నటి సౌందర్య ఆస్తుల కేసులో కుదిరిన రాజీ

4 Dec, 2013 12:09 IST|Sakshi
నటి సౌందర్య ఆస్తుల కేసులో కుదిరిన రాజీ

బెంగళూరు, న్యూస్‌లైన్:  బహుభాషా నటి, తెలుగు, కన్నడ చిత్రాల్లో ఓ వెలుగు వెలిగిన అందాల తార సౌందర్య అర్ధాంతరంగా విమాన ప్రమాదంలో తనువు చాలించిన విషయం తెల్సిందే. సౌందర్య మరణాంతరం ఆమె ఆస్తుల కోసం కుటుంబ సభ్యులు అప్పట్లో కోర్టును ఆశ్రయించారు. ప్రస్తుతం కుటుంబ సభ్యులు రాజీకి వచ్చి ఎటువంటి వివాదం లేకుండా ఆస్తుల పంపకానికి పరస్పర అంగీకారానికి వచ్చారు. కోర్టులో ఉన్న వ్యాజ్యాన్ని ఉపసంహరించుకున్నారు.

2004 ఏప్రిల్ 17న బెంగళూరు నుంచి కరీంనగర్‌కు చార్టర్డ్ విమానంలో సౌందర్య, ఆమె సోదరుడు అమరనాథ్ మరికొంత మందితో బయలుదేరుతుండగా ఒక్కసారిగా విమానం కుప్పకూలి మంటలు అంటుకోవడంతో సౌందర్య, ఆమె సోదరుడితో పాటు అందరూ మృత్యువాత పడ్డారు.

సౌందర్యకు తల్లి మంజుల, భర్త జీఎస్. రఘు, సోదరుడు అమరనాథ్, అతని భార్య బి. నిర్మల, వీరి కుమారుడు సాత్విక్ ఉన్నారు. సౌందర్య మృతి చెందిన తరువాత ఆస్తుల పంపకాల విషయమై కుటుంబ సభ్యుల మధ్య గొడవలు జరిగాయి. ఆ సమయంలో సౌంద ర్య 2003 ఫిబ్రవరి 15న వీలు రాశారని, ఆమె వీలునామా ప్రకారం ఆస్తులు పంపిణీ చెయ్యాలని  అమరనాథ్ భార్య నిర్మల 2009లో ఇక్క డి మెజిస్టేట్ కోర్టును ఆశ్రయించారు.

 సౌందర్య ఎలాంటి వీలునామా రాయలేదని, నిర్మల సోదరుడు న్యాయవాది కావడంతో తప్పుడు వీలునామా సృష్టించారని సౌందర్య తల్లి మంజుల, రఘు కోర్టును ఆశ్రయించారు. అప్పటి నుంచి కోర్టులో వివాదం నడుస్తోంది. తన అత్త మంజుల, వరుసకు సోదరుడు అయిన రఘు తనపై కక్షసాధిస్తూ దౌర్జన్యం చేస్తున్నారని నిర్మల కోర్టులో కేసు దాఖలు చేసింది. సౌందర్య రాసిన వీలునామా నకిలీ అని ప్రచారం చేస్తున్నారని ఆరోపిస్తూ నిర్మల న్యాయవాది ధనరాజ్, సౌందర్య భర్త రఘు, ఆమె తల్లి మంజులపై పరువు నష్టం కేసు వేశారు. ఈ వివాదాలతో ఇంత  కాలం వీరు కోర్టు చుట్టు తిరిగారు. చివరికి రాజీకి వచ్చి ఆస్తులు పంచుకోవాలని ఒక నిర్ణయానికి వచ్చారు.

ఆస్తుల పంపకాలు ఇలా 
సౌందర్య ఆస్తులకు మంజుల, రఘు, నిర్మల, సాత్విక్ వారసులు. తాము రాజీకి వ చ్చామని, ఎలాంటి సమస్య లేదని వారు కోర్టుకు లిఖితపూర్వకంగా విజ్ఞప్తి చేశారు. వివాదపు అర్జీని కూడా ఉపసంహరించుకున్నారు. సౌందర్య పేరుతో ఉన్న రూ. 25 లక్షల బ్యాంకు డిపాజిట్, హనుమంత నగరలోని ఐదు ఇళ్లు మేనల్లుడు సాత్విక్‌కు చెందుతాయి. అదే విధంగా నిర్మలకు రూ. 1.25 కోట్ల నగదు చెందుతుంది. సౌందర్య సోదరుడు అమరనాథ్ పేరుతో వ్యవసాయ భూమి ఉంది.

ఆ భూమి విక్రయించి వచ్చిన నగదులో మంజుల, నిర్మల, సాత్విక్ పంచుకోవ డానికి అంగీకరించారు. జాయింట్ ప్రాపర్టీ విషయంలో నిర్మల జోక్యం చేసుకోకుండ సౌందర్య తల్లి మంజులకు అప్పగించాలి. మల్లేశ్వరం, హెచ్‌ఆర్‌బీఆర్ రెండవ సెక్టార్‌లోని ఇంటి స్థలాలు, హైదరాబాద్‌లోని కార్యాలయం, హెచ్‌ఆర్‌బీఆర్ లేఔట్‌లోని ఇంటి స్థలాలు సౌందర్య భర్త రఘుకు అప్పగించాల్సి ఉంది. ఈ విషయంపై అందరు అంగీకరించడంతో కేసుకు పుల్‌స్టాప్ పడింది. అయితే సౌందర్య నిజంగా వీలునామా రాసిందా లేదా అనే విషయం మాత్రం మిస్టరీగా మారింది.

సినీ ‘సౌందర్యం
1992లో కన్నడ సినీరంగం నుంచి గంధర్వ సినిమాతో వెండి తెరకు పరిచయమైన సౌందర్య తెలుగు, కన్నడ, తమిళ్, మళయాళం, హిందీ సినిమాలలో నటించి పలు అవార్డులు సొంతం చేసుకుంది. వంద సినిమాలకు పైగా ఆమె హీరోయిన్‌గా న టించింది. 2003 ఏప్రిల్ 27న వరుసకు బావ అయిన సాఫ్ట్‌వేర్ ఇంజనీరు రఘును వివాహం చేసుకుంది.

2004లో జరిగిన లోక్‌సభ ఎన్నికలలో బీజేపీకి ప్రచారం చేసింది. అదే ఏడాది ఏప్రిల్ 17న ఇక్కడి జక్కూరు ఏయిర్‌పోర్టు నుంచి ఆంధ్రప్రదేశ్‌లోని కరీంనగర్‌లో అక్కడి పార్లమెంట్ అభ్యర్థి (బీజేపీ) విద్యాసాగర్‌రావు తరపున ప్రచారం చెయ్యడానికి చార్టెర్డ్ విమానంలో బయలుదేరారు. ఆ విమానంలో సౌందర్య, ఆమె సోదరుడు అమరానాథ్ ఉన్నారు. దురదృష్టవశాత్తు విమానం గాలిలోకి ఎగిరి కొన్ని క్షణాలకే పక్కనే ఉన్న గాంధీ విశ్వవిద్యాలయం (జీకేవీకే) ఆవరణంలో కుప్పకూలిపోవడంతో సజీవ దహనమయ్యారు.

మరిన్ని వార్తలు