుస్తోంది. పవిత్రను పోలీసులు పట్టుకుని వివరాలు బట్టబయలు చేసినా కనకరాజ్ మాత్రం ఫర్వాలేదు సార్!

నాకు ఆమెతో పెళ్లి అయితే చాలు అని కూల్‌గా చెప్పాడు. ఆమెను తనతో పంపమని పోలీసులను బతిమాలాడు. దీంతో పోలీసులు అతన్ని హెచ్చరించారు. ఏడుగురిని పెళ్లి చేసుకుని నగలు, నగదుతో పారిపోయిన కిలాడి పెళ్లి కూతురు పవిత్ర ఎనిమిదవ పెళ్లికి సిద్ధం అవుతూ మొదటి భర్త కర్నన్ (38)తో పోలీసులకు పట్టుబడిన విషయం తెలిసిందే. ఈ వివాహాలకు సహకరించిన బ్రోకర్లను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

తిరుపూర్ జిల్లా తారాపురం సమీపంలోని కోణప్పన్ సాలై గ్రామానికి చెందిన సెల్వకుమార్ తన భార్య పవిత్ర (32) గత నెల 27 నుంచి  కనిపించడం లేదని పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో సోమవారం సాయంత్రం పవిత్రను ఉడుమలైలో పోలీసులు పట్టుకున్నారు. విచారణలో బ్రోకర్ల సాయంతో ఆమె ఏడుగురిని వివాహం చేసుకుని వారితో కొన్ని రోజులు గడిపి నగలు, నగదు దోచుకుని పారిపోయేదని తెలిసింది.

బ్రోకర్లు పెళ్లి కొడుకుల వద్ద పవిత్రకు తల్లిదండ్రులు లేదని ఆమెను పెంచుకున్న వారికి రూ.3 లక్షలు ఇవ్వాలని చెప్పేవారు. ఎలాగైనా పెళ్లి జరిగితే చాలని భావించే యువకులు పవిత్రకు నగలు, నగదు ముట్టచెప్పేవారు. ఈమె మోసానికి మొదటి భర్త సహకరించేవాడని తెలిసింది. సేకరించిన మొత్తంలో బ్రోకర్లకు కొంత ఇచ్చేదని..దీనికి ఆశపడిన బ్రోకర్లు పెళ్లికొడుకుల కోసం గాలించేవారని తెలుస్తోంది.

కొంతమంది బ్రోకర్లు పెళ్లి కొడుకుల జాతకాలకు తగినట్లు పవిత్ర జాతకాన్ని తయారు చేసి మోసానికి పాల్పడినట్లు తెలిసింది. అయితే మోసపోయిన వారు ఎవరూ ఆమెపై ఫిర్యాదులు చేయడానికి ముందుకు రాలేదు. దీంతో పోలీసులు ఏడో భర్త సెల్వకుమార్ వద్ద చోరీ చేసిన నగలు, నగదును అతనికి ఇప్పించి పవిత్రను హెచ్చరించి వదిలేశారు.

మరిన్ని వార్తలు