‘లాటరీ’ లేదు

6 Feb, 2015 01:47 IST|Sakshi

విధాన పరిషత్‌కు వెల్లడించిన  ముఖ్యమంత్రి సిద్ధరామయ్య
 
బెంగళూరు : రాష్ట్రంలో లాటరీ అమ్మకాలను పునఃప్రారంభించే ప్రసక్తే లేదని ముఖ్యమంత్రి సిద్దరామయ్య తేల్చిచెప్పారు. విధానపరిషత్ కార్యకలాపాల్లో భాగంగా గురువారం జీరో అవర్‌లో జేడీఎస్ సభ్యుడు బసవరాజ్ హొరట్టి అడిగిన ప్రశ్నకు సిద్ధరామయ్య సమాధానమిస్తూ... ప్రజలకు అందించే ఆరోగ్య, ఇతర సంక్షేమ పథకాల అమలుకు  లాటరీలను అమ్మి నిధులను సేకరించాల్సిన దుస్థితి రాష్ట్ర ప్రభుత్వానికి పట్టలేదని కాస్తంత ఘాటుగా సమాధానమిచ్చారు. ప్రస్తుతం రాష్ట్ర ఖజానా సుభిక్షంగా ఉందని పేర్కొన్నారు. నిరుపేదలకు నాణ్యమైన వైద్య సదుపాయాలను చేరువ చేసేందుకు గాను రాష్ట్ర ప్రభుత్వం తిరిగి లాటరీ అమ్మకాలను ప్రారంభించనుందని, రాష్ట్ర ప్రణాళికా సంఘం సైతం ఇదే విషయాన్ని ప్రభుత్వానికి సూచించిందని కొన్ని రోజులుగా వార్తలు వెలువడుతున్న విషయం తెలిసిందే.

ఇక బుధవారం జరిగిన కాంగ్రెస్ శాసనసభా పక్ష సమావేశంలో సైతం లాటరీ అమ్మకాల నిర్ణయంపై నేతల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. దీంతో ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఈ వార్తలన్నింటికి తెరదించే ప్రయత్నం చేశారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి సంతృప్తి కరంగా ఉందని, ప్రజల నుంచి వసూలు చేసే పన్నుల ద్వారానే ప్రజలకు అవసరమైన సంక్షేమ పథకాలను అమలు చేస్తామని వెల్లడించారు. ఇక లాటరీల అమ్మకం ద్వారా పేదలకు నాణ్యమైన వైద్య సేవలందించాలని  రాష్ట్ర ప్రణాళికా సంఘం సూచించిందనడంలో కూడా ఎలాంటి వాస్తవం లేదని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య స్పష్టం చేశారు.
 
 

మరిన్ని వార్తలు