ఆ ఘటన సిగ్గుచేటు: మాజీ సీఎం

20 Apr, 2020 14:12 IST|Sakshi

సాక్షి, బెంగళూరు: పాదరాయణపురలో హింసకు పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలని మాజీ ముఖ్యమంత్రి హెచ్‌డీ కుమారస్వామి డిమాండ్‌ చేశారు. ఇటువంటి దాడులు ఏమాత్రం ఉపేకక్షించకూడదని రాష్ట్ర ప్రభుత్వానికి సూచించారు. బెంగళూరు పరిధిలోని పాదరాయణపురలో ముగ్గురు వ్యక్తులు కోవిడ్‌ బారిన పడిన నేపథ్యంలో సేవలు అందిస్తున్న ఆశా వర్కర్లు, పోలీసులపై కొంత మంది దాడికి దిగారు. బారికేడ్లను, వైద్య పరికరాలను ధ్వంసం చేసి బీభత్సం సృష్టించారు. ఈ ఘటనపై కుమారస్వామి స్పందిస్తూ.. ‘ఆశా వర్కర్లు, పోలీసులు, డాక్టర్లపై దాడులు చేయాల్సిన అవసరం లేదు. ఇటువంటి దాడులు ఏమాత్రం ఆమోదయోగ్యం కాదు. ఈ దాడి సిగ్గుచేటు. దాడులు చేసింది ఏ మతానికి చెందినవారైనా చట్టప్రకారం శిక్షించాల్సిందే. లాక్‌డౌన్‌ మార్గదర్శకాలకు ప్రతిఒక్కరూ పాటించాల’ని అన్నారు.

కాగా, పాదరాయణపురలో దాడికి పాల్పడిన 58 మందిని పోలీసులు అరెస్ట్‌ చేశారు. డీజీపీ, రాష్ట్ర హోంమంత్రితో సహా పలువురు అధికారులు సంఘటనా స్థలంలో పర్యటించి పరిస్థితిని అంచనా వేశారు.  మరోవైపు తన కొడుకు పెళ్లిలో లాక్‌డౌన్‌ నిబంధనలు ఉల్లంఘించిన కుమారస్వామిపై చర్యలు తీసుకోవాలన్న వాదనలు ఇంకా వినిపిస్తున్నాయి. అయితే ప్రభుత్వం మాత్రం ఇప్పటివరకు ఎటువంటి చర్యలు తీసుకోకపోవడంపై కన్నడవాసులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. 

వైద్య సిబ్బందిపై దాడులు: కేంద్రం కీలక నిర్ణయం 

మరిన్ని వార్తలు