అసెంబ్లీలోకి నిమ్మకాయ నిషిద్ధం

5 Jul, 2019 07:25 IST|Sakshi
భద్రతా సిబ్బంది స్వాధీనం చేసుకున్న నిమ్మకాయ

విధానసౌధలో వింత నిబంధన  

యశవంతపుర (బెంగళూరు): సాధారణంగా సిగరెట్లు, గుట్కా, మద్యం వంటివాటిని చట్టసభల ఆవరణలోకి అనుమతించరు. కానీ అసెంబ్లీ భవనం విధానసౌధలోకి నిమ్మకాలను తీసుకెళ్లడం కూడా నిషిద్ధమే. గురువారం కొందరు వ్యక్తులు నిమ్మకాయలను తీసుకెళ్తుండగా గేట్ల వద్ద భద్రతా సిబ్బంది అడ్డుకుని స్వాధీనం చేసుకున్నారు. తనిఖీల్లో భాగంగా టిఫిన్, లంచ్‌ క్యారియర్లు, జేబుల్లో నిమ్మకాయలు దొరికితే వెంటనే తీసుకుని చెత్త కుండీలో పడేస్తున్నారు. ఆరోగ్యం సరిగాలేదని, మధ్య మధ్యలో నిమ్మరసం తాగాలని ఉద్యోగులు, సందర్శకులు చెబుతున్నా భద్రతా సిబ్బంది ససేమిరా అంటున్నారు.

చేతబడి భయమా  
దీనికంతటికీ కారణం మూఢనమ్మకాలే. సందర్శకులు, కాంట్రాక్టర్లు మంత్రించిన నిమ్మకాలను తీసుకెళ్లి అధికారులను ప్రభావితం చేసి పనులు చేయించుకుంటారని భద్రత సిబ్బంది అనుమానిస్తున్నారు. దీంతో పాటు చేతబడి చేసిన నిమ్మకాయలను తీసుకెళ్లి మంత్రుల చాంబర్లలో వేస్తారనే భయాలూ ఉన్నాయి. ఇకపై విధానసౌధకు నిమ్మకాయలను తేవడాన్ని నిషేధించినట్లు అధికారులు తెలిపారు. గతంలో బీజేపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు వీటిపై అనేక చర్చలు జరిగాయి. ఇది ఎలా ఉన్నా, సీఎం కుమారస్వామి అన్న, ప్రజాపనుల మంత్రి హెచ్‌డీ రేవణ్ణ నిత్యం చేతిలో నిమ్మకాయను పట్టుకుని ఉంటారు. ఈ నిషేధం ఆయనకు వర్తిస్తుందా? అని సౌధ సిబ్బంది గుసగుసలాడుకుంటున్నారు. 

మరిన్ని వార్తలు