విజయోత్సవం!

25 May, 2014 23:54 IST|Sakshi

 అన్నాడీఎంకే ఎంపీ అభ్యర్థులు విజయోత్సవాల్లో మునిగారు. ఆదివారం ఇంటింటా తిరుగుతూ ఓటర్లకు కృతజ్ఞతలు తెలియజేసే పనిలో పడ్డారు. తమ అధినేత్రి సీఎం జయలలిత ఆదేశాల మేరకు ప్రజల్లో ఉంటూ, అన్ని సమస్యల్ని పరిష్కరిస్తామని భరోసా ఇస్తున్నారు. సాక్షి,

చెన్నై : లోక్ సభ ఎన్నికల్లో అన్నాడీఎంకేకు రాష్ట్ర ప్రజలు అఖండ మెజారిటీని ఇచ్చిన విషయం తెలిసిందే. రాష్ట్రంలోని 39 స్థానాల్లో 37 చోట్ల విజయ కేతనం ఎగుర వేసిన అభ్యర్థులు తమ ఆనందాన్ని అధినేత్రితో కలసి గత వారం పంచుకున్నారు. అధినేత్రి జయలలితతో సమావేశమైన కొత్త ఎంపీలు ఆమె సూచన మేరకు ప్రజల్లోకి వెళ్లే పనిలోపడ్డారు. విజయోత్సవం పేరిట ప్రజల వద్దకు వెళ్లి కృతజ్ఞతలు తెలియజేసే పనిలో నిమగ్నం అయ్యారు. ఆదివారం ఉదయం నుంచి ఆయా నియోజకవర్గాల్లోని ఎంపీలు స్థానికంగా ఉండే నాయకులు, ఎమ్మెల్యేలు, ఆయా జిల్లాల ఇన్‌చార్జ్ మంత్రులతో కలసి ఇంటింటా వెళ్లి కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు.
 
 ఎంపీలు, మంత్రులూ... : తిరువళ్లూరు నియోజకవర్గం పరిధిలో ఆ పార్టీ ఎంపీ డాక్టర్ వేణుగోపాల్, ఉత్తర చెన్నైలో టీజీ వెంకటేష్ బాబు, దక్షిణ చెన్నైలో మంత్రి వలర్మతితో కలసి డాక్టర్ జే జయ వర్దన్, సెంట్రల్ చెన్నైలో మంత్రి గోకుల ఇందిరతో కలసి ఎస్‌ఆర్ విజయకుమార్, శ్రీ పెరంబదూరు పరిధిలో మంత్రి చిన్నయ్యతో కలసి కేఎన్‌రామచంద్రన్, కాంచీపురంలో మరగదం కుమర వేల్, అరక్కోణం పరిధిలో తిరుత్తణి కే హరి, వేలూరులో సెంగుట్టవన్, కృష్ణగిరిలో  కే అశోక్‌కుమార్, తిరువణ్ణామలైలో ఆర్ వనరోజా, సేలంలో వి పన్నీరు సెల్వం, నామక్కల్‌లో పీఆర్ సుందరం, ఈరోడ్‌లో ఎస్ సెల్వకుమార చిన్నయ్యన్, తిరుప్పూర్‌లో వి సత్యభామా, పొల్లాచ్చిలో సీ మహేంద్రన్, దిండుగల్‌లో ఎం ఉదయకుమార్, కరూర్‌లో తంబిదురై, చిదంబరంలో చంద్రకాశి, శివగంగైలో పీఆర్ సెంథిల్ నాధన్, మదురైలో ఆర్ గోపాలకృష్ణన్, తేనిలో ఆర్ పార్తీబన్, తెన్‌కాశిలో వసంతి మురుగేషన్,
 
 తిరునల్వేలి - కేఆర్‌పీ ప్రభాకరన్ తదితర ఎంపీలు ఇంటింటా వెళ్లి ఓటర్లకు కృతజ్ఞతలు తెలియజేశారు. అన్ని సమస్యలను పరిష్కరిస్తామని భరోసా ఇస్తున్నారు. తొలి రోజు కొన్ని చోట్ల మాత్రమే విజయోత్సవాలు జరుపుకున్నారు. కొన్ని చోట్ల కొత్త ఎంపీలు పాదయాత్ర రూపంలో ఇంటింటా వె ళితే, మరి కొన్ని చోట్ల ఓపెన్ టాప్ వాహనం ఎక్కి, ఆయా గ్రామాల్లోని వీధుల్లో చక్కర్లు కొడుతూ తమకు ఓట్లు వేసినందుకు గాను దండాలు పెట్టే పనిలో పడ్డారు. అనేక చోట్ల ఆయా పార్టీల స్థానిక నాయకులు కొత్త ఎంపీలకు ఘన స్వాగతం పలకడం విశేషం. కొన్నిచోట్ల ఇక ఇటు వైపు వచ్చేదేమైనా ఉందా..? లేదా , ఇదే ఆఖరి చూపా అన్నట్టుగా ఓటర్లు ఛలోక్తులు విసరడం గమనార్హం.

మరిన్ని వార్తలు