కార్మికుల పిల్లలకు ల్యాప్‌టాప్!

25 Jan, 2014 23:36 IST|Sakshi

సాక్షి, ముంబై: కార్మికుల పిల్లలకు రాష్ట్ర ప్రభుత్వం ఉచితంగా ల్యాప్‌టాప్‌లు, ట్యాబ్‌లెట్‌లను పంపిణీ చేయాలని నిర్ణయించింది. కార్మికుల పిల్లల్లో సాంకేతిక పరిజ్ఞానం పెంపొందించే లక్ష్యంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు సంబంధిత అధికారి ఒకరు తెలిపారు. భవన నిర్మాణ కార్మికులు, ఇళ్లల్లో పనిచేసేవారి పిల్లలకు వీటిని పంపిణీ చేయనున్నారు. ‘మహారాష్ట్ర డొమెస్టిక్ వర్కర్స్ వెల్ఫేర్ బోర్డ్’లో రిజిస్టర్ చేసుకున్న వారికి వీటిని అందజేయనున్నట్లు అధికారి వెల్లడించారు.

కాగా, ట్యాబ్‌లెట్లను 5వ తరగతి నుంచి 10వ తరగతి చదువుతున్న వారికి అందజేస్తామని ఆయన తెలిపారు. అదేవిధంగా స్కూల్ సెకండరీ సర్టిఫికెట్ (ఎస్‌ఎస్‌సీ)లో పాస్ అయిన విద్యార్థులకు ల్యాప్‌టాప్‌లను అందజేయనున్నారు. వీటి కొనుగోలుకు రాష్ట్ర ప్రభుత్వం దాదాపు రూ.7.86 కోట్లను వెచ్చించనున్నట్లు అధికారి ఒకరు తెలిపారు. ఈ పథకం ద్వారా దాదాపు 5,700 మంది పిల్లలు లబ్ధిపొందనున్నారు.

 ఈ సందర్భంగా బోర్డు అధికారులు మాట్లాడుతూ..‘సెకండరీ సెక్షన్‌లో 4,077 మంది విద్యార్థులు చదువుతున్నారు. 1,672 మంది ఎస్‌ఎస్‌సీ పరీక్షలో పాస్ అయ్యారు. ఈ ఏడాది నుంచే ఎలక్ట్రానిక్ సామగ్రిని పంపిణి చేయాలని నిశ్చయించాం. ల్యాప్‌టాప్‌లు, ట్యాబ్‌లెట్లను కొనుగోలు చేయడానికి త్వరలో ఈ-టెండర్లను ఆహ్వానిస్తున్నాం..’  అని తెలిపారు. ట్యాబ్‌లెట్ల ధర రూ.7,000 ఉండగా ల్యాప్‌టాప్‌ల వెల రూ.30 వేల వరకు ఉంటుందని అధికారులు తెలిపారు. దీంతో మొత్తం కలిపి రూ.7.86 కోట్లు అవనున్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు.

పిల్లలకు ల్యాప్‌టాప్, ట్యాబ్‌లెట్లను అందజేయడం ప్రశంసించాల్సిన విషయం అయినప్పటికీ వారికి శిక్షణ ఎవరిస్తారని ఆల్ ఇండియా ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్ (ఏఐటీయూసీ) జిల్లా అధ్యక్షుడు ఏక్‌నాథ్ మానే ప్రశ్నించారు. అంతేకాకుండా ఇంటర్‌నెట్‌కు అయ్యే ఖర్చును ఎవరు భరిస్తారని తెలిపారు. ఇంటర్‌నెట్ సౌకర్యం లేకుండా టాబ్‌లెట్లు, ల్యాప్‌టాప్‌లు అంతగా ఉపయోగానికి రావన్నారు.

 కాగా ‘డొమెస్టిక్ వర్కర్స్ వెల్ఫేర్ బోర్డ్’ కార్యదర్శి మధుకర్ గైక్వాడ్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో 2.38 లక్షల మంది డొమెస్టిక్ వర్కర్లు రిజిస్టర్ చేసుకున్నారన్నారు. నగరంలో వీరి సంఖ్య 20 వేలకు ఉందన్నారు. కంప్యూటర్ పరిజ్ఞానం పొందాలనుకునే విద్యార్థులకు తాము కూడా సహకరిస్తున్నామన్నారు. ఈ ఏడాదిలోనే వీటిని పంపిణీ చేస్తారని, అయితే ఈ ప్రక్రియకు కొంత సమయం పడుతుందని ఆయన తెలిపారు. ఇదిలా వుండగా డొమస్టిక్ వర్కర్లు స్కూల్ ద్వారా పొందిన బోనాఫైడ్ సర్టిఫికెట్‌ను సమర్పించాల్సి ఉంటుంది. కాగా ఒక్కరి కంటే ఎక్కువ మంది పిల్లలు ఉన్న కుటుంబానికి ట్యాబ్‌లెట్ లేదా ల్యాప్‌టాప్ ఇందులో ఏదో ఒక్కదానినిమాత్రమే అందజేయనున్నట్లు గైక్వాడ్ స్పష్టం చేశారు.

>
మరిన్ని వార్తలు