కరోనా : భయపెడుతున్న కోయంబేడు

15 May, 2020 08:43 IST|Sakshi

చెన్నైలోని కోయంబేడు కూరగాయల మార్కెట్‌ కరోనా వైరస్‌కు నిలయమైంది. ఏపీలోని తమిళనాడు సరిహద్దు జిల్లాలైన శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు, చిత్తూరు జిల్లాలకు వైరస్‌ సెగ తాకింది. ఏపీ నుంచి చెన్నై కోయంబేడు మార్కెట్‌కు సరుకు దిగుమతుల కోసం రాకపోకలు సాగించిన ఆ రాష్ట్రానికి  చెందిన కమీషన్‌ ఏజెంట్లు, హోల్‌సేల్‌ వ్యాపారులు, డ్రైవర్లు, క్లీనర్లకు వైరస్‌ వ్యాప్తించింది. ఏపీ సరిహద్దు జిల్లాల్లో పాజిటివ్‌ కేసుల సంఖ్య పెరిగిపోతోంది.  

సాక్షి, చెన్నై : తమిళనాడు రాష్ట్రానికే తలమానికంగా అతిపెద్ద కోయంబేడు కూరగాయాల మార్కెట్‌కు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల నుంచి లారీల్లో రోజూ టమాట, ఎర్రగడ్డలు, పచ్చిమిరపకాయలు, బెండకాయ, వంకాయలు తదితర కూరగాయలు, సపోటాలు, మామిడి, గజనిమ్మ తదితర పళ్లు.. పాలు కూడా వస్తుంటాయి. ప్రధానంగా చిత్తూరు, నెల్లూరు జిల్లాల నుంచి హోల్‌సేల్‌ వ్యాపారులు, కమీషన్‌ ఏజెంట్లు ఈ సరుకును కొనుగోలు చేసి తమిళనాడులోని వేలూరు, తిరువళ్లూరు జిల్లాల మీదుగా లారీల్లో తీసుకుని వచ్చి కోయంబేడు మార్కెట్‌కు చేరుస్తారు. కమీషన్‌ పొందుతుంటారు. చెన్నై కోయంబేడు కూరగాయల మార్కెట్‌కు సాధారణ రోజుల్లో 300లకు పైగా లారీల లోడ్లు వస్తుంటాయి. ప్రస్తుతం లాక్‌డౌన్‌ కారణంగా రోజుకు సుమారు 200 లారీలు మాత్రమే వస్తున్నాయి. ఇలా రోజుకు సుమారు 500 మంది కమిషన్‌ ఏజెంట్లు, వ్యాపారులు, లారీ డ్రైవర్లు, క్లీనర్ల రాకపోకలు సాగుతుంటాయి.     

అంచలంచెలుగా..
తమిళనాడులో కరోనా వైరస్‌ తీవ్ర ప్రభావం చూపుతున్న చెన్నై సహా ఐదు జిల్లాల్లో ఏప్రిల్‌ 26 నుంచి 29 వ తేదీ వరకు పూర్తి స్థాయిలో కఠినమైన లాక్‌డౌన్‌ను అమలుచేయనున్నట్లు అదే నెల 24వ తేదీన ప్రభుత్వం ప్రకటించింది. 25వ తేదీన కోయంబేడు మార్కెట్‌లో కూరగాయలు, పండ్లు, పూలు కొనుగోలుకు లక్ష మంది జనం పోటెత్తారు. వ్యక్తిగత కొనుగోలుదారుపై నిషేధం ఉన్నా ఎవ్వరూ లెక్కచేయలేదు. మార్కెట్‌లోని కొత్తిమీర వ్యాపారి, సెలూన్‌ యజమాని, పూల మార్కెట్‌లో ఏడుగురికి, ఒక కూలీకి వైరస్‌ నిర్ధారణయ్యింది. కొత్తిమీర వ్యాపారి ద్వారా చెన్నైలోని మరో 13మందికి వైరస్‌ సోకినట్లు తేలింది. సెలూన్‌లో క్షవరం చేయించుకున్న 300 మందిని గుర్తించడం అధికారులకు సవాలుగా మారింది.

కొన్ని రోజులుగా మార్కెట్‌కు రాకపోకలు సాగించిన హోల్‌సేల్, రిటైల్‌ వ్యాపారులు, కమిషన్‌ ఏజెంట్లు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి పరీక్షలు చేయించుకోవాలని తమిళనాడు ఆరోగ్యశాఖ ప్రకటించింది. ఇదిలా ఉండగా నాలుగు రోజుల పూర్తిస్థాయి లాక్‌డౌన్‌ 29వ తేదీతో ముగియగా, మరుసటి రోజైన 30వ తేదీన లాక్‌డౌన్‌ను తీవ్రంగా సడలించి ఈ ఒక్కరోజు ఉదయం 6 నుంచి సాయంత్రం 5 గంటల వరకు అత్యవసర వస్తువుల దుకాణాలు తెరుచుకోవచ్చని తమిళనాడు ప్రభుత్వం ప్రకటించింది. మే 1 నుంచి మళ్లీ లాక్‌డౌన్‌ యథాతధంగా అమల్లోకి వస్తుంది, దుకాణాలు ఉదయం 6 నుంచి మధ్యా హ్నం 1 గంట వరకే తెరిచి ఉంటాయని ప్రభుత్వం స్పష్టం చేసింది. చెన్నై కోయంబేడు కూరగాయాల మార్కెట్‌కు మరోసారి హోల్‌సేల్, రిటైల్‌ వ్యాపారులు, నగర ప్రజలు పెద్ద సంఖ్యలో పరుగులెత్తారు.

భౌతికదూరం పాటించాలనే నిబంధనకు పూర్తిగా నీళ్లొదిలేశారు. కోయంబేడు మార్కెట్‌ సాయంత్రం వరకు సుమారు 50 వేల మందితో కిటకిటలాడిపోయింది. కరోనా వైరస్‌ కరాళ నృత్యానికి కారణమైంది. జనాన్ని కట్టడిచేయలేక కోయంబేడు మార్కెట్‌ను ఈనెల 5వ తేదీ నుంచి తాత్కాలికంగా మూసివేశారు. కోయంబేడు కారణంగా వైరస్‌ దాడి పెరగడంతో అధ్యయనం చేయాల్సిందిగా ఈనెల 4వ తేదీన కేంద్రం ప్రత్యేక వైద్య బృందాన్ని చెన్నైకి పంపింది.  

Read latest State News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా