నటి కుష్బుకు మొండిచేయి

23 Apr, 2016 09:04 IST|Sakshi
నటి కుష్బుకు మొండిచేయి

చెన్నై: డీఎంకే కూటమిలో ప్రధానమైన కాంగ్రెస్ పార్టీ తన అభ్యర్దుల తుది జాబితాను శుక్రవారం రాత్రి విడుదల చేసింది. ఎన్నికల వాతావరణం మొదలు కాగానే అందరికంటే ముందుగా డీఎంకేతో పొత్తుకు ఉరకలేసిన కాంగ్రెస్ పార్టీ అనేక తర్జన భర్జనల నడుమ 41 సీట్లను దక్కించుకుంది. తమిళ కాంగ్రెస్ అధ్యక్షులు ఈవీకేఎస్ ఇళంగోవన్‌ను తీవ్రంగా విభేదించే కేంద్ర మాజీ మంత్రి పి చిదంబరం, తదితరులను కాదని 33 మందితో తొలి జాబి తాను కొన్ని రోజుల క్రితం విడుదల చేశారు. ఇక మిగిలిన 8 మంది అభ్యర్దుల పేర్లతో కూడిన తుది జాబితా శుక్రవారం విడుదలైంది.


కుష్బుకు మొండిచేయి: మైలాపూర్ స్థానం నుండి పోటీచేయాలని కాంగ్రెస్ అధికార ప్రతినిధి, నటి కుష్బు ఎంతగానో ఆశించారు. అన్నాడీఎంకే అధినేత్రి జయలలితపై పోటీపెట్టనున్నారని మరికొందరు విశ్వసించారు. ఎన్నికల్లో ఎలాగైనా పోటీచేయాలనే పట్టుదలతో ఉన్న కుష్బు కాంగ్రెస్ అధిషానాన్ని సైతం కలిసి వచ్చారు. డీఎంకేతో విభేధించి కాంగ్రెస్ పంచన చేరిన రెండేళ్ల తరువాత మరలా కరుణానిధి ఇంటికి వెళ్లారు. మిత్రపక్ష కూటమి నేత హోదాలో కరుణ ఆశీస్సులు పొంది ఎలాగైనా సీటు దక్కించుకోవాలని గట్టి ప్రయత్నమే చేశారు. అయితే కుష్బుకు కాంగ్రెస్ మొండి చేయి చూపింది. ఆమె ఆశిస్తున్న మైలాపూరు నియోజకవర్గానికి కరాటే త్యాగరాజన్ పేరును ఖరారు చేసింది. కుష్బు ఆశించిన మైలాపూరును మహిళా కాంగ్రెస్ జాతీయ ప్రధాన కార్యదర్శి, నటి నగ్మా కూడా ఆశించారు.

ఈ విషయంలో ఇద్దరు నటీమణులు పోటీపడగా స్వల్పంగా మనస్పర్దలు చోటుచేసుకున్నాయి. జాతీయ ప్రధాన కార్యదర్శి హోదాలో అధిష్టానానికి దగ్గరగా ఉన్న నగ్మానే కుష్బు ప్రయత్నాలకు గండికొట్టి ఉంటారని కాంగ్రెస్‌నేతలు చెవులు కొరుక్కుంటున్నారు.

మరిన్ని వార్తలు