బాల్‌ఠాక్రే వర్ధంతి కోసం భారీ ఏర్పాట్లు

15 Nov, 2013 01:14 IST|Sakshi

సాక్షి, ముంబై: దివంగత శివసేన అధినేత బాల్ ఠాక్రే ప్రథమ వర్థంతిని ఘనంగా నిర్వహించేందుకు ఆ పార్టీ నాయకులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ నెల 17న శివాజీపార్క్ మైదానంలో జరగనున్న కార్యక్రమానికి లక్షలాది మంది కార్యకర్తలు తరలిరానున్నారు. ఇప్పటికే రాష్ర్టంలోని ప్రతి పార్టీ కార్యకర్త, అభిమానులు తరలివచ్చి నివాళులు ఆర్పించాలని ఇప్పటికే పార్టీ అధినాయకత్వం కోరిన సంగతి తెలిసిందే. ఆ రోజు జరిగే బాల్‌ఠాక్రే వర్ధంతి కార్యక్రమానికి శివసేన మిత్రపక్షాలైన బీజేపీ, ఆర్పీఐ నాయకులను కూడా హాజరుకావాలని ఆహ్వనించింది. దీంతో ఇరుపార్టీల పదాధికారులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో తరలిరానున్నారు. భారీ సంఖ్యలో శివసైనికులను శివాజీపార్క్ మైదానానికి తరలించే బాధ్యతలు ముంబైలోని అన్ని విభాగ ప్రముఖులకు అప్పగించారని పార్టీ వర్గాలు తెలిపాయి. శివాజీపార్క్ మైదానంలో బాల్‌ఠాక్రే పేరుతో నిర్మించిన (ఉద్యానవనం రూపంలో ఉన్న) స్మారకాన్ని శివసైనికులు ‘శక్తి స్థల్’ గా గుర్తించాలనే ఉద్ధేశ్యంతో అక్కడ ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపాయి. ఇదిలాఉండగా బాల్ ఠాక్రే వర్ధంతి పురస్కరించుకుని శివసేన సీని యర్ నాయకుడు, ఎమ్మెల్యే సుభాష్ దేశాయి గోరేగావ్‌లో మూడు రోజుల పాటు ‘ఠాక్రే ఉత్సవాలు’ నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా గురువారం నుం చి మూడు రోజులపాటు వేర్వేరు కార్యక్రమాలు జరగనున్నాయి. బాల్‌ఠాక్రే ప్రథమ వర్థంతి సందర్భంగా శివసేన విడుదల చేసిన పోస్టర్లపై ‘చలా శివ్ తీర్థావర్’ అంటూ పిలుపునిచ్చారు.  
 
 దీంతో వచ్చే ఏడాది జరగనున్న లోక్‌సభ, శాసనసభ ఎన్నికల్లో టికెట్ ఆశిస్తున్న అభ్యర్థులు జనాలను భారీ సంఖ్యలో తరలించడంపైనే ప్రధాన దృష్టి కేంద్రీకరించారు. బాల్‌ఠాక్రే చనిపోయిన తర్వాత ఉద్ధవ్ రెండుసార్లు రాష్ట్రవ్యాప్తంగా పర్యటించారు. ఆయన లేని లోటు కారణంగా కార్యకర్తలు, పదాధికారులు పార్టీని వదిలి వెళ్లిపోకుండా ఉద్ధవ్ తగిన జాగ్రత్తలు తీసుకున్నారు. అంతేగాక ముంబైతోపాటు రాష్ట్రంలో శివసేనకు చెందిన కీలక లోక్‌సభ నియోజకవర్గాలలో సమావేశాలు జరిపి మరింత పటిష్టం చేశారు. ఆదివారం జరగనున్న ప్రథమ వర్ధంతికి పెద్ద ఎత్తున జనం, శివసైనికులు తరలి వచ్చేందుకు ఇంటర్నెట్, ఫేస్‌బుక్, ట్విట్టర్‌లలో భారీగా పోస్ట్‌లు చేశారు. దీన్నిబట్టి ఆ రోజు భారీగానే బలప్రదర్శన జరిగే అవకాశాలున్నాయని ప్రతిపక్ష పార్టీల నాయకులు అభిప్రాయపడుతున్నారు.

మరిన్ని వార్తలు