చింతూరులో నలుగురు గిరిజనుల కిడ్నాప్!

17 Aug, 2016 19:53 IST|Sakshi

చింతూరు మండలం పేగ గ్రామానికి చెందిన నలుగురు గిరిజనులను మావోయిస్టులు మంగళవారం రాత్రి కిడ్నాప్ చేసినట్టు స్థానికులు చెబుతున్నారు. అయితే.. వారిని కిడ్నాప్ చేయలేదని, మావోయిస్టులు రమ్మని కబురు పెడితే వారంతట వారే వెళ్లారని పోలీసులు అంటున్నారు.

 

వివరాలు ఇలా ఉన్నాయి... మంగళవారం రాత్రి గ్రామంలోకి వచ్చిన సాయుధ మావోయిస్టులు కంగాల ముత్తయ్య, కంగాల నాగేశ్వరరావు, కణితి రామయ్య, సోడె ముద్దయ్యలతో మాట్లాడే పనుందని, తమ వెంట రావాల్సిందిగా కోరారు. వారి కుటుంబ సభ్యులు అడ్డుచెప్పారు. దీంతో మావోయిస్టులు బెదిరించి సమీపంలోని ఛత్తీస్‌గఢ్ అడవుల్లోకి తీసుకు వెళ్లారు. ఇటీవల చింతూరు మండలంలో జరిగిన పాస్టర్ కన్నయ్య హత్య సమయంలో మావోయిస్టులు వదిలిన లేఖలో ఇన్‌ఫార్మర్లుగా ఆరోపించిన వారిలో వీరి పేర్లు కూడా ఉన్నాయి. దీంతో తమ వారిని మావోయిస్టులు ఏమి చేస్తారోనని కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు.

 

మరో వైపు పేగకు చెందిన గిరిజనులను మావోయిస్టులు కిడ్నాప్ చేయలేదని, రమ్మని కబురు పెడితే వారే స్వచ్ఛందంగా వెళ్లారని చింతూరు ఓఎస్‌డీ డాక్టర్ ఫకీరప్ప చెప్పారు.

మరిన్ని వార్తలు