'ఆరు నెలల్లో నేర్చుకోండి.. లేదంటే పీకేస్తాం'

8 Aug, 2017 15:36 IST|Sakshi
'ఆరు నెలల్లో నేర్చుకోండి.. లేదంటే పీకేస్తాం'

బెంగళూరు: ఆరు నెలల్లో కన్నడం నేర్చుకోకుంటే ఉద్యోగంలో నుంచి తీసి పారేస్తామంటూ కర్ణాటక ప్రభుత్వం బ్యాంకు ఉద్యోగులను హెచ్చరించింది. తమ రాష్ట్రంలోని వివిధ బ్యాంకుల్లో పనిచేసే తమ భాషేతర బ్యాంకు మేనేజర్లనే లక్ష్యంగా చేసుకొని ఈ ఆదేశాలు జారీ చేసినట్లు తెలుస్తోంది. ఈ మేరకు కర్ణాటక అభివృద్ధి సంస్థ(కేడీఏ) ఒక ఆదేశాన్ని ఇచ్చింది. మున్ముందు బ్యాంకు లావాదేవీలన్నీ కూడా స్థానికుల భాషలకు అనుగుణంగా జరగాలని అలా చేసినప్పుడే గ్రామీణ ప్రాంతాల్లో వారికి సైతం బ్యాంకుల సేవలు అందుబాటులోకి వెళతాయంటూ అందులో పేర్కొంది.

ఇటీవల ఓ కస్టమర్‌ తన చెక్‌పై కన్నడ రూపంలో రాశాడని ఆ వ్యక్తిని ఐసీఐసీఐ బ్యాంకు కోర్టుకు ఈడ్చిందని ఈ క్రమంలో ఇకపై బ్యాంకు మేనేజర్లంతా కూడా తప్పకుండా ఆరు నెలల్లో కన్నడం నేర్చుకోవాలని, స్థానిక భాషకు అనుకూలంగానే లావాదేవీలు కొనసాగించాలని అందులో పేర్కొంది. అయితే, కేడీఏకు ఓ బ్యాంకు అధికారిని తొలగించే అధికారం ఉందా లేదా అనే విషయం స్పష్టం కానప్పటికీ దీని ద్వారా మరోసారి భాష పరమైన వివాదం తలెత్తినట్లు స్పష్టమవుతోంది. అంతేకాదు, ట్విట్టర్‌లో పలువురు తమకు బ్యాంకు సేవలు కన్నడంలో కావాలంటూ పెద్ద ఉద్యమాన్ని లేవదీస్తున్నారు.

మరిన్ని వార్తలు