వీడియో వివాదంలో ‘కుమారుడు’!

22 Jan, 2014 23:44 IST|Sakshi
ఆమ్ ఆద్మీ పార్టీ కార్యదర్శి కుమార్ విశ్వాస్‌ను కూడా వివాదాలు చుట్టుముడుతున్నాయి. నిజానికి ఆప్‌లోకి అడుగుపెట్టాక ఆయన చేసిన వివాదాస్పదమైన చర్యలేవీ లేకపోయినా ఎప్పుడో.. ఓ కవి సమ్మేళనంలో సరదాగా చేసిన ఓ వ్యాఖ్య తాలూకు వీడియో ఆయననిప్పుడు ఇబ్బందులోకి నెట్టింది. మళయాళీ  నర్సులకు సంబంధించి 2008లో రాంచీలో జరిగిన ఓ కవి సమ్మేళనంలో కుమార్ విశ్వాస్ చేసిన ప్రసంగం తమను అవమాన పరిచేలా ఉందంటూ కేరళలో పెద్దపెట్టున ఆందోళనలు జరిగాయి. స్వయంగా ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఊమెన్ చాందీ కల్పించుకొని, ఆప్ నేతలు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. దీనిపై స్పందించిన కుమార్ విశ్వాస్ ఆ రాష్ట్ర ప్రజలకు బహిరంగంగా క్షమాపణ చెప్పారు.
 
ఎవరినీ బాధపెట్టే ఉద్దేశం తనకు లేదని, ఓ పాత వీడియోలో తాను చేసిన ప్రసంగం కేరళవాసుల మనోభావాలను దెబ్బతీసేలా ఉందనే విషయం తన దృష్టికి వచ్చిందని, అందుకు తాను క్షమాపణ చెబుతున్నానని అన్నారు. ‘కులం, మతం, ప్రాంతం, లింగ, జాతి వివక్షపూరితమైన వ్యాఖ్యలు, చర్యలను నేనెప్పుడూ సమర్థించను. ఇతరుల మనోభావాలను దెబ్బతీసేందుకు నేనెప్పుడూ ప్రయత్నించను. నా వ్యాఖ్యలు ఎవరికైనా ఇబ్బంది కలిగించి ఉంటే అందుకు నేను క్షమాపణ కోరుతున్నా. నా మాటలు కేరళలో ఉంటున్న నా స్నేహితుల మనోభావాలను దెబ్బతీశాయనే విషయం నా దృష్టికి రావడంతోనే నేనీ క్షమాపణ చెబుతున్నా. హృదయపూర్వకంగా క్షమాపణ కోరుతున్నాన’ని చెప్పినట్లు ఆప్ ప్రకటించింది. కేరళ విభాగానికి చెందిన ఆ పార్టీ అధికార ప్రతినిధి కూడా కుమార్ విశ్వాస్ వ్యాఖ్యలపై క్షమాపణ కోరారు. దీంతో మొత్తానికి ‘కుమారుడు’ బతికి బయటపడ్డాడు. 
 
మరిన్ని వార్తలు