బుజ్జగింపులు

19 Jun, 2014 00:50 IST|Sakshi
బుజ్జగింపులు

సాక్షి, చెన్నై : నటి ఖుష్బును బుజ్జగించేందుకు డీఎంకే ద్వితీయ శ్రేణి నేతలు రంగంలోకి దిగినట్టు సంకేతాలు వెలువడుతున్నాయి. తనకు తీవ్ర అవమానం జరిగిందని, నిర్ణయాన్ని పునఃసమీక్షించబోయేది లేదంటూ ఖుష్బు కుండ బద్ధలుకొట్టినట్లు సమాచారం.ఖుష్బు డీఎంకేకు గుడ్‌బై చెప్పిన విషయం తెలిసిం దే. కమలం గూటికి చేరడానికి ఆమె సన్నద్ధ అవుతున్నట్టు సంకేతాలు వెలువుడుతున్నాయి. ఈ సమయంలో డీఎంకే ద్వితీయ శ్రేణి నాయకులు కొందరు బుజ్జగించినట్లు వెలుగులోకి వచ్చింది. పార్టీలో ప్రత్యేకంగా మహిళా సినీ గ్లామర్ అంటూ ఎవ్వరూ లేని దృష్ట్యా, ఆ గ్లామర్‌ను కోల్పోవాల్సి వచ్చిందన్న డైలమాలో డీఎంకే అధిష్టానం పడ్డట్టు సమాచారం. అధినేత ఎం కరుణానిధి సూచన మేరకు ద్వితీయ శ్రేణి నాయకులు కొందరు ఖుష్బును బుజ్జగించే పనిలో పడ్డారు. ఖుష్బు సన్నిహితంగా ఉన్న వారి ద్వారా కూడా సంప్రదింపులు జరిపినట్టు సమాచారం.
 
 ఆవేదన : బుజ్జగింపుల బాట పట్టిన నాయకులు, సన్నిహితుల వద్ద ఖుష్బు తీవ్ర ఆవేదన వ్యక్తం చేసి ఉన్నారు. దివంగత పెరియార్ సిద్ధాంతాలతో, దివంగత అన్నా ఆదర్శంతో ప్రజా సంక్షేమం కోసం శ్రమిస్తున్న కరుణానిధి మార్గదర్శకంలో పనిచేయాలన్న కాంక్షతో డీఎంకేలో చేరినట్టుగా వారికి వివరిస్తున్నారు. పార్టీ కోసం శ్రమిస్తున్న సమయంలో తనలాంటి వారికి డీఎంకేలో చోటు లేదన్న విషయాన్ని గ్రహించినట్టు వాపోతున్నారు. పార్టీ కి మంచి జరగాలన్న ఉద్దేశంతో కొన్ని వ్యాఖ్యలు చేస్తే, ఇంటిపై రాళ్లు వేయించారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నా రు. తన పిల్లలు ఆ క్షణంలో పడ్డ మనోవేదన కళ్ల ముం దు ఇంకా మెదులుతున్నట్టుగా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మైనారిటీ సామాజిక వర్గం నుంచి వచ్చిన తనకు లోక్‌సభ ఎన్నికల్లో దక్షిణ చెన్నై లేదా కోయంబత్తూరు సీటు ఇవ్వాలని కోరిగా, అందుకు పార్టీలోని కొందరు పెద్దలు అవహేళన చేసినట్టుగా ఆరోపిస్తున్నారు.
 
 అధినేత తర్వాత ఆయన స్థానంలో కూర్చోవాలనుకుంటున్న వారు తనను పార్టీలో ఎదగనీయకుండా అడ్డుకున్నారంటూ పరోక్షంగా స్టాలిన్‌పై ఆగ్రహం వ్యక్తం చేస్తుండడం గమనార్హం. తనను తీవ్రంగా అవమానించారని, కనీస గౌరవం కూడా ఇవ్వకుండా కించ పరచడంతో చివరకు అధినేత కరుణానిధికి తన రాజీనామా పంపాల్సి వచ్చిందని ఆమె వాపోతున్నారట. అదే సమయంలో తన నిర్ణయంలో ఎలాంటి మార్పులు ఉండవని, పునః సమీక్షించే ప్రసక్తే లేదంటూ ఖుష్బు కరాఖండిగా తేల్చుతుండడం గమనార్హం. ఇక, ఖుష్బు రాజీనామా గురించి డీఎంకే మాజీ ఎంపీ, సీనియర్ నాయకులు టీకేఎస్ ఇళంగోవన్‌ను కదిలించగా, తాను పడుతున్న ఇబ్బందులు, ఎదుర్కొంటున్న సమస్యలను ముందుగా అధిష్టానం దృష్టికి ఆమె తెచ్చి ఉండాల్సిన అవసరం ఉందని పేర్కొనడం కొసమెరుపు.
 

మరిన్ని వార్తలు