కిస్..నో!

22 Nov, 2014 08:50 IST|Sakshi
కిస్..నో!

అనుమతి నిరాకరించిన పోలీసు అధికారులు!
 
బెంగళూరు : మోరల్ పోలీసింగ్‌కి వ్యతిరేకంగా నగరంలో నిర్వహించ తలపెట్టిన ‘కిస్ ఆఫ్ లవ్’ కార్యక్రమానికి ఇక బ్రేక్ పడినట్లే. ఈ కార్యక్రమానికి ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతి ఇచ్చేది లేదని కార్యక్రమ నిర్వాహకుల్లో ఒకరైన రచితా తనేజాకు పోలీసులు తేల్చి చెప్పినట్లు సమాచారం. మోరల్ పోలీసింగ్‌కి వ్యతిరేకంగా కేరళలో ప్రారంభమైన ‘కిస్ ఆఫ్ లవ్’ కార్యక్రమం దేశంలోని వివిధ మెట్రో నగరాల్లో కూడా కొన్ని ప్రజా హక్కుల సంఘాలు నిర్వహించాయి.

 

ఇక ఇందులో భాగంగానే ఉద్యాన నగరిలో సైతం ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలని నగరానికి చెందిన ప్రజాహక్కుల కార్యకర్త రచితా తనేజా నిర్ణయించారు. ఇతర నగరాల్లో ఈ కార్యక్రమం సందర్భంలో పోలీసులతో పాటు అనేక సంఘాలు ఈ కార్యక్రమాన్ని అడ్డుకునేందుకు ప్రయత్నించడంతో ఉద్రిక్త పరిస్థితులు చోటుచేసుకున్నాయి. అలాంటి పరిస్థితులు నగరంలో ఏర్పడరాదనే ఆలోచనతో ‘కిస్ ఆఫ్ లవ్’ కార్యక్రమ నిర్వహణకు అనుమతి ఇవ్వాల్సిందిగా రచితా తనేజా పోలీసు శాఖను కోరారు. ఈ కార్యక్రమ నిర్వహణపై శ్రీరామసేన, ఆర్‌ఎస్‌ఎస్ తదితర సంఘాలతో పాటు రాజకీయ నేతలు, ఇతర వర్గాల నుంచి సైతం తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతూ వస్తోంది. ఈ తరహా కార్యక్రమాలు భారతీయ సంస్కృతికి పూర్తిగా వ్యతిరేకమని, ఇలాంటి కార్యక్రమాల నిర్వహణకు ఎంతమాత్రం అనుమతి ఇవ్వరాదని సైతం పోలీసులకు ఫిర్యాదు అందాయి.

నగరంలో కనుక ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తే తప్పక అడ్డుకుంటామని శ్రీరామసేన హెచ్చరించింది. ఈ నేపథ్యంలో నగరంలో ‘కిస్ ఆఫ్ లవ్’ కార్యక్రమానికి కనుక అనుమతి ఇస్తే నగరంలో శాంతి-భద్రతల సమస్య తలెత్తే అవకాశం ఉందని రాష్ట్ర ప్రభుత్వం సైతం భావించడంతో ఈ కార్యక్రమానికి అనుమతి ఇవ్వరాదని రాష్ట్ర హోం శాఖ నుంచి పోలీసు ఉన్నత అధికారులకు ఆదేశాలు అందినట్లు సమాచారం. దీంతో ‘కిస్ ఆఫ్ లవ్’ కార్యక్రమానికి ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతి ఇవ్వబోమని పోలీసులు ప్రజా హక్కుల కార్యకర్త రచితా తనేజాకు తేల్చిచెప్పినట్లు తెలుస్తోంది.

మరిన్ని వార్తలు