నిరాడంబరంగా న్యాయవాది నందిని పెళ్లి

12 Jul, 2019 06:43 IST|Sakshi
నందిని, గుణజ్యోతిబసు దంపతులు

తమిళనాడు, పెరంబూరు: మద్య నిషేధం కోసం పోరాటం చేస్తున్న న్యాయవాది నందిని వివాహం బుధవారం నిడారంబరంగా జరిగింది. వివరాలు.. మదురైకి చెందిన న్యాయవాది నందిని, ఆయన తండ్రి ఆనందన్‌లు మద్య నిషేధం కోసం పోరాటం  చేస్తున్నారు. నందినికి ఆమె తండ్రి స్నేహితుడి కొడుకు గుణజ్యోతిబసుతో వివాహం నిశ్చయం అయ్యింది. ఈ నెల 5వ తేదీన వీరి వివాహం జరగాల్సి ఉంది. ఈ క్రమంలో ఇటీవల నందిని, ఆమె తండ్రి ఆనందన్‌ మద్యనిషేధం కోరుతూ శివగంగై జిల్లాలో పోరాటం చేయడంతో పోలీసులు అరెస్ట్‌ చేశారు.

వారిని తిరుపత్తూర్‌ కోర్టులో హాజరుపరచగా కోర్టును ధిక్కరించిన కేసులో వారికి న్యాయస్థానం జైలు శిక్ష విధించింది. వారిని మదురై జైలుకు తరలించారు. దీంతో నందిని పెళ్లి ఆగిపోయింది. ఇదిలాఉండగా నందిని, ఆమె తండ్రి ఆనందన్‌లు మూడు రోజుల క్రితం బెయిల్‌పై విడుదలయ్యారు. ఈ పరిస్థితుల్లో నందిని పెళ్లిని వెంటనే జరిపించాలని ఆమె తండ్రి నిర్ణయించుకున్నాడు. దీంతో బుధవారం మదురై జిల్లా, తెన్నమల్లూర్‌లోని వారి కులదైవం పట్టవన్‌ స్వామి అలయంలో నిరాడంబరంగా నందిని, గుణ జ్యోతిబసుల వివాహం జరిగింది. అనంతరం వధూవరులిద్దరూ కుల దైవం సన్నిధిలో ఇకపై తామ వ్యక్తిగత జీవితంతో పాటు సామాజిక సేవలోనూ శ్రద్ధ చూపుతామని ప్రతిజ్ఞ చేశారు. 

మరిన్ని వార్తలు