లాల్‌బాగ్‌లో 144 సెక్షన్ విధింపు

7 Jan, 2015 04:12 IST|Sakshi
లాల్‌బాగ్‌లో 144 సెక్షన్ విధింపు

ముంబై: మూడు రోజుల క్రితం రెండు వర్గాల మధ్య అల్లర్లు చెలరేగిన లాల్‌బాగ్ పరిసర ప్రాంతాల్లో పోలీసులు 144 సెక్షన్ విధించారు. నలుగురు కంటే ఎక్కువగా జనం గుమికూడకుండా చూసే ఈ నిషేధాజ్ఞలు ఈ నెల 17వ తేదీ వరకు అమలులో ఉంటాయని స్థానిక బోయివాడ పోలీసు ఇన్‌స్పెక్టర్ సునీల్ తోండ్వాల్కర్ చెప్పారు. శాంతి భద్రతలు స్థిరంగా ఉండాలనే ఉద్దేశ్యంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు నగర పోలీసు కమిషనర్ రాకేశ్ మారియా చెప్పారు. మిలాద్ ఉన్ నబీని పురస్కరించుకుని ఆదివారం రాత్రి రెండు వర్గాల మధ్య జరిగిన వివాదం ఇక్కడి పరిసర ప్రాంతాల్లో ఉద్రిక్తతను సృష్టించింది. జనం రాళ్లు రువ్వుకోవడం, పరస్పరం దాడులకు పాల్పడటంతో ఏడుగురు గాయపడిన సంగతి తెల్సిందే. పోలీసులు సకాలంలో స్పందించడంతో పరిస్థితులు రెండు గంటల్లో అదుపులోకి వచ్చాయి. సోమవారం, మంగళవారం కూడా అక్కడ వాతావరణం ఉద్రిక్తంగానే ఉంది.

ప్రస్తుతం పరిస్థితి ప్రశాంతంగానే ఉన్నా ఉద్రిక్తంగా ఉన్నట్లు పోలీసులు పేర్కొన్నారు. దీంతో ముందు జాగ్రత్త చర్యగా 144 సెక్షన్ విధించినట్లు మారియా చెప్పారు. వదంతులు నమ్మవద్దని నగర పోలీసు శాఖ ద్వారా పౌరుల మొబైల్ ఫోన్లకు ఎస్సెమ్మెస్‌లు పంపించారు. కొందరు యువకులు ఆ రోజు రికార్డు చేసిన ఘర్షణ దృశ్యాలను తమ బంధువులకు, మిత్రులకు ఎమ్మెమ్మెస్ చేసినట్టు తెలియవచ్చింది. ఉద్రిక్తతకు దారితీసే ఇలాంటి దృశ్యాలు ఎమ్మెమ్మెస్‌గాని, ఫేస్‌బుక్‌లోగాని, వాట్స్ అప్‌లోగాని పెట్టవద్దని రాకేశ్ మారియా విజ్ఞప్తి చేశారు. అల్లర్లకు ఆజ్యం పోసే ఇలాంటి దృశ్యాలను అడ్డుకునేందుకు పోలీసు శాఖకు చెందిన సోషల్ మీడియా కూడా ప్రయత్నిస్తోందని కమిషనర్ చెప్పారు. లాల్‌బాగ్ నుంచి పరేల్‌లోని తకియా మసీదు ప్రాంతం వరకు మంగళవారం రాత్రంతా మారియా స్వయంగా గస్తీ నిర్వహించారు.

రెండు దర్యాప్తు బృందాలు...........

లాల్‌బాగ్ ప్రాంతంలో జరిగిన అల్లర్ల ఘటనపై దర్యాప్తు చేపట్టేందుకు పోలీసులు రెండు బృందాలను ఏర్పాటు చేశారు. ఈ ఘటనకు సంబంధించి బోయివాడ పోలీసులు ఇప్పటికి 15 బైక్‌లను స్వాధీనం చేసుకున్నారు. సీసీటీవీ కెమెరాల్లో రికార్డయిన ఫుటేజ్‌లను, ఫొటోలను, వీడియో క్లిప్పింగులను పరిశీలిస్తున్నట్లు రాకేశ్ మారియా చెప్పారు. రాళ్లు రువ్విన ఘటనలో ఎనిమిది మంది గాయపడ్డారు. ఇందులో ఒకరు ఇంకా ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.
 

మరిన్ని వార్తలు