లీకేజీల పర్వం.. తీరని దాహం

14 Oct, 2016 15:43 IST|Sakshi
లీకేజీల పర్వం.. తీరని దాహం
  లీకేజీలకు నిలయంగా కోయిల్‌సాగర్
  మరమ్మతుల పేరిట నీటి సరఫరాకు ఇబ్బందులు
  నీటిఉధృతి తట్టుకోలేక పగిలిపోతున్న పైపులు
 
మహబూబ్‌నగర్ రూరల్: పాలమూరు పట్టణ ప్రజల దాహార్తిని శాశ్వతంగా తీర్చాలనే సంకల్పంతో ఏర్పాటుచేసిన కోయిల్‌సాగర్ లిఫ్ట్ ఇరిగేషన్ పథకం తరచూ లీకేజీలకు గురవుతుండడంతో స్థానికులు నీటికోసం అనేక తంటాలు పడుతున్నారు. 2007లో పబ్లిక్‌హెల్త్, మున్సిపల్ ఇంజనీరింగ్ శాఖ వారు ఈ పథకానికి శ్రీకారం చుట్టారు. పైప్‌లైన్ల ఏర్పాటు విషయంలో, పనుల నిర్వాహణ విషయంలో మున్సిపల్ అధికారులు పూర్తి నిర్లక్ష్యంగా వ్యవహరించారు. ఈ నిర్లక్ష్యమే పాలమూరు పట్టణ ప్రజలకు తరచూ తాగునీటి ఇబ్బందులను తెస్తుంది. కోయిల్‌సాగర్ నుంచి మహబూబ్‌నగర్ వరకు ఏర్పాటుచేసిన పైప్‌లైన్ నాణ్యవంతంగా లేకపోవడంతో ఎక్కడ పడితే అక్కడ పైపులు లీకేజీలు అవుతున్నాయి. అందువల్ల కోయిల్‌సాగర్ లిఫ్ట్ ఇరిగేషన్ పథకం లీకేజీలకు కేరాఫ్ అడ్రస్‌గా మారింది. అధికారులు ఎప్పటికప్పుడు జాగ్రత్తలు తీసుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో పట్టణంలో కేఎల్‌ఐ పథకం ద్వారా తాగునీటి సరఫరా అయ్యే ప్రాంతాలు ప్రజలు తాగునీటి కోసం తంటాలు పడుతున్నారు. 
 
15 రోజులకోసారి పైప్‌లైన్ల లీకేజీలు
కోయిల్‌సాగర్ తాగునీటి పథకం కోసం ఏర్పాటుచేసిన పైపులు 15 రోజులకోమారు పగిలిపోతుండడంతో పట్టణ ప్రజలకు నీటి సమస్య ఎదురవుతుంది. పథకం ప్రారంభ సమయంలో నాణ్యమైన పైపులను ఏర్పాటు చేసింటే ఇప్పుడు ఈ పరిస్థితి వచ్చేది కాదని పలు రాజకీయ పార్టీల నాయకులు అభిప్రాయ పడుతున్నారు. అప్పట్లో సంబంధిత అధికారులు మాముళ్లకు కక్కుర్తిపడి పైపులు ఏ మేరకు నాణ్యతగా ఉన్నాయానే విషయాన్ని గమనించకుండా పైపుల బిగింపు పూర్తి చేయడంతో ఇప్పుడు అసలు సమస్య తలెత్తుతుంది. తరచూ పైపులు లీకేజీలు అవుతుండడంతో ప్రజలు సైతం విసిగెత్తుకుంటున్నారు.
 
ఈ క్రమంలో వారంరోజుల క్రితం బండమీదిపల్లి సమీపంలో గల సరస్వతి శిశుమందిర్ పాఠశాల, ధర్మాపూర్ సమీపంలో  జేపీఎన్‌సీ వద్ద మళ్లీ పైపులు పగిలిపోవడంతో నీటి సరఫరా నిలిచిపోయింది. దీంతో పట్టణ ప్రజలు నీటి కోసం అల్లాడారు. మున్సిపల్ అధికారులు మాత్రం తీరికగా పైప్‌లైన్ లీకేజీలకు మరమ్మతులు చేయిస్తుండడంతో పలు విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈ విషయమై మున్సిపల్ ఏఈ వెంకన్నను వివరణ కోరగా ‘కోయిల్‌సాగర్ పైప్‌లైన్ లీకేజీ అయిన మాట వాస్తవమే. నీటి ఉద్ధతిగా ఉన్నందున పైపులు లీకేజీలు అవుతున్నాయి. అయినా మరమ్మత్తులు చేయించి నీటి సరఫరాకు చర్యలు తీసుకుంటున్నామని’ చెప్పారు.
మరిన్ని వార్తలు