అబ్బా.. హెల్మెట్ పెట్టుకోవాల్సిందేనా..

19 Apr, 2014 22:49 IST|Sakshi

న్యూఢిల్లీ: నగర మహిళలకు ఇకపై తమ హెయిర్ స్టైల్, చెవిరింగులు, లిప్‌స్టిక్ ఇలా ముఖారవిందాన్ని ఎంత అందంగా తీర్చిదిద్దుకున్నా రోడ్లపైకి తన భర్తతోనో, సోదరుడితోనో బైక్‌పై రోడ్డుపైకి వచ్చేటప్పుడు వాటిని ప్రదర్శించే అవకాశం లేదు.. ఎందుకంటే ద్విచక్రవాహనాలపై వెనుక కూర్చుని వెళ్లే మహిళలు సైతం  కచ్చితంగా ెహ ల్మెట్ ధరించాలని ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ నజీబ్ జంగ్ హుకుం జారీచేశారు. రోడ్డుప్రమాదాల్లో మృతుల సంఖ్య గణనీయంగా పెరిగిపోతున్న నేపథ్యంలో ఈ మేరకు నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. అయితే ఇందుకు మహిళలు అంత ఉత్సాహం చూపడం లేదు.
 ఈ ఏడాదిలోనే ద్విచక్రవాహన ప్రమాదాల్లో 105 మంది చనిపోయారు. అందులో 80 శాతం మంది బైక్ వెనుక సీట్లో కూర్చున్నవారే. హెల్మెట్ ధరించని కారణంగానే వారు చనిపోయారని ట్రాఫిక్ పోలీసులు చెబుతున్నారు.
 
 హెల్మెట్ పెట్టుకోకుండా ప్రయాణిస్తున్న దాదాపు లక్షమంది ద్విచక్రవాహన చోదకులపై ఈ సంవత్సరం విచారణ జరిపామని ట్రాఫిక్ అదనపు పోలీస్ కమిషనర్ అనిల్ శుక్లా తెలిపారు. ఇందులో మహిళలు కూడా ఉన్నారు. గత ఏడాది దాదాపు 63 మంది మహిళలు ద్విచక్రవాహన ప్రమాదాల్లో చనిపోయారు. అంతకుముందు ఏడాది 42 మంది ప్రాణాలొదిలారు. ‘ఇన్నాళ్లూ హెల్మెట్ ధరించకుండా బైక్ వెనుక సీట్లో ప్రయాణించే మహిళలను విచారించే హక్కు మాకు లేకపోవడం వల్ల... సలహాలు మాత్రమే ఇచ్చేవాళ్లం..’ అని అన్నారు సీనియర్ ట్రాఫిక్ అధికారి ఒకరు. అయితే ద్విచక్రవాహన ప్రమాదాల్లో చనిపోయేవాళ్లలో మహిళలే ఎక్కువగా ఉంటున్నారని, మహిళలు వాహనంపై ఒకే వైపు కూర్చోవడంతో బ్యాలెన్స్ అవ్వక... ఎత్తుపల్లాలు వచ్చినప్పుడు ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయని నిపుణులు అంటున్నారు.
 
 హెల్మెట్స్ పెట్టుకోవడం లేదెందుకని మహిళలను ప్రశ్నిస్తే  ‘ఎంతో ఖర్చు చేసి జుట్టు అందంగా చేసుకుంటాం. హెల్మెట్ వల్ల అదంతా చెదిరిపోతుంది. అంతేనా... చెవి రింగులు కూడా కనబడవు. చూడటానికి అంత బాగుండదు’ అంటోంది స్కూటీ మీద వెళ్లే కాలేజీ విద్యార్థిని పల్లవి చంద్ర. ఒకవేళ చట్టం అమల్లోకి వస్తే ఓ మంచి హెల్మెట్ కొంటానంటోంది. ‘‘నా భర్త హెల్మెట్ నా తలకు సరిగ్గా ఉండదు. అందుకే అప్పుడప్పుడు తన బైక్ మీద వెళ్లినా నేను ధరించను’ అని అంటోంది గృహిణి అయిన ఇందిరా మాథుర్. అయితే మహిళలు తప్పకుండా హెల్మెట్ ధరించాలనే అభిప్రాయం వ్యక్తం చేసింది. మహిళలు ఇలా అశ్రద్ధగా ఉంటే.. పురుషులు మరో రకంగా స్పందిస్తున్నారు.
 
 ద్విచక్రవాహనాన్ని నడుపుతున్నవారైనా, వెనుక కూర్చున్నవారైనా ఆరుగురిలో ఒకరు మాత్రమే హెల్మెట్ ధరిస్తున్నారు. హెల్మెట్ ధరించిన వారు సైతం గడ్డం కింద ఉన్న బట న్‌ను వదిలేస్తున్నారు. ‘హెల్మెట్ నా తలకు సరిగ్గా సరిపోతుంది. ఇంకా బటన్ పెట్టడం ఎందుకు’ అంటున్నాడు నోయిడాలో పనిచేసే ఓ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ జతిన్ శర్మ. దీనివల్ల ప్రమాదం జరిగినప్పుడు హెల్మెట్ ఎగిరిపోయి ప్రాణాలొదిలిన ఘటనలు 80 శాతం ఉన్నాయంటున్నారు ట్రాఫిక్ అధికారులు.
 

మరిన్ని వార్తలు