బీజేపీలో చేరను

26 Nov, 2014 09:07 IST|Sakshi
బీజేపీలో చేరను

సాక్షి, చెన్నై : బీజేపీలో చేరుతున్నట్లుగా సాగుతున్న ప్రచారానికి నటి కుష్బు ముగింపు పలికారు. ఎట్టి పరిస్థితుల్లోనూ తాను బీజేపీలో చేరబోనని స్పష్టం చేశారు. చక్కటి వాక్చాతుర్యం, అనర్గళంగా సమస్యలపై ప్రస్తావన, తనదైన సినీ గ్లామర్‌తో ప్రజల్ని ఆకర్షించే ప్రసంగం చేయడంలో దిట్ట కుష్బు. రాజకీయ పయనానికి డీఎంకే ద్వారా శ్రీకారం చుట్టారు. డీఎంకేలో ఎంత వేగంగా ఆమె ఎదిగారో, అంతే వేగ ంతో బయటకు రావాల్సిన పరిస్థితి ఏర్పడింది. డీఎంకేలోని రాజకీయాలు కుష్బులో తీవ్ర ఆవేదనను మిగిల్చాయి. అధినేత కరుణానిధికి లేఖాస్త్రం సంధించి డీఎంకే నుంచి బయటకు వచ్చిన ఆమెను తమ వైపు తిప్పుకునేందుకు పలు పార్టీలు తీవ్రంగానే ప్రయత్నించాయి. అయితే, రాజకీయ ప్రస్తావనలకు కుష్బు దూరంగా ఉంటున్నారు. ఈ పరిస్థితుల్లో బీజేపీ సర్కారు నటి స్మృతి ఇరానీకి పెద్ద పీట వేస్తూ కేంద్ర మంత్రి పదవి ఇవ్వడం కుష్బుకు ఆనందాన్ని కల్గించింది.
 
 స్మృతి ఇరానీకి ప్రశంసలు, అభినందలు తెలపడంతోపాటుగా ఆమె చేసిన కొన్ని వ్యాఖ్యలను కుష్బు సమర్థించిన సందర్భాలు ఉన్నాయి. ఇది కాస్త కుష్బుకు వ్యతిరేక ప్రచారానికి దారి తీసింది. కుష్బు బీజేపీలో చేరబోతున్నట్టు, చేరినట్టు రాష్ట్రంలో తెగ ప్రచారం బయలు దేరింది. సోషల్ మీడియాల్లో ఈ ప్రచారం మరింత హల్‌చల్ చేసింది.  స్మృతి ఇరానీ ద్వారానే బీజేపీలో చేరేందుకు మార్గం సుగమం చేసుకున్నట్టుగా ఓ వైపు, రాష్ట్రంలోని బీజేపీకి ప్రత్యేక గ్లామర్‌గా కుష్బును ఎంపిక చేసి ఉన్నట్టుగా మరో వైపు ప్రచారం సాగుతోంది.నో చాన్స్: ఈ ప్రచారాలు కుష్బు చెంతకు చేరాయి. దీంతో చాలా కాలం అనంతరం రాజకీయ ప్రస్తావనతో ఆమె ట్విట్టర్‌లో వ్యాఖ్యలు చేశారు. బీజేపీనా...నో చాన్స్ అంటూ ట్వీట్ చేశారు. తాను బీజేపీలో చేరినట్టుగా, చేరుతున్నట్టుగా వస్తున్న సంకేతాలన్నీ అవాస్తవ మని స్పష్టం చేశారు. తాను బీజేపీలో చేరలేదని, చేరే ప్రసక్తే లేదని తేల్చారు.

మరిన్ని వార్తలు