పోరాటానికి వామపక్షాల మద్దతు

11 Aug, 2015 02:09 IST|Sakshi
వైఎస్సార్‌సీపీ ధర్నాలో ప్రసంగిస్తున్న సీతారాం ఏచూరి, జయదేవన్

- కేంద్రం జోక్యం చేసుకోకపోవడాన్ని ఖండిస్తున్నామన్న ఏచూరి
- సీపీఐ నుంచి సంఘీభావం తెలిపిన ఎంపీ జయదేవన్
సాక్షి, న్యూఢిల్లీ:
ఏపీకి ప్రత్యేకహోదా కల్పించాలనే డిమాండ్‌తో వైఎస్సార్‌సీపీ ఢిల్లీలో నిర్వహించిన ధర్నాకు వామపక్షాలు మద్దతు పలికాయి. ఈ  పోరాటానికి తాము మద్దతు తెలుపుతున్నామని సీపీఐ, సీపీఎంలు ప్రకటించాయి. మధ్యాహ్నం 3 గంటలకు జగన్ ప్రసంగం ప్రారంభమైన కొద్దిసేపటికి సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి రాగా.. ఆయనను ఆహ్వానిస్తూ ప్రసంగించాలని జగన్ కోరారు. దాంతో ఏచూరి మాట్లాడారు.

‘మీ న్యాయమైన డిమాండ్‌పై నేను ఏకీభవిస్తున్నా. పూర్తి మద్దతు ఇవ్వడానికి నేడు మీ ముందున్నా.. పార్లమెంటులో విభజన అంశం వచ్చిననాడే మేం వ్యతిరేకించాం. కానీ వినిపించుకోలేదు. బీజేపీ నాయకులు అప్పుడు పదేళ్లు ప్రత్యేక హోదా కావాలన్నారు. ఏడాది దాటినా ఏ సమస్యా పరిష్కారం కాలేదు. కేంద్రం వైఖరిని ఖండిస్తున్నాం. దీనిపై అందరం కలిసి పోరాడాల్సిన అవసరం ఉంది. ప్రత్యేకహోదాపై పోరాటం చేస్తున్న వైఎస్సార్‌సీపీకి, వైఎస్ జగన్‌కు పూర్తి మద్దతు తెలుపుతున్నాం..’ అని ప్రకటించారు. సీపీఐ ఎంపీ జయదేవన్ ధర్నాను ఉద్దేశించి మాట్లాడుతూ...‘ప్రత్యేక హోదాపై వైఎస్సార్‌సీపీ పోరాటానికి మద్దతు తెలుపుతున్నాం. హోదా సాధించే వరకూ వైఎస్సార్‌సీపీ పోరాటంలో భాగస్వామ్యులమవుతాం..’ అని పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు