ఆగిన లాల్‌బాగ్

4 Mar, 2015 02:51 IST|Sakshi
ఆగిన లాల్‌బాగ్

    ఇంజిన్‌లో సాంకేతిక లోపం
     రెండు గంటలు ఆగిన ఎక్స్‌ప్రెస్
     ఆందోళనకు దిగిన ప్రయాణికులు
 
 తిరువళ్లూరు : లాల్‌బాగ్ ఎక్స్‌ప్రెస్‌లోని ఇంజిన్‌లో ఏర్పడిన సాంకేతిక లోపం కారణంగా దాదాపు రెండు గంటల పాటు రైలు నిలిచి పోవడంతో ప్రయాణికులు తీవ్రంగా ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అయితే రైల్వే అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో ప్రయాణికులు ఆందోళనకు దిగారు. చెన్నై నుంచి బెంగళూరుకు లాల్‌బాగ్ ఎక్స్‌ప్రెస్ మంగళవారం మధ్యాహ్నం 3.30 గంటలకు బయలుదేరింది. ఎక్స్‌ప్రెస్ సెవ్వాపేట దాటి పుట్లూరు వైపు వస్తున్న సమయంలో ఎదురుగా వస్తున్న మరో రైలు పశువును ఢీ కొట్టింది. దీంతో పశువు మృతదేహం తిరువళ్లూరు వైపు వస్తున్న లాల్‌బాగ్ ఎక్స్‌ప్రెస్ ఇంజిన్‌లో చిక్కుకుంది. దీంతో సెవ్వాపేట- పుట్లూరు మధ్యలో 4.15 గంటలకు రైలు ఇంజిన్‌కు వచ్చే విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. గంట సమయం దాటుతున్నా రైలు ముందుకు కదలకపోవడంతో ప్రయాణికులు ఇంజిన్ డ్రైవర్‌తో వాగ్వాదానికి దిగారు. దీంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఇంజన్‌లో సాంకేతిక లోపం వుందని, వాటిని సరి చేయడానికి మరో గంట సమయం పడుతుందనీ డ్రైవర్ వివరణ ఇవ్వడంతో ప్రయాణికులు ఆందోళనకు దిగారు. రైల్‌రోకో చేసి తిరువళ్లూరు వైపు వెళుతున్న రైలును ఆపడాన్ని యత్నించారు. అనంతరం డ్రైవర్ అరక్కోణం రైల్వే అధికారులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న సిబ్బంది ప్రత్యామ్నాయంగా మరో ఇంజిన్‌ను ఏర్పాటు చేసి రైలును 6 గంటలకు ముందుకు కదిలించారు.
 

మరిన్ని వార్తలు