నాడు 98.. నేడు 16

27 Sep, 2016 11:41 IST|Sakshi
నాడు 98.. నేడు 16
  సింగరేణిలో కార్మిక సంఘాల సంఖ్య
  బోణిచేయని మూడు జాతీయ సంఘాలు
  ప్రధాన యూనియన్ల వెంటే కార్మికులు
  తాజా ఎన్నికల్లో మెజార్టీ అనుమానమే
 
మంచిర్యాల సిటీ(ఆదిలాబాద్) : గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికల పుణ్యమా అని సింగరేణిలో కార్మిక సంఘాల సంఖ్య తగ్గిపోయింది. ఒకప్పుడు 98కి పైగా ఉన్న సంఘాలు 18 ఏళ్ల క్రితం ఎన్నికలు మొదలు కావడంతో బరిలోకి దిగే సంఘాల సంఖ్య క్రమేణ తగ్గుతూ వచ్చింది. ప్రస్తుతం పేరుకు 32 సంఘాలున్నా ఆరో దఫా ఎన్నికల్లో పాల్గొనడానికి వివరాలు అందజేసింది 16 సంఘాలే. 2012లో జరిగిన ఎన్నికల్లో కేవలం 9 సంఘాలకు మాత్రమే ఓట్లు వచ్చాయి. 
 
సింగరేణిలో మొదటిసారి ఎన్నికలు 1998 సెప్టెంబర్ 14న జరిగాయి. నాటి నుంచి 2012 జూన్ 28 వరకు ఐదు దఫాలుగా నిర్వహించిన ఎన్నికల్లో ప్రధాన సంఘాలైన ఐఎన్‌టీయూసీకి ఒక్కసారి, ఏఐటీయూసీ మూడుసార్లు, టీబీజీకేఎస్‌కు ఒక్కసారి కార్మికులు పట్టం కట్టారు. హెచ్‌ఎంఎస్, బీఎంఎస్, సీఐటీయూ వంటి జాతీయ సంఘాలు గుర్తింపు హోదా కోసం కనీస పోటీ కూడా ఇవ్వలేక పోయారు. హెచ్‌ఎంఎస్ ఒక్కటే ప్రాతినిధ్య సంఘంగా రామగుండం రీజియన్‌లో ఉనికిని చాటుకుంటోంది. వీటితో పాటు టీడీపీ అనుబంధ టీఎన్‌టీయూసీ ఆరంభంలోనే శూరత్వం చూపింది. మొదటి ఎన్నికల్లో బెల్లంపల్లి, కార్పొరేట్ ఏరియాల్లో ప్రాతినిధ్య సంఘంగా గెలిచింది. ఆ తరువాత నుంచి జరిగిన ఎన్నికల్లో ఏఐటీయూసీకి మద్దతు ఇచ్చినప్పటికీ ఆ యూనియన్ మెజార్టీ 2012 ఎన్నికల నాటికి 39 ఓట్లకు పడిపోయింది. ఐఎఫ్‌టీయూ ఐదుసార్లు జరిగిన ఎన్నికల్లో ప్రాతినిధ్య సంఘానికే పరిమితమైపోయింది. 1998లో కొర్పొరేట్, 2001లో ఆర్‌జీ-1, 2 ఏరియాల్లో ప్రాతినిధ్య సంఘంగా కార్మికుల ఆదరించారు. ఈ సంఘం మెజార్టీ సైతం వందల సంఖ్యకు పడిపోయింది. ఇక ఏఐఎఫ్‌టీయూ, ఎస్‌జీకేఎస్(సింగరేణి గని కార్మిక సంఘం) వంటి సంఘాలు కనుమరుగయ్యాయని చెప్పవచ్చు. 
 
ఆ మూడు బలాలుంటేనే అధికారం
జాతీయ సంఘాలుగా చెప్పుకుంటున్న బీఎంఎస్, సీఐటీయూ, హెచ్‌ఎంఎస్‌కు జాతీయ స్థాయిలో ఆర్థిక, అంగ బలం ఉన్నప్పటికీ సింగరేణిలో మాత్రం పట్టు సాధించలేక పోయారు. వేజ్‌బోర్డులో కీలకపాత్ర పోషించే ఈ సంఘాలు కార్మికుల అభిమానాన్ని మాత్రం చూరగొనలేకపోవడం వెనుక అనేక కారణాలున్నాయి. జాతీయ స్థాయిలో ఉన్న పట్టును స్థానికంగా సద్వినియోగం చేసుకోలేక పోయాయనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. బలమైన నాయకత్వ లోపమే ప్రధానంగా కనబడుతోంది. మిగతా జాతీయ సంఘాలకు సింగరేణిలో ఉన్న బలమైన క్యాడర్ ఈ సంఘాలకు లేకపోవడం ముఖ్య కారణం. సమస్యలపై స్పందించే గుణమూ తక్కువే. హెచ్‌ఎంఎస్, ఐఎఫ్‌టీయూ వంటి సంఘాలు ముక్కుసూటిగా వ్యవహరించే స్వభావం ఉండటంతో పాటు ఆయా సంఘాలకు మాతృ పార్టీలు లేకపోవడం, కేంద్రంలో, రాష్ట్రంలో అధికారం లేకపోవడం వల్లే వెనుకబడిపోతున్నాయనే అభిప్రాయాలు ఉన్నారుు. ఆర్థిక వనరులూ తక్కువే. సమైఖ్య రాష్ట్రంలో టీడీపీ అధికారంలో ఉండి కూడా తన అనుబంధ సంఘాన్ని బలోపేతం చేయకుండానే ఏఐటీయూసీకి మద్దతు ఇచ్చింది. పోరాట చరిత్ర ఉన్న ఏఐటీయూసీ సైతం తెలంగాణ ఉద్యమ నేపథ్యంలో 2012లో జరిగిన ఎన్నికల్లో టీబీజీకేఎస్‌కు 6,587 ఓట్ల తేడాతో అధికారం అప్పగించింది. సింగరేణిలో అధికారం చేజిక్కించుకోవాలంటే పోరాటంతో పాటు అంగ, అర్థ బలం అవసరమే. ఈ మూడు ఉన్న సంఘాలనే ఇప్పటి వరకు జరిగిన ఎన్నికల్లో కార్మికులు ఆదరించారని చెప్పవచ్చు. 
    
 ఐదు సార్లు జరిగిన ఎన్నికల్లో ఆయా సంఘాలు సాధించిన మెజార్టీ వివరాలు
 
 యూనియన్         1998        2001       2003      2007     2012
 హెచ్‌ఎంఎస్           3,784      2,434      1,583      4,099    5,983
 సీఐటీయూ           3,257       5.237       --          1.291     0,099
 బీఎంఎస్               2,021      0,519       --           0,184     0,189
 టీఎన్‌టీయూసీ       2,596      9,788     7,609     1,212    0,039
 ఐఎఫ్‌టీయూ         12,674    14,883    3,179     0,720    0,373   
 ఏఐఎఫ్‌టీయూ       0,777       0,024      --            --           --
 
మరిన్ని వార్తలు