బహుముఖ ప్రజ్ఞాశాలి

17 Jan, 2014 00:42 IST|Sakshi
బహుముఖ ప్రజ్ఞాశాలి
 తెలుగు, తమిళం, హిందీ భాషల్లో ఎన్నో ఆణిముత్యాలను వెండితెరకెక్కించిన మహనీయుడు అక్కినేని లక్ష్మీ వరప్రసాదరావు. దర్జీ క్లీనర్‌గా జీవితం మొదలుపెట్టి, దర్శకుడిగా అత్యున్నత శిఖరాలను అధిరోహిం చారు. భారతీయ చలన చిత్ర నిర్మాతగా, నటుడిగా, దర్శకునిగా, సినిమాటోగ్రాఫర్‌గా, వ్యాపార వేత్తగా, సంఘ సేవకుడిగా బహుముఖాలను ప్రదర్శించిన ప్రజ్ఞాశాలి. ఆయన్ను అందరూ ఎల్వీ ప్రసాద్‌గా పిలుస్తారు. నేడు ఆయన జయంతి సందర్భంగా ప్రత్యేక కథనం.    - న్యూస్‌లైన్, అన్నానగర్ 
 
 ఆణిముత్యాలెన్నో
 ఆలంఅరా, భక్త ప్రహ్లాద, కాళిదాసు, సీతా స్వయంవరం (హిందీ) బోండాం పెళ్లి, బారిష్టర్ పార్వతీశం, చదువుకున్న భార్య, రాజాపార్వై (తమిళ) వంటి చిత్రాల్లో ప్రసాద్ నటించారు. తెనాలి రామకృష్ణ - ఘరానా దొంగ చిత్రాలకు సహాయ దర్శకుడిగా పని చేశారు. ఈ చిత్రాల్లో నటించారు కూడా. 25 హిందీ చిత్రాలకు, మరికొన్ని వొరియా, బెంగాలీ చిత్రాలకు ప్రసాద్ దర్శక - నిర్మాతగా వ్యవహరించారు. నటుడిగా పలుపాత్రలు పోషించారు. గృహ ప్రవేశం, ద్రోహి, పల్నాటి యుద్దం, పెంపుడు కొడుకు, కల్యాణం పన్నిపార్ (తమిళం), రాణి (తమిళం) పెళ్లిచేసి చూడు, పరదేశీ, పూంగోదై (తమిళం), మిస్సమ్మ, మంగైర్‌తిలకం (తమిళం), భాగ్యవతి (తమిళం), కడన్‌వాంగి కల్యాణం (తమిళం), అప్పు చేసి పప్పుకూడు, తాయిల్లా పిళ్లై (తమిళం), ఇరువరు వుల్లం (తమిళం) చిత్రాలకు దర్శకత్వం వహించారు.
 
 అవార్డులు, రివార్డులు
 దాదాసాహెబ్ పాల్కే అవార్డు, రఘుపతి వెంకయ్య అవార్డు, ఆంధ్ర రత్న, కళాప్రపూర్ణ, కళాతపస్వి, ఉద్యోగపాత్ర (జాతీయ అవార్డు), రాజు శాండో స్మారక అవార్డు        (తమిళనాడు) వంటి పలు అవార్డులు ఆయనలోని కళా సరస్వతికి దాసోహం అన్నాయి. సంఘ సేవ కోసం ఆయన పలు చోట్ల కంటి ఆస్పత్రులను నిర్మించారు. 86 ఏళ్ల వయసులో ఎల్‌వీ.ప్రసాద్ జూన్ 22, 1994లో కాలధర్మం చెందారు. కళకు - కళాకారులకు కాలధర్మం వర్తిం చదని చెప్పడానికే ఆయన తన పేరిట దేశ వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో నేత్ర చికిత్సాలయాలను నెలకొల్పారు. పేదలకు సైతం కారు చవకగా వైద్యసేవలు అందించడమే తన ఆస్పత్రుల ధ్యేయమని ఆయన తన తొలి ఐ హాస్పిటల్ ప్రారంభోత్సవ సందర్భంలో చెప్పిన మాటలు ఆయన జయంతి రోజున స్మరించుకుందాం. 
 
 పశ్చిమ గోదావరి జిల్లా, ఏలూరులోని సోమవరప్పాడులో 1908 జనవరి 17న ఎల్‌వీ ప్రసాద్ జన్మించారు. తల్లిదండ్రులైన అక్కినేని శ్రీరాములు - బసవమ్మకు ప్రసాద్ రెండో సంతానం. వయసుకు మించిన తెలివితేటలు ఆయన్ను విద్యాధికుడ్ని చేయలేకపోయినా అంతకుమించిన ప్రజ్ఞాశాలిని చేశాయి. రామషకీల్ సినిమా డేరాల్లో చూపించే పాత ఫిల్మ్‌ల షోలు, నాటకాలు ప్రసాద్‌ను చిన్నప్పుడే ఆకట్టుకున్నాయి. 1924లో ప్రసాద్‌కు 17 ఏళ్ల వయసప్పుడు ఆయన మేన మామ కూతురైన సౌందర్య మోహనమ్మతో వివాహమైంది. తండ్రి శ్రీరాములు అప్పుల బాధ తాళలేక ఐపీ పెట్టడంతో ప్రసాద్ చూపు మద్రాసు వైపు మళ్లింది. అయితే చెన్నైలో ఆయనకు అవకాశాలు లభించకపోవడంతో ఉత్తర భారతంలోని దాదర్‌కు మకాం మార్చారు. అక్కడ కోహినూర్ స్టూడియోస్‌లో  కొద్ది రోజులు పని చేశారు. కారణం ఆయనకు హిందీ, ఇంగ్లీష్ భాషలు రాకపోవడమే. దాదర్‌లోనే ఒక దర్జీ షాపులో క్లీనరుగా ప్రసాద్ చేరారు. కానీ అక్కడ ఇక్కడ ఉండలేక వీనస్ ఫిల్మ్ కంపెనీలో జీతంలేని ఉద్యోగిగా ఉంటూ అక్కడి నుంచి ఇండియా పిక్చర్స్ కంపెనీకి మారారు. అక్కడ సిక్తర్ నవాజ్ అనే వ్యక్తి ప్రసాద్‌కు స్టార్ ఆఫ్ ది ఈస్ట్ మూకీ చిత్రంలో ఒక చిన్న వేషం ఇచ్చారు. అయితే దురదృష్టవశాత్తు ఇది రిలీజ్ కాలేదు.
 
 వీనస్ ఫిల్మ్ కంపెనీ యజమాని ధన్‌లాల్ సోదరి మోతీ ఇచ్చిన ప్రోత్సాహంతో భారతీయ తొలి టాకీ అయిన ఆలంఅరాలో ప్రసాద్‌కు ఒక చిన్న పాత్ర లభించింది. 1931లో అలంఅరా రిలీజ్ తర్వాత ప్రసాద్‌కు ఎన్నో లఘుపాత్రలు లభించాయి. అనంతరం హెచ్ ఎం రెడ్డి కాళిదాసు చిత్రంలో ప్రసాద్‌కు ఒక గుర్తింపులేని పాత్రను ఇచ్చారు. అప్పటికే చిన్నచిన్న పాత్రలు వేసి విసిగిపోయిన ప్రసాద్‌కు సోమవర పాడులోని తన తల్లిదండ్రులు గుర్తుకురావడంతో తిరిగి సొంతఊరు చేరారు. అయితే తిరిగే కాలు - తిట్టే నోరు వూరికే వుండవన్న సామెతను రుజువు చేస్తూ ప్రసాద్ సకుటుంబంగా బొంబాయికి చేరారు. ఆమీషా తన కమర్ - ఆల్ - జమాన్ చిత్రానికి ప్రసాద్‌ను అసిస్టెంట్ డెరైక్టర్‌గా నియమించారు. ఈ చిత్రం నుంచి ప్రసాద్ పేరును షార్టుకట్ చేసి ఎల్.వి.ప్రసాద్‌గా టైటిల్స్‌ను చూపడం మొదలైంది. 
 
 ప్రసాద్ సహాయ దర్శకుడిగా పని చేసిన కష్టజీవి చిత్రం అర్ధాంతరంగా ఆగిపోవడంతో ఆయన పృధ్విరాజ్‌కపూర్ నిర్వహిస్తున్న పృథ్వి థియేటర్‌లో చేరి మంచి నటుడిగా గుర్తింపు పొందారు. పృథ్వి రాజ్‌కపూర్ కుమారుడైన రాజ్‌కపూర్‌తో ప్రసాద్ తన మొట్టమొదటి హిందీ చిత్రం శారదాను నిర్మించడంతో ఆయన సుడి తిరిగింది. నిర్మాతగా ఇది ప్రసాద్‌కు తొలి హిందీ చిత్రం. 1943లో గృహప్రవేశం చిత్రానికి సహాయక దర్శకుడిగా పని చేసిన ప్రసాద్ విధి విలాసంలో భాగమై అదే చిత్రానికి దర్శకుడిగా పని చేయడమే కాక, ప్రధాన భూమికను పోషించి ఆ చిత్రాన్ని ఒక క్లాసిక్ హిట్‌గా విజయవంతం చేశారు. ఈ చిత్రాన్ని చూసిన దర్శకుడు కె.ఎస్.ప్రకాశరావు తన ద్రోహి చిత్రంలో ప్రధాన పాత్రను ఇచ్చారు. అదీ మంచి హిట్ కావడంతో దర్శకుడు గూడవల్లి రామబ్రహ్మం తన పల్నాటి యుద్ధం చిత్రంలో మిగిలిన భాగాన్ని దర్శకత్వం వహించాలని కోరారు.
 
 (ఈ చిత్రం సగంలో ఉండగా రామబ్రహ్మం జబ్బునపడ్డారు). 1949లో మన దేశం చిత్రాన్ని డెరైక్టు చేశారు. ఇందులో ఎన్టీరామారావును ఒక చిన్న పాత్ర ద్వారా తెరంగేట్రం చేయించింది ప్రసాద్. 1950లో విజయా పిక్చర్సు వారు తమ షావుకారు చిత్రానికి దర్శకత్వం చేయూలని కోరడంతో అందులో నటించిన ఎన్టీఆర్ - జానకిలకు గొప్ప పేరు వచ్చింది. జానకి ఆనాటి నుంచి షావుకారు జానకిగా ప్రఖ్యాతి పొందింది. అదే సంవత్సరం ఎన్టీఆర్ - ఏఎన్నార్‌తో ప్రసాద్ దర్శకత్వం వహించిన సంసారం బంపర్ హిట్ అయ్యింది.  జూపిటర్ ఫిల్మ్స్ తమిళం తెలుగు - హిందీ భాషల్లో నిర్మిస్తు న్న మనోహర చిత్రానికి దర్శకత్వం వహించారు. ఈ చిత్రం అఖండ విజయంతో అటు ఎల్వీ ప్రసాద్‌కు, ఇటు నటుడు శివాజీ గణేశన్‌కు ఎదురులేకుండా పోయింది. 1955లో ఆయన దర్శకుడు డి.యోగానంద్‌ను పిలిచి తన ఇలవేల్పు చిత్రాన్ని దర్శకత్వం వహించే అవకాశాన్ని కల్పించారు. 
 
మరిన్ని వార్తలు