లతా రజనీకాంత్‌కు హైకోర్టులో ఊరట

13 Mar, 2016 10:01 IST|Sakshi
లతా రజనీకాంత్‌కు హైకోర్టులో ఊరట

చెన్నై: సూపర్‌స్టార్ సతీమణి లతారజనీకాంత్‌కు 'కొచ్చాడయాన్' చిత్ర వ్యవహారంలో ఊరట లభించింది. ఆమెపై దాఖలైన పిటిషన్‌ను కర్ణాటక హైకోర్టు కొట్టివేసింది. రజనీకాంత్ నటించిన యానిమేషన్ చిత్రం 'కొచ్చాడయాన్'. ఈ చిత్రానికి ఫైనాన్స్ చేసిన యాడ్ బ్యూరో సంస్ధ అధినేత అభీర్‌చంద్ నెహర్ బెంగుళూరు కోర్టులో లతారజనీకాంత్‌పై పిటిషన్ దాఖలు చేశారు.
 
అందులో ఆయన పేర్కొంటూ 'కొచ్చాడయాన్' చిత్రం నిర్మాణంలో ఆర్ధిక సమస్యలు తలెత్తిన సమయంలో ఆ చిత్ర నిర్మాణ సంస్థ తన నుంచి రూ.6.84 కోట్లు రుణం పొందిందన్నారు.అందుకు పూచీకత్తుగా లతారజనీకాంత్ సంతకం చేశారని తెలిపారు. అంతే కాకుండా ఆమె స్థల డాక్యుమెంట్స్ ఇచ్చారని అవి నకిలీవని తేలిందని అన్నారు. నకిలీ డాక్యుమెంట్స్‌టో తనను మోసం చేసిన లతారజనీకాంత్‌పై తగిన చర్యలు తీసుకోవాలని పిటిషన్‌లో కోరారు.
 
ఆ పిటిషన్‌పై స్పందించిన బెంగుళూరు కోర్టు  పిటిషనదారుడిని కర్ణాటక హైకోర్టును ఆశ్రయించాల్సిందిగా సూచించింది. దీంతో పిటిషనదారుడు కర్ణాటక హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.కొంత కాలంగా విచారణలో ఉన్న ఈ కేసులో గురువారం న్యాయమూర్తి ప్రదీప్.టీ.వైన్‌కంకర్ సమక్షంలో విచారణకు వచ్చింది.అభీర్‌చంద్ నెహర్ దాఖలు చేసిన పిటిషన్‌ను విచారణ జరిపిన ఆయన లతారజనీకాంత్‌పై ఆరోపణలకు పిటిషన్‌దారుడు సరైన ఆధారాలు చూపలేకపోయారంటూ కేసును న్యాయమూర్తి కొట్టివేశారు.

మరిన్ని వార్తలు